ఈ మార్పును అడ్డేదెవరు?

ABN , First Publish Date - 2020-07-22T06:18:28+05:30 IST

ఆగస్టు 5న దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం జరగబోతున్నది. అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ...

ఈ మార్పును అడ్డేదెవరు?

మోదీ కాని, ఆయన వెనుక ఉన్న భావజాలం కానీ లక్ష్యంగా పెట్టుకున్నది ఒక్కటే. తాము అనుకున్న సైద్ధాంతిక భూమిక గల రాజ్యాన్ని, వ్యవస్థను ఏర్పర్చడం, మిగతా అన్ని భావజాలాలు నీరుగారిపోవడం. ఈ లక్ష్య సాధనలో వారు ఎవరి ఆక్రందనలూ వినదలుచుకోలేదు. సైద్ధాంతిక లక్ష్యం ముందు పౌరహక్కులూ, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, వ్యవస్థలు ఎంత? ప్రజల విశ్వాసాల్ని, నమ్మకాల్ని, జన్మభూమిపై మమకారాన్ని తమ సైద్ధాంతిక ఎజెండాలో చేర్చి రాజకీయంగా ఉపయోగించుకోవడంలో ఆరితేరిన బిజెపిని ఎదుర్కొనగలిగేందుకు వినూత్నంగా ఆలోచించే కొత్త శక్తులు ఉద్భవించడం అవసరం. లేదా ప్రజలే బిజెపి వైఫల్యాలను గమనించగలగాలి.


ఆగస్టు 5న దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం జరగబోతున్నది. అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ. భారతీయ జనతా పార్టీకి ఇదొక సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టం. ఆ పార్టీకి సైద్ధాంతిక భూమికను అందించిన రామజన్మభూమి ఉద్యమం సార్థకమై, 28 ఏళ్ల క్రితం ఎవరి కళ్ల ముందైతే ఒక కట్టడం కూలిపోయిందో వారి కళ్లముందే అదే స్థానంలో మందిర నిర్మాణానికి నాంది పలకడం సాధారణ విషయం కాదు. ఇది దేశంలో ఒక సిద్ధాంత ఆధిపత్యానికి, రాజకీయాలపై ఆ సిద్ధాంతం చూపే ప్రభావానికీ, గత కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలకూ, భవిష్యత్‌లో జరిగే పరిణామాలకూ సూచిక.


భారతదేశ రాజకీయాలను 2014కు ముందు ఉన్న పరిస్థితులతో అంచనా వేయకూడదని, 2014 నుంచీ పరిస్థితులు మారిపోయాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరు ఇటీవల వెలిబుచ్చిన అభిప్రాయానికి ఈ నేపథ్యంలో ప్రాధాన్యత ఉన్నది. నిజానికి చాలామందికి గతంలో జరిగిన పరిణామాలకూ, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకూ పెద్ద తేడాలేదని అనిపించవచ్చు. కాంగ్రెస్ హయాంలో జరిగిన పొరపాట్లు, వ్యవస్థల దుర్వినియోగం, ఆశ్రిత పక్షపాతం, దళారీ వ్యవస్థ, వారసత్వ పాలన చూసిన వారు, మోదీ హయాంలో జరుగుతున్న పరిణామాలను ఎందుకు విమర్శించాలని అనుకోవచ్చు. కాని పాతకళ్లతో కొత్త మార్పులను చూడవద్దని, 2014తో దేశ రాజకీయ సంస్కృతే మారిపోయిన విషయం గ్రహించాలని కొందరు మేధావులు చేస్తున్న వాదనల్లో వాస్తవం లేకపోలేదు. స్థూలంగా పరిశీలిస్తే వ్యవస్థలను తమకు అనుకూలంగా మలుచుకోవడం అప్పటికీ ఇప్పటికీ జరుగుతోందని అనిపించవచ్చు. ఉదాహరణకు న్యాయమూర్తులు అధికార పక్షంతో మిలాఖతు కావడం గురించి అప్పుడూ ఇప్పుడూ దృష్టాంతాలు మనకు కనపడతాయి. న్యాయమూర్తులు, ఐఏఎస్ అధికారులు తమ పదవీ కాలం పూర్తయిన తర్వాత రాజ్యాంగ సంస్థల్లోనూ, ఇతర ఉన్నత సంస్థల్లోనూ పదవులు పొందిన తార్కాణాలు అప్పుడూ ఇప్పుడూ ఉన్నాయి.


