హైదరాబాద్‌లో Drugs సూత్రధారి ఎవరు..!?

ABN , First Publish Date - 2022-05-06T19:39:17+05:30 IST

డ్రగ్స్‌ సరఫరాదారులు, వినియోగదారులను పోలీసులు పట్టుకుంటున్నారు.

హైదరాబాద్‌లో Drugs సూత్రధారి ఎవరు..!?

  • పట్టుబడుతోంది సరఫరాదారులు, వినియోగదారులే
  • దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న మాదకద్రవ్యాల దందా

హైదరాబాద్‌ సిటీ : డ్రగ్స్‌ సరఫరాదారులు, వినియోగదారులను పోలీసులు పట్టుకుంటున్నారు. సూత్రధారులు మాత్రం పట్టుబడడం లేదు. ఐదేళ్లలో విదేశాల నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చిన వారిని మాత్రమే గుర్తించగలిగారు. అసలైనవారు నైజీరియా, టాంజానియా, ఉగాండా, ఆఫ్రికా దేశాల్లో ఉన్నారని చెబుతున్నారు తప్ప వారిని గుర్తించే ప్రయత్నాలు జరగలేదు. దీంతో దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ సరఫరా చేసేదెవరనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోతోంది.


విదేశాల నుంచి డ్రగ్స్‌ సరఫరా చేసే వ్యక్తి ఆచూకీ గుర్తించలేకపోయినా.. ఇక్కడ డ్రగ్స్‌ తీసుకునే వారిని గుర్తించడంలో కూడా అధికారులు విఫలమవుతున్నారు. ఆరు నెలల క్రితం టోనీని పట్టుకున్నారు. అతడిని పోలీసులు విచారించగా.. డ్రగ్స్‌ సూత్రధారి ఆఫ్రికాలో ఉన్నాడని చెప్పాడు. అతడిని గుర్తించి చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు.


రెండు నుంచి 50 గ్రాముల వరకు డ్రగ్స్‌ సరఫరా చేసే వ్యక్తి వద్ద సమాచారం లేదంటే నమ్మొచ్చు. ఎయిర్‌పోర్టులో పట్టుబడుతున్న కిలోల కొద్దీ డ్రగ్స్‌ తీసుకొస్తున్న వారు కూడా తమకేమీ తెలియదని చెబితే అధికారులు నమ్మాల్సిన పరిస్థితి. రెండు వారాల్లో రూ. 40 కోట్ల విలువ చేసే హెరాయిన్‌, కొకైన్‌ లాంటి మాదకద్రవ్యాలు పట్టుబడిన విషయం తెలిసిందే. పట్టుబడిన వారిని విచారించగా..  సరఫరా దారులు మాత్రమే కాదు.. ఇక్కడ వాటిని తీసుకునే వారి వివరాలు కూడా తెలియదని అధికారులకు చెప్పడం గమనార్హం. డ్రగ్స్‌ తీసుకొస్తున్న వారు ఎయిర్‌పోర్టు నుంచి క్షేమంగా బయటకు వస్తేనే ఇక్కడ తీసుకునే వ్యక్తి సీన్‌లోకి ఎంటర్‌ అవుతాడు. దందా ఇలా సాగుతోందని అధికారులు అంటున్నారు.

Read more