Omicron కేంద్ర స్థానం గౌటెంగ్‌ ప్రావిన్స్‌కు డబ్ల్యూహెచ్‌వో బృందం

ABN , First Publish Date - 2021-12-04T13:00:07+05:30 IST

ఒమైక్రాన్‌తో వణుకుతున్న దక్షిణాఫ్రికాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిపుణుల బృందాన్ని పంపింది.

Omicron కేంద్ర స్థానం గౌటెంగ్‌ ప్రావిన్స్‌కు డబ్ల్యూహెచ్‌వో బృందం

హుటాహుటిన ఒమైక్రాన్‌ కేంద్రం గౌటెంగ్‌కు.. పర్యవేక్షణ, కాంటాక్టుల ఛేదనలో తోడ్పాటు

జొహన్నెస్‌బర్గ్‌, డిసెంబరు 3: ఒమైక్రాన్‌తో వణుకుతున్న దక్షిణాఫ్రికాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిపుణుల బృందాన్ని పంపింది. వేరియంట్‌ కేంద్ర స్థానం గౌటెంగ్‌ ప్రావిన్స్‌లో పర్యటించే ఈ బృందం.. పర్యవేక్షణ, కాంటాక్టుల ఛేదనలో సాయపడనుంది. ఇప్పటికే ఓ బృందం ఒమైక్రాన్‌ వేరియంట్‌ జన్యు విశ్లేషణలో దక్షిణాఫ్రికాకు సాయపడుతోంది. దేశంలో గత వారం నుంచి నమోదవుతున్న కేసుల్లో 80% గౌటెంగ్‌లోనే ఉన్నాయి. మరోవైపు దక్షిణాఫ్రికాలో గురువారం 11,500 కరోనా కేసులు వచ్చాయి. బుధవారంతో పోలిస్తే ఇవి 3 వేలు ఎక్కువ. కాగా, గత నెలలో 249 మంది పాజిటివ్‌ల నమూనాలను విశ్లేషించగా.. 183 మంది(73%)కి ఒమైకాన్ర్‌ వేరియంట్‌ సోకిందని దక్షిణాఫ్రికా ప్రభుత్వం తెలిపింది. 


నాలుగో వేవ్‌ దిశగా..

దక్షిణాఫ్రికాలోని 9 ప్రావిన్సులకు గాను ఏడింటికి ఒమైక్రాన్‌ వ్యాపించింది. ఈ వేరియంట్‌ నాలుగో వేవ్‌కు కారణమవుతోందని ఆరోగ్య మంత్రి జో ఫహాలా తెలిపారు. గౌటెంగ్‌లో పరిస్థితి చేయిదాటుతోందని ప్రావిన్స్‌ ప్రీమియర్‌ డేవిడ్‌ మఖూరా పేర్కొన్నారు. రెండు వారాల్లో నాలుగో వేవ్‌ ఉధృత స్థాయికి వెళ్తుందని నిపుణుల అంచనా. రోజుకు 45 వేల కేసులు వస్తాయని, 4వేల మంది ఆస్పత్రి పాలవుతారని భావిస్తున్నారు. ప్రధాన వ్యాపార కేంద్రమైన ఈ ప్రావిన్స్‌కు దేశంలోని పలు ప్రాంతాల వారు వచ్చి ఉపాధి పొందుతుంటారు. క్రిస్మస్‌ పండుగకు వీరంతా స్వస్థలాలకు వెళ్తే వేరియంట్‌ వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. 


ఆరోగ్య వసతులను మెరుగుపర్చుకోండి

ఒమైక్రాన్‌ నేపథ్యంలో ఆరోగ్య వసతులు మెరుగుపర్చుకోవాలని, టీకా పంపిణీని వేగిరం చేయాలని ఆసియా పసిఫిక్‌ ప్రాంత దేశాలను డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తం చేసింది. సరిహద్దుల మూసివేతతో సరిపెట్టుకోవద్దని, ఎవరికి వారు జాగ్రత్తలు పాటించేలా చూడాలని పేర్కొంది. డెల్టాకు అడ్డుకట్ట వేయడానికి ఉపయోగించిన పద్ధతులు ఒమైక్రాన్‌ విషయంలోనూ పనిచేస్తాయని వివరించింది. మరోవైపు ఆస్ట్రేలియాలో శుక్రవారం స్థానిక వ్యాప్తి ద్వారా ఒమైక్రాన్‌ తొలి కేసు నమోదైంది. వచ్చే వారం నుంచి మరిన్ని ప్రయాణ ఆంక్షలను తీసుకురావాలని అమెరికా యోచిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణికులు బయల్దేరడానికి ఒక రోజు ముందుగా చేయించుకున్న పరీక్ష తాలూకు నెగెటివ్‌ ధ్రువపత్రం కచ్చితం చేయనుంది. దీనికి తోడు విదేశాల నుంచి వచ్చేవారి క్వారంటైన్‌ అంశాన్నీ పరిశీలిస్తోంది. విమానాలు, రైళ్లు, ఇతర ప్రజా రవాణా వాహన ప్రయాణికులకు మాస్క్‌ తప్పనిసరి నిబంధనను మార్చి వరకు పొడిగించనుంది. కాగా, దేశ జనాభాలో ప్రస్తుతం 1ు మందికి పైగా కరోనా బాధితులేనని జర్మనీ ఆరోగ్య మంత్రి జెన్స్‌ స్పాన్‌ తెలిపారు. శుక్రవారం దేశంలో 74 వేల మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. 390 మంది ప్రాణాలు కోల్పోయారు. అర్హులందరూ టీకా తీసుకుని ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-12-04T13:00:07+05:30 IST