గింజ కొనకుండా రూ.కోట్లు కొట్టేయాలన్న వ్యూహం ఎవరిది?
పైస్థాయి నుంచి కిందివరకూ తెలిసే జరిగిందా?
కావాలనే కిందిస్థాయి వారిపై కేసులా?
ట్రక్‌షీట్లలో ధాన్యం కొనుగోళ్లు చూపించి ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టిన కేసు పక్కదారి పడుతోందా?. అసలు సూత్రధారులను వదిలిపెట్టి కిందిస్థాయి వారిపైనే చర్యలు తీసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. పెద్దస్థాయి అధికారుల అండ దండలు లేకుండా ఇంత పెద్దమొత్తంలో ధాన్యం అక్రమంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయడం అంత సులువు కాదని కిందిస్థాయి సిబ్బంది వల్ల జరిగే విషయం కాదని అభిప్రాయపడుతున్నారు. ఒకరిద్దరు రైతుల విషయంలో చేయగలిగే స్థాయి ఉన్న సిబ్బందిపై అక్రమంగా వేల కింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఆరోపణలు సరికాదంటున్నారు. తాత్కాలిక ఆపరేటర్ స్థాయి సిబ్బంది మిల్లర్ల నుంచి అధికారుల వరకూ స్కాం చేయడానికి ఒప్పించడం సాధ్యమయ్యేపనేనా అన్నది అనుమానం.
- ఆత్మకూర్(ఎస్)
గతేడాది డిసెంబరు 24న మండలంలోని గట్టికల్, ముక్కుడుదేవులపల్లి కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను నిలిపివేశారు. అయితే ఏరోజుకారోజు కొనుగోళ్ల వివరాలను ఆన్‌లైన్ చేస్తుంటారు. అయితే కేంద్రం ముగిసే నాటికి గట్టికల్ కేంద్రంలో 15,360.80 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ముక్కుడుదేవులపల్లిలో 20,300 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. అయితే కేంద్రాలు ముగిసిన వారం రోజులకు అదే నెల 31వ తేదీన గట్టికల్‌లో ఏడు వేల క్వింటాళ్లు, ముక్కుడుదేవులపల్లి కేంద్రంలో 4,358 క్వింటాళ్లు అదనంగా చేరాయి. కొనుగోలు కేంద్రాలు ముగిశాక వేల క్వింటాళ్లలో నమోదు కావడంతో అనుమానం వచ్చి విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా ఆయా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై డిసెంబరు 31వ తేదీకి ముందే పీఏసీఎస్ సీఈవో లక్ష్మారెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ప్రాథమిక విచారణలో రూ.33 లక్షలు రికవరీ
ధాన్యం కొనుగోలు పేరుతో జరిగిన అక్రమాలపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ట్రక్ షీట్ల నెంబర్లు 28902, 28906, 28909, 28910, 28912లో 12 మంది బినామీ రైతుల ఖాతాల్లో ధాన్యం అమ్మకున్న డబ్బులు జమఅయ్యాయి. ప్రాథమిక విచారణలో 10వేల క్వింటాళ్లకు పైగానే అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. అందులో భాగంగానే రూ.33 లక్షలు రికవరీ చేశారు. అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలపై అనుమానాలు మొదలయ్యాయి.
ట్రక్ షీట్ ఇచ్చిందెవరు... తెచ్చిందెవరు?
జిల్లా కేంద్రంలోని పౌరసరఫరాల కార్యాలయం నుంచి ట్రక్ షీట్లను ఐకేపీ అధికారులు, సిబ్బంది మాత్రమే తీసుకువస్తుంటారు. అక్కడ కూడా ఆన్‌లైన్ చేశాకే ట్రక్ షీట్లను ఇస్తుంటారు. ఆయా షీట్లలో నెంబర్ల ఆధారంగానే ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యం కొనుగోళ్ల వివరాలను అధికారులు గుర్తిస్తారు. ఈ క్రమంలో గట్టికల్, ముక్కుడుదేవిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం ఎగుమతి చేసినట్లుగా చూపిస్తున్నట్లు ట్రక్ షీట్‌ను డీఎం కార్యాలయం నుంచి ఎవరు తీసుకువచ్చారు. ఆ నెంబర్లను ఆ కార్యాలయంలో ఎవరు ఆన్‌లైన్‌లో నమోదు చేశారన్నది తేలాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈ ట్రక్ షీట్‌ను ఓ రాజకీయ నాయకుడు తెచ్చాడని బయట ప్రచారం సాగుతోంది. బుక్‌ను ఆన్‌లైన్ చేసిన అధికారిని విచారిస్తే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందంటున్నారు.
ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలు?
