Abn logo
Sep 27 2021 @ 02:42AM

ఏపీలో డ్రగ్‌ డాన్‌ ఎవరు? ట్రెండింగ్‌లో నిలిచిన హ్యాష్‌టాగ్‌

ట్విటర్‌లో ఆంధ్ర రాజకీయ మంటలు


(అమరావతి - ఆంధ్రజ్యోతి): సామాజిక మధ్యమం ట్విటర్‌లో ఏపీ రాజకీయాలపై మంటలు చెలరేగాయి. ఏపీలో డ్రగ్‌ డాన్‌ ఎవరని ఒకరు, ఏపీలో సన్నాసులంటే ఎవరని మరొకరు, పవర్‌లెస్‌ స్టార్‌ అంటూ ఇంకొకరు... పోటాపోటీ హ్యాష్‌ట్యాగ్‌లను షేర్‌చేస్తూ వరస ట్వీట్‌లతో ఉదయం నుంచి సాయంత్రం వరకు మంటలు పుట్టించారు. ఐక్యరాజ్యసమితిలో ప్రధాని ప్రసంగం విశేషాలు, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ జన్మదినం సహా కీలకమైన అంశాలను దాటుకొని రాష్ట్ర వ్యవహారమే టాప్‌లో నిలిచింది. ఏపీలో మొదలైన ట్వీట్‌లు మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ నుంచి అమెరికా వరకు హోరెత్తించాయి. ఆదివారం సాయం త్రం నాటి గణాంకాల ప్రకారం ఏపీలో డ్రగ్స్‌డాన్‌ ఎవరు? అన్న హ్యాష్‌ట్యాగ్‌ 93 వేల షేర్లతో టాప్‌ 21లో నిలిచింది. ‘పవర్‌లెస్‌ స్టార్‌’ 8,500, ‘సన్నాసులు’ 3,600 షేర్లతో నిలిచాయి.


ఇటీవల భారీగా పట్టుబడ్డ హెరాయిన్‌ కేసులో.... ‘మత్తు వెనుక ఉన్న బాస్‌ ఎవరు?’ అంటూ ప్రతిపక్షాలు పుట్టిస్తున్న ప్రకటనల వేడి ట్విటర్‌కు పాకింది. ఉదయం 8 గంటల నుంచే రాష్ట్రంలో డ్రగ్‌ డాన్‌ ఎవరు? అన్న హ్యాష్‌ట్యాగ్‌ను షేర్‌ చేస్తూ ట్విట్‌లు ప్రారంభమయ్యాయి. 9.20కి ట్విటర్‌ ఇండియాలో 68 వేల ట్వీట్‌లతో ట్రెండింగ్‌లో 21వ స్థానంలో నిలిచింది. దీనికి పోటీగా వైసీపీ కార్యకర్తలు జగన్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ను షేర్‌చేస్తూ 20వేల ట్వీట్‌లు చేశారు. అదే సమయంలో పవన్‌ అభిమానులు తెరమీదకు వచ్చారు. సన్నాసులు అనే హ్యాష్‌ట్యాగ్‌ను షేర్‌చేస్తూ డ్ర గ్స్‌ కేసుపై సంచలన ఆరోపణలు చేశారు. పోటీగా వైసీసీ కార్యకర్తలు పవర్‌లె్‌సస్టార్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ను షేర్‌ చేశారు. ఈ రెండు కలిపి 12,100 ట్వీట్‌లు మాత్రమే పోస్ట్‌ అయ్యాయి. అయితే, ఏపీలో డ్రగ్‌ డాన్‌ ఎవరు? అన్న హ్యాష్‌ట్యాగ్‌ను ఇతర రాష్ట్రాలతోపాటు అమెరికా నుంచి కూడా రీ ట్వీట్‌ చేయడంతో 11:30 గంటల ప్రాంతంలో అది మరింత ట్రెండింగ్‌లోకి వెళ్లి 85వేల మార్క్‌ను దాటేసింది. అదేసమయంలో ఆంధ్రతో, రాజకీయ పార్టీలతో సంబంధం లేని ఇతర రాష్ట్రాల వ్యక్తులు బెంగళూరు, ముంబయి, ఢిల్లీ, గాంఽధీనగర్‌, లక్నో తదితర ప్రాంతాల నుంచీ ఈ చర్చలోకి వచ్చారు. 9వేల కోట్ల హెరాయిన్‌ అఫ్ఘాన్‌ నుంచి తెప్పించిన డాన్‌ ఎవరంటూ రీ ట్విట్‌లు చేయడంతో ట్విటర్‌లో చర్చ పీక్‌కి వెళ్లింది. మధ్యాహ్నం 2 గంటలకు మొత్తం ట్వీట్‌లు 93 వేల మార్క్‌ను దాటిపోయాయి.