పోలీసు వ్యవస్థను, నిఘా, దర్యాప్తు సంస్థలను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడం, ప్రజలపై దమనకాండ, హత్యా రాజకీయాలు, మత కల్లోలాల విషయంలో కాంగ్రెస్ ఏమీ వెనుకబడలేదు. బూటకపు ఎన్‌కౌంటర్లు, అక్రమ నిర్బంధాలు నాడూ జరిగాయి. గత ఆరేళ్లలో జరిగిన అనేక పరిణామాలు గతంలో కూడా జరిగాయి. ‘బ్రిటిష్‌వాడు పోతే మన కానిస్టేబుల్ మారతాడా..’ అని గురజాడ ‘కన్యాశుల్కం’లో ఒక పాత్ర ప్రశ్నిస్తుంది. గురజాడ ఈ ప్రశ్న వేసిన అయిదు దశాబ్దాల తర్వాత స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ ఆయన ఊహించిన విధంగానే పాలనా స్వరూపాలు మారినప్పటికీ వ్యవస్థలు అంత మారలేదు. ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామికీకరణ క్రమాన్ని ప్రారంభించడం, సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రోత్సహించడం, లౌకిక వాద స్ఫూర్తిని పెంపొందించడం మొదలైన అంశాల్లో కీలక పాత్ర పోషించిన జవహర్ లాల్ నెహ్రూ రూపంలోనూ, సారంలోనూ బ్రిటిష్ కాలపు పాలనను అధికంగా కొనసాగించారు. ప్రత్యామ్నాయ రాజ్య నిర్మాణం చేయకుండా అదే అణచివేత యంత్రాంగాన్ని ఉండనిచ్చారు. పోలీసు, పారామిలటరీ వ్యవస్థలతోపాటు బ్రిటిష్ నుంచి వచ్చిన అనేక వ్యవస్థల్ని అమలు చేసి తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకున్నారు.


వలసవాద పాలనలో ఉన్న లోపాలతో సహా పరిపాలనా వ్యవస్థను బ్రిటిష్‌వారి నుంచి అరువు తెచ్చుకున్నారు. 1949-–50 మధ్య కాలంలో సాయుధ పోలీసులను దించి తెలంగాణ రైతాంగ పోరాటాన్ని అణిచివేయడం దగ్గరి నుంచి, అనేక ఉద్యమాలను అణిచివేసేందుకు బ్రిటిష్ వలస పాలన కాలపునాటి విధానాలనే అమలు చేశారు. కొన్ని వందల సార్లు శాంతి భద్రతలను నెలకొల్పేందుకు పోలీసులకు తోడుగా సైన్యాన్ని దించిన దృష్టాంతాలున్నాయి. నిజానికి బ్రిటిష్ వారి కాలంలోనే వివిధ పరగణాల్లో ప్రభుత్వాలు నెలకొల్పిన కాంగ్రెస్ పార్టీ పరిపాలనను ఏ విధంగా నడపాలో బ్రిటిష్ వారి నుంచే పాఠాలు నేర్చుకున్నది. ఉద్యమాలు నిర్వహించిన నేతలే అధికారంలోకి వచ్చేసరికి పరిపాలన సజావుగా సాగాలంటే అణచివేత తప్పదన్న అభిప్రాయానికి వచ్చారు. వర్గ వైషమ్యాలకంటే వర్గ సామరస్యం మంచిదన్న సిద్ధాంతీకరణకు కాంగ్రెస్ నేతలు అప్పుడే పూనుకున్నారు. ‘మనకు ఇక్కడ లెనిన్ అవసరం లేదు. వర్గ విద్వేషం బోధించేవారు దేశానికి శత్రువులు’ అని సర్దార్ పటేల్ 1938లోనే అన్నారు. కమ్యూనిస్టులు, ఇతర వామపక్ష రాజకీయ ఉద్యమకారులపై బ్రిటిష్‌వారు అమలు చేసిన నేర పరిశోధనా విభాగాన్నే బొంబాయిలో హోంమంత్రి కెఎం మున్షీ ఉపయోగించుకున్నారు. సమ్మెల్ని పోలీసులద్వారా క్రూరంగా అణిచివేశారు. పౌరహక్కుల పేరుతో హత్య, హింసాకాండ, లూటీలు, హింసాత్మక పద్ధతుల ద్వారా వర్గ యుద్ధాన్ని ప్రోత్సహించడాన్ని సహించబోమని ఏఐసిసి 1938లోనే తీర్మానం చేసింది.