ధాన్యం అక్రమ కొనుగోళ్ల కేసు విచారణ కొనసాగుతుండటంతో పౌర సరఫరాల శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. కార్యాలయ సిబ్బంది ఫోన్లను ట్యాంపరింగ్ చేస్తున్నారని; మీడియా, ఇతర వ్యక్తులతో ఫోన్‌లో కేసు విషయాలను పంచుకోవద్దని అధికారి ఆదేశించినట్లు సమాచారం. దీంతో సివిల్‌సప్లయ్ కార్యాలయ సిబ్బంది తెలిసిన వారితో తప్ప మరే ఇతరులతో మాట్లాడటం లేదని తెలిసింది. అక్రమాల కేసు నుంచి అధికారి బయటపడేందుకే సిబ్బందిని ఫోన్లకు దూరంగా ఉంచినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కిందిస్థాయి వారిపైనే...
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై పౌరసరఫరాల శాఖ అధికారి రాంపతి ఫిర్యాదు మేరకు ఆత్మకూర్ (ఎస్) పోలీసులు ఈ నెల 13వ తేదీన ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా పండగ రోజు వీబీకే దయాకర్, ఆపరేటర్ సంపత్, ఏపీఎం వెంకన్న, ఐకేపీ సీపీ నాగయ్యలను అదే రోజు అదుపులోకి తీసుకున్నారు. మరుసటి రోజు సీఈవో లక్ష్మారెడ్డి, ఆపరేటర్ గణే్‌షలను అదుపులోకి తీసుకున్నారు. విచారణ పేరుతో ఫిర్యాదు చేసిన సీఈవో లక్ష్మారెడ్డిని సైతం ఇబ్బందులకు గురిచేసినట్లు సమాచారం. అనంతరం పోలీసుల విచారణలో ఆరుగురు ఇచ్చిన సమాచారంతో సూర్యాపేట కౌన్సిలర్‌తో పాటు ఆమె కుమారుడు, మిల్లు యజమాని కూడా పాలుపంచుకున్నట్లు నిర్ధారించారు. అయితే బుధవారం పోలీసులు అరెస్టు చూపించిన వారిలో అదుపులోకి తీసుకున్న ఆరుగురిలో ఇద్దరు ఆపరేటర్లు సంపత్, గణే్‌షలు మాత్రమే ఉండ టం గమనార్హం.
బంధువుల పేరిట విక్రయాలు
కొనుగోలు కేంద్రంలో ఆపరేటర్ వేములకొండ గణేష్, అతని తల్లి, సూర్యాపేట మునిసిపల్ వార్డు కౌన్సిలర్ వేములకొండ పద్మ, జిల్లా కోఆపరేటివ్ సొసైటీ జూనియర్ అసిస్టెంట్ తెల్ల ప్రవీణ్‌కుమార్, నేరేడుచర్ల మండలంలోని ముకుందాపురం లక్ష్మిసహస్ర రైస్ మిల్లు యాజమాని చీమట చిరంజీవి, ధనలక్ష్మి రైస్ మిల్లు యజమాని కోటేశ్వర్‌రావు, గట్టికల్ కేంద్రం నిర్వాహకుడు జూకటి సంపత్ కుమ్మకై రైతుల వద్ద ధాన్యం కొనకున్నా వేములకొండ పద్మ, గణే్‌షలు వారికి తెలిసిన, బంధువుల పేరిట ధాన్యం కొనుగోలు చేసినట్లు ట్రక్ షీట్స్ తయారుచేశారు. ముక్కుడుదేవులపల్లి కేంద్రం నుంచి రూ.34,16,672విలువైన 1743.82 క్వింటాళ్ల ధాన్యం, గట్టికల్ నుంచి రూ.51,72,048విలువైన 2638.20క్వింటాళ్ల ధాన్యం విక్రయించినట్లు లక్ష్మీసహస్ర మిల్లుకు, పరెడ్డిగూడెంకు చెందిన ధనలక్ష్మి మిల్లుకు పంపినట్లు చూపించి ప్రభుత్వాన్ని మోసం చేశారు. ఈ కేసులో రెండు మిల్లుల నుంచి రూ.76,96,528 నగదును రికవరీ చేశారు. ఈ అక్రమాలకు కారకులైన ఆపరేటర్ వేములకొండ గణేష్, జూకటి సంపత్, కోఆపరేటివ్ శాఖ ఉద్యోగి తెల్ల ప్రవీణ్‌కుమార్, రైస్ మిల్లు యజమాని చీమట చిరంజీవి, సూర్యాపేట మునిసిపల్ కౌన్సిలర్ వేములకొండ పద్మను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సూర్యాపేట డీఎస్పీ మోహన్‌రావు తెలిపారు.