ఈ నడ్డా ఎవరు?: రాహుల్ రివర్స్ కౌంటర్

ABN , First Publish Date - 2021-01-20T01:24:50+05:30 IST

మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ మాట్లాడుతూ ‘‘నడ్డా ఎవరు? నేను ఆయనకెందుకు సమాధానం ఇవ్వాలి? ఆయనేమైనా నా ప్రొఫెసరా? నేను ప్రజలకు సమాధానం చెప్తాను. దేశానికి సమాధానం చెప్తాను’’

ఈ నడ్డా ఎవరు?: రాహుల్ రివర్స్ కౌంటర్

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలంటూ ప్రశ్నలు సంధించిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాహుల్ గాంధీ అదే స్థాయిలో తిరిగి ప్రశ్నించారు. ‘‘జేపీ నడ్డా ఎవరు? ఆయనకు నేనెందుకు సమాధానం చెప్పాలి?’’ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఓ గ్రామాన్ని చైనా అక్రమంగా నిర్మించిందని వార్తలు రావడంతో దేశ భద్రత విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దీంతో జేపీ నడ్డా స్పందిస్తూ రాహుల్ గాంధీపై ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.


‘‘రాహుల్ గాంధీ, ఆయన వంశం, కాంగ్రెస్ చైనా గురించి అబద్ధాలు చెప్పడం ఎప్పుడు ఆపుతారు? ఆయన ప్రస్తావించిన అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతంతో సహా వేలాది కిలోమీటర్ల భూమిని చైనాకు బహుమతిగా ఇచ్చినది మరెవరో కాదు పండిట్ నెహ్రూయేననే విషయాన్ని ఆయన నిరాకరించగలరా? చైనాకు కాంగ్రెస్ మళ్ళీ మళ్ళీ ఎందుకు లొంగిపోతోంది?’’ అని నడ్డా ప్రశ్నించారు.


మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ మాట్లాడుతూ ‘‘నడ్డా ఎవరు? నేను ఆయనకెందుకు సమాధానం ఇవ్వాలి? ఆయనేమైనా నా ప్రొఫెసరా? నేను ప్రజలకు సమాధానం చెప్తాను. దేశానికి సమాధానం చెప్తాను’’ అని రాహుల్ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ఇక వ్యవసాయ చట్టాలపై మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికే మూడు వ్యవసాయ చట్టాల్ని రూపొందించారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనకు నేను 100 శాతం మద్దతు ఇస్తున్నాను. నేనే కాదు, దేశంలోని ప్రతి ఒక్కరు ఈ పోరాటానికి మద్దతు ఇస్తున్నారు. దేశం మొత్తం రైతులకు మద్దతు ఇస్తోంది’’ అని రాహుల్ అన్నారు.

Updated Date - 2021-01-20T01:24:50+05:30 IST