అంతే కాదు, పార్టీపై ప్రభుత్వం ఆధిపత్యం చలాయించే సంస్కృతి, వారసత్వ సంస్కృతి నెహ్రూ హయాంలోనే ప్రారంభమైంది. నెహ్రూ ఏకపక్ష నిర్ణయాలను ప్రశ్నించిన కృపలానీ తప్ప తర్వాత వచ్చిన పార్టీ అధ్యక్షులంతా నెహ్రూకు అనుగుణంగా నడుచుకున్నారు. నెహ్రూ హయాం లోనే పేరుకు సమాఖ్య దేశమైనా రాజకీయ కేంద్రీకృత విధానాన్ని అమలు చేశారు. 1952–1964 మధ్య నెహ్రూ కాంగ్రెసేతర ముఖ్యమంత్రులను గద్దె దించేందుకు అయిదుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ‘కాంగ్రెసే దేశం, దేశమే కాంగ్రెస్’ అని 1953లో నెహ్రూ ఎన్నికల్లో నినాదం చేశారు. నెహ్రూ కాలంలో ఏక పార్టీ ఆధిపత్యం రాజ్యాంగంలోని ఫెడరల్ వ్యవస్థనే దెబ్బతీసింది. తమ రాజకీయ బంట్లను గవర్నర్లుగా, కోన్ కిస్కా గాళ్లను ముఖ్యమంత్రులుగా నియమించే సంస్కృతి అప్పుడే ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ గుప్పిటిలో ఉన్న ప్రణాళికా సంఘం అయిదు సంవత్సరాల ప్రణాళికలను నిర్ణయించడం, యూజీసీ ఉన్నతవిద్యను పర్యవేక్షించడం, ఆకాశవాణి ప్రభుత్వ బాకాను ఊదడం ఆనాడే మొదలైంది. నెహ్రూ తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ, ఇతర ప్రధాన మంత్రులు ఈ లక్షణాల్ని మరింత విస్తృతంగా అమలు చేశారు. నెహ్రూ ఉపయోగించుకున్న బ్రిటిష్ పాలనా వ్యవస్థను మరింత దట్టంగా విస్తరించారు. తమ అధికారాన్ని కేంద్రీకృతం చేసుకునేందుకు కొత్త కొత్త సంస్థల్ని ఏర్పర్చుకున్నారు. ప్రత్యర్థుల్ని దెబ్బగొట్టేందుకు కొత్త విధానాల్ని అమలు చేశారు. నెహ్రూ ‘కాంగ్రెసే దేశం’ అని నినాదం ఇస్తే ఇందిరాగాంధీ బంటు అయిన డికె బారువా ‘ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిర’ అన్న నినాదం చేశారు. రెండింటికీ పెద్ద తేడా లేదు.


మరి 2014 ఎందుకు భిన్నమైనది? ఎందుకు మోదీ హయాంలో జరుగుతున్న పరిణామాలను కొత్త దృష్టితో చూడాలి? నెహ్రూ, ఇందిరాగాంధీ లాగా ఇవాళ మోదీ కూడా దేశమంతా తన విశ్వరూపం చూపించాలని అనుకుంటున్నారు కదా? మోదీ, మోదీ అన్న నినాదాలతో మార్మ్రోగిస్తున్నారు కదా? మోదీ హైతో ముంకిన్ హై (మోదీ ఉంటే అంతా సాధ్యమే) అన్న నినాదం చేబట్టి ఒకే వ్యక్తి ఆధారిత సంస్కృతిని ప్రవేశపెడుతున్నారు కదా? రాజ్య ప్రయోజనాలను కాపాడేందుకు బ్రిటిష్ కాలంనుంచి కాంగ్రెస్ వరకు అనుసరించిన విధానాలనే అమలు చేస్తున్నారు కదా? అని ప్రశ్నలు రావచ్చు. 1991లో పీవీ నరసింహారావు హయాంలో దేశంలో నూతన ఆర్థిక సంస్కృతి ప్రవేశిస్తే 2014లో మోదీ హయాంలో నూతన రాజకీయ సంస్కృతి ప్రవేశించింది. గత ప్రధానమంత్రులు కేవలం తమ అవసరాలకు అనుగుణంగా, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే కఠినమైన నిర్ణయాలు తీసుకుని, తమను తాము ప్రజాస్వామిక వాదులుగా, లౌకిక వాదులుగా చిత్రించుకునేందుకు తపన పడితే మోదీ అలాంటి ఆత్మవంచనకు ఏమీ పాల్పడలేదు. మోదీకి ఒక సైద్ధాంతిక భూమిక ఉన్నదని అది ఈ దేశంలోని మెజారిటీ ప్రజలను ఆవహించే భూమిక అన్న విషయంతో ఏ మాత్రం సందేహం లేదు.


