Abn logo
Sep 2 2021 @ 00:03AM

ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..!

కాంగ్రెస్‌ అభర్థి ఎవరు?

ఏకాభిప్రాయానికి రాని నేతలు

తెరపైకి స్థానికత అంశం

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌): హుజూరాబాద్‌ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికలో పోటీలో నిలిపే అభ్యర్థులను ప్రకటించి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, భారతీయ జనతా పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్‌ మాత్రం ఆ విషయంలో ఇంకా మల్లగుల్లాలు పడుతున్నది. నియోజకవర్గంలో నెల రోజుల పాటు అభిప్రాయ సేకరణ నిర్వహించారు. హైదరాబాద్‌లో, జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. అయినా అభ్యర్థిని ఎంపికపై ఇప్పటి వరకు తేల్చలేదు. హుజూరాబాద్‌లో పోటీ చేయాలని భావిస్తూ టికెట్‌ కోరుకునే ఆశావహులు బుధవారం నుంచి ఈ నెల 5 వరకు దరఖాస్తులు చేసుకోవాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌గౌడ్‌ కోరారు. ఈ నెల 10న వచ్చిన దరఖాస్తులన్నింటిని ఏఐసీసీకి పంపించి వారి పరిశీలన తర్వాత అభ్యర్థిని ఖరారు చేస్తారని ఆయన చెప్పారు. దీంతో బుధవారం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో హుజూరాబాద్‌ మండలం కనుకుంట్ల గ్రామానికి చెందిన జాలి కమలాకర్‌ రెడ్డి, సైదాపూర్‌ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన ఒంటెల లింగారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.


అభిప్రాయ సేకరణ నిర్వహించిన దామోదర రాజనర్సింహ

తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌ ఆ పార్టీ అభ్యర్థిగా ఖరారయ్యారు. ఈటల రాజేందర్‌ బీసీ వర్గానికి చెందిన నేత కావడంతో టీఆర్‌ఎస్‌ కూడా అదే వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ కూడా బీసీ అభ్యర్థినే బరిలో దింపాలనే ప్రతిపాదన వచ్చింది. నియోజకవర్గ ఎన్నికల బాధ్యతను మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు కాంగ్రెస్‌ పార్టీ అప్పగించింది. ఆయన నియోజకవర్గ పరిధిలో ఉన్న ఐదు మండలాల్లో పర్యటించి కాంగ్రెస్‌ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, పార్టీ శ్రేణులతో సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. ఆ మేరకు ఆయన స్థానికులకే టికెట్‌ ఇవ్వాలని సూచించారు. ప్రధానంగా కిసాన్‌ సెల్‌ నాయకుడు పత్తి కృష్ణారెడ్డితోపాటు మరో ఒకటి రెండు పేర్లు ప్రతిపాదనకు వచ్చాయని సమాచారం. తాను సేకరించిన అభిప్రాయాల నివేదికను దామోదర రాజనరసింహ అధిష్ఠానానికి నివేదించారు. 


కొండా సురేఖ పేరు తెరపైకి వచ్చినా..

బీసీని పోటీలో నిలపాలనే ప్రతిపాదన వచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రి కొండా సురేఖ పేరు తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ సమక్షంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గత గురువారం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, అసెంబ్లీ సమన్వయకర్తలు, పార్టీ ముఖ్యులతో గాంధీ భవన్‌లో సమావేశం జరిగింది. సీఎల్పీ నేతలు, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్లతో మరో భేటీ నిర్వహించారు. ఈ భేటీల్లో హుజూరాబాద్‌ అభ్యర్థి విషయంలో సుదీర్ఘ చర్చ జరగగా కొండా సురేఖ అభ్యర్థిత్వంపై మెజార్టీ నేతలు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆమె పేరు అధికారికంగా ప్రకటించాలని భావించగా దామోదర రాజనరసింహ మాత్రం స్థానికులకు టికెట్‌ ఇవ్వాలని సూచించడంతో ఆయనకు నచ్చజెప్పడానికి నిర్ణయం వాయిదా వేశారని పార్టీలో ప్రచారం జరిగింది.


కొండా సురేఖ పద్మశాలి సామాజికవర్గానికి చెందినవారుకాగా ఆమె భర్త మురళి కాపు సామాజికవర్గానికి చెందినవారు. ఈ రెండు సామాజికవర్గాలకు కలిపి హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 55 వేల పైచిలుకు ఓట్లు ఉండడం కలిసి వచ్చే అంశంగా కాంగ్రెస్‌ నేతలు భావించారు. దాంతో ఆమెనే అభ్యర్థిగా నిలపాలని ఒక అభిప్రాయానికి వచ్చినా ఏకాభిప్రాయం సాధ్యం కాకపోవడంతో ఏఐసీసీ పైనే బాధ్యతను వేశారు. సీల్డ్‌ కవర్‌లో కొందరి పేర్లను ఏఐసీసీకి ప్రతిపాదించారని పార్టీలో ప్రచారం జరుగుతుండగా మరోవైపు జిల్లా కేంద్రంలో అభ్యర్థిత్వం కోరే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడాన్ని ప్రారంభించారు. దీంతో కాంగ్రెస్‌ అభ్యర్థి వ్యవహారం తిరకాసులో పడిందని, అభ్యర్థి విషయంలో నాయకులు తలోదారి పట్టడంతో ఇప్పుడిప్పుడే అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశం లేదని భావిస్తున్నారు. 


జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలైన జీవన్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు కూడా స్థానికులకే టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలోని నేతలు అలాగే ఉప ఎన్నిక ఇన్‌చార్జి అభిప్రాయానికి కొంత బలం చేకూరింది. దరఖాస్తులు స్వీకరణ ముగిసిన తర్వాత ఈ నెల 10న ఏఐసీసీకి వారి పేర్లు వెళితే మరో నాలుగైదు రోజుల తర్వాతగాని ఏ నిర్ణయం వెలువడే అవకాశం లేదని భావిస్తున్నారు. ఒకవైపు టీఆర్‌ఎస్‌, బీజేపీ రెండు నెలలుగా ఒక్కో గ్రామాన్ని రెండు మూడు సార్లు ప్రచారం చేస్తూ చుట్టి వస్తుండగా ఇంకా అభ్యర్థి ఎంపిక విషయంలోనే ఇబ్బందిపడుతున్న కాంగ్రెస్‌ వ్యవహారాన్ని ఆ పార్టీ కార్యకర్తలే జీర్ణించుకోలేక పోతున్నారు.