ఆర్టీసీని ఎవరు ఎందుకు చంపుతున్నారు?

ABN , First Publish Date - 2021-08-05T07:52:01+05:30 IST

అద్భుతమైన మానవ వనరులున్న సంస్థ తెలంగాణ ఆర్టీసీ. ప్రతి సెకను శ్రమిస్తున్న కార్మికుల స్వేదం, రుధిరంతో సంస్థ అనేక రికార్డులను...

ఆర్టీసీని ఎవరు ఎందుకు చంపుతున్నారు?

అద్భుతమైన మానవ వనరులున్న సంస్థ తెలంగాణ ఆర్టీసీ. ప్రతి సెకను శ్రమిస్తున్న కార్మికుల స్వేదం, రుధిరంతో సంస్థ అనేక రికార్డులను స్వంతం చేసుకుంది. అలాంటి ఆర్టీసీ తాజా ఆర్థిక పరిస్థితి దిగ్ర్భాంతికరంగా ఉంది. పాలకుల సహాయ నిరాకరణ, యాజమాన్య అనాలోచిత నిర్ణయాల మూలంగా ఆర్టీసీ నేడు కోలుకోలేని స్థితిలో ఉంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీ నష్టాలు 928 కోట్ల రూపాయలు కాగా, 2021కి అసాధారణ రీతిలో 2329 కోట్ల రూపాయలకు చేరాయి. అప్పు కూడా అదే రీతిలో 2445 కోట్ల రూపాయలకు పెరిగింది. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ప్రగతిరథ చక్రాలు కదిలే స్థితిలో లేవు. 


తెలంగాణ ఆర్టీసీవి సహజ నష్టాలు కావు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఆర్టీసీకి టిక్కెట్ల రూపంలో వచ్చే ఆదాయంలో వాటా పొందే విధానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండేది. దానినే తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తోంది. పూర్తి నష్టాల్లో ఉన్న పల్లె వెలుగు, సిటీ సర్వీసుల నిర్వహణలోను ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటు కల్పించడం లేదు. పాలకుల ఆదేశాలపై ఆర్టీసీ వివిధ వర్గాలకు ఇస్తున్న బస్సు పాసుల రాయితీలను కూడా తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఆర్టీసీకి తిరిగి చెల్లించడం లేదు. ఇక టోల్‌ప్లాజా, సేల్స్‌టాక్స్‌, వ్యాట్‌, జియస్టీ పేరుతో ఆర్టీసీని పాలకులు నిలువు దోపిడీ చేస్తున్నారు. దానికితోడు రోజురోజుకు పెరుగుతున్న డీజిల్‌ ధర ఆర్టీసీని జీవచ్ఛవంగా మార్చింది. మరోవైపు డీజిల్‌పై అమ్మకం పన్నును పాలకులు గుట్టుచప్పుడు కాకుండా 23 నుండి 28 శాతానికి పెంచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అక్రమంగా ప్రయాణికులను రవాణా చేసే వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఏతావాతా ఆర్టీసీ బస్సు ఒక్క కిలోమీటరు తిరిగితే 35 రూపాయలు ఆదాయం వస్తుంటే, ఖర్చుమాత్రం 55 రూపాయలకు చేరింది. దాంతో సగటున రోజుకు కోటి రూపాయల నష్టాన్ని మూటకట్టుకుంటోంది.


ఇప్పటికీ ప్రభుత్వ లెక్కల ప్రకారం 1300 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. రవాణా అవసరాలు సాలీనా 15 శాతం పెరుగుతున్నా, దానికి తగ్గట్టుగా ఆర్టీసీ విస్తరణ జరగకపోగా, క్షీణిస్తోంది. ఆర్టీసీ మనుగడలో ఉంటేనే సాధారణ చార్జీలతో ప్రజలకు రవాణా సౌకర్యం లభిస్తుంది. వికలాంగులు, ఉద్యోగులు, విద్యార్థులు, జర్నలిస్టులు, సీనియర్‌ సిటిజన్లకు రాయితీలు ఉంటాయి. షెడ్యూల్డు కులాలు, జాతులు, వెనుకబడిన తరగతులు, మహిళలకు ఆర్టీసీ ఉద్యోగాలలో రిజర్వేషన సౌకర్యం ఉంటుంది.  ఆర్టీసీకి రాష్ట్రంలోని ఏ ఇతర సంస్థలకు లేని విధంగా రాజధాని నడిబొడ్డున, జిల్లా కేంద్రాలలోను అతి విలువైన 14 వందల ఎకరాల భూమి ఉంది. దాన్ని తన్నుకు పోవడానికి మహాకుట్ర జరుగుతోంది. ఆర్టీసీకున్న లక్ష కోట్ల రూపాయల ఆస్తి యావత్తు తెలంగాణ జాతి సంపద. దీని పైన సర్వ హక్కులు ఈ రాష్ట్ర ప్రజలవే. అందువల్ల ఆర్టీసీని పరిరక్షించి, ప్రభుత్వరంగంలో కొనసాగేలా చూసే బాధ్యతను తెలంగాణ ప్రజలే భుజానికి ఎత్తుకోవలసిన అవసరముంది.

కృష్ణతేజ

Updated Date - 2021-08-05T07:52:01+05:30 IST