నిజానికి ఇది మోదీ వ్యక్తిగత సైద్ధాంతిక భూమిక కాదు. పూర్తిగా భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక భూమిక. నెహ్రూ గానీ, ఆయన తర్వాత నేతలు కానీ ఆలోచించలేని సైద్ధాంతిక భూమిక. ఒక లక్ష్యం ప్రకారం ఒక ఆలోచనా విధానం ప్రకారం దేశాన్ని తమ సైద్ధాంతిక బలం ద్వారా తమకు అనుగుణంగా మలుచుకునేందుకు పావులు కదపడం, క్రమంగా విస్తరించడం స్పష్టంగా కనిపిస్తున్నది. పైకి మోదీ తప్ప ఎవరూ కనిపించకపోవచ్చు. మిగతా నేతలంతా నిమిత్తమాత్రులు కావచ్చు. వ్యవస్థలన్నీ దాసోహం కావచ్చు. ప్రత్యర్థులందరూ కుప్పకూలిపోవచ్చు. ప్రతిఘటించాలనుకున్నవారు, ప్రశ్నించాలనుకున్నవారు నీరు కారిపోవచ్చు. మోదీ కాని, ఆయన వెనుక ఉన్న భావజాలం కానీ లక్ష్యంగా పెట్టుకున్నది ఒక్కటే. తాము అనుకున్న సైద్ధాంతిక భూమిక గల రాజ్యాన్ని, వ్యవస్థను ఏర్పర్చడం. మిగతా అన్ని భావజాలాలు నీరుగారిపోవడం. ఈ లక్ష్య సాధనలో వారు ఎవరి ఆక్రందనలూ వినదలుచుకోలేదు. సైద్ధాంతిక లక్ష్యం ముందు పౌరహక్కులూ, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు ఎంత? వ్యవస్థలు ఎంత? ఫలానా వృద్ధ కవి జైలు పాలయ్యాడని, ఫలానా దివ్యాంగుడు నిర్బంధంలో నిస్సహాయ స్థితిలో ఉన్నారని, తమపై ఉన్నట్లుండి ఐటీ, ఈడీ, సిబిఐ దాడులు జరిగాయని వాపోవడం సైద్ధాంతిక లక్ష్యం ముందు అరణ్య రోదనలు కావా? నిజానికి ఈ రోదనలు బిజెపి ఆలోచనా విధానానికి వైరుధ్యాలు. ఆ వైరుధ్యాలను విస్మరించడం ద్వారానే తాము సైద్ధాంతికంగా బలోపేతం అవుతామని ఆ పార్టీ భావిస్తున్నది.


అందుకే 2014 తర్వాత పరిణామాలను కొత్త కొలమానంతో చూడాల్సిన అవసరం ఉన్నది. పాత విమర్శనా దృక్పథాన్ని విడనాడాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుత పరిణామాలు దేశాన్ని వెనక్కు నడిపిస్తున్నాయా, లేక ముందుకు నడిపిస్తున్నాయా, మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు దేశాన్ని నిజంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాయా అన్న అంశాలపై చర్చ జరిగితే మంచిదే కాని ప్రజల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసేందుకు కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు, కొత్త సిద్ధాంతాలు అన్వేషించడం అవసరం. ప్రజల విశ్వాసాల్ని, నమ్మకాల్ని, జన్మభూమిపై మమకారాన్ని తమ సైద్ధాంతిక ఎజెండాలో చేర్చి రాజకీయంగా ఉపయోగించుకోవడంలో ఆరితేరిన బిజెపిని ఎదుర్కొనగలిగేందుకు వినూత్నంగా ఆలోచించగల కొత్త శక్తులు ఉద్భవించడం అవసరం. లేదా ప్రజలే బిజెపి వైఫల్యాలను గమనించగలగాలి. ఇతర దేశాల్లో ఇలాంటి పరిణామాలకు కూడా ఉదాహరణలున్నాయి.



ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

Updated Date - 2020-07-22T06:18:28+05:30 IST