నన్ను అడిగేదెవరు?

ABN , First Publish Date - 2022-04-12T05:47:18+05:30 IST

అధికారపార్టీ ప్రజాప్రతినిధి బంధువంటే మాటలా? ఏమైనా చేయవచ్చని అనుకున్నాడు. వంక ఇసుక అంతా బొక్కేద్దామనుకున్నాడు.

నన్ను  అడిగేదెవరు?
బొందిమడుగులలో ఎక్స్‌కవేటర్‌తో ఇసుకను తీస్తున్న దృశ్యం

  1.  అధికార పార్టీ ప్రజాప్రతినిధి బంధువు ఇసుక దోపిడీ 
  2. ఎక్స్‌కవేటర్లతో తవ్వకాలు.. టిప్పర్లతో తరలింపు 
  3. అడ్డుకున్న గ్రామస్థులు
  4.  పట్టించుకోని రెవెన్యూ, పోలీసు అధికారులు  

అధికారపార్టీ ప్రజాప్రతినిధి బంధువంటే మాటలా? ఏమైనా చేయవచ్చని అనుకున్నాడు. వంక ఇసుక అంతా బొక్కేద్దామనుకున్నాడు. ఎక్స్‌కవేటర్లతో తవ్వి, టిప్పర్లతో తరలించడం మొదలు పెట్టాడు. ఇల్లు కట్టుకోవాలంటే సామాన్యులకు గుప్పెడు ఇసుక దొరక్క ఇబ్బంది పడుతుంటే  అధికారాన్ని అడ్డం పెట్టుకొని సదరు బంధువు వంకనే కొల్లగొట్టేస్తున్నాడు. సోమవారం గ్రామస్థులు ఈ ఆగడాన్ని అడ్డుకున్నారు.   

- తుగ్గలి

 మండలంలోని బొందిమడుగుల గ్రామ శివారులోని వంకలో ఉన్న ఇసుకను పత్తికొండకు చెందిన ప్రజాప్రతినిధి సమీప బంధువు రెండు ఎక్స్‌కవేటర్లను పెట్టి 8 టిప్పర్లతో తరలింపు చేపట్టాడు. ఇసుక రీచ కాని ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టడం చట్ట విరుద్ధం. అనుమతి లేని చోటి నుంచి ఇసుకను తరలించడం నేరం. కానీ ఎమ్మెల్యే బంధువును కాబట్టి ఏమైనా చేయవచ్చని సదరు వ్యక్తి అనుకున్నట్లుంది. ఇలా  ఇసుక తవ్వేస్తే ఈ వేసవిలో వంక పూర్తిగా ఎండిపోతుంది. ఇది గమనించి గ్రామస్థులు టిప్పర్లను అడ్డుకున్నారు. మధ్యా హ్నానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని టిప్పర్లను పోలీ్‌సస్టేషన్లకు తరలించారు. 

ఫ చెరువు పనుల పేరుతో ..

నాలుగు రోజుల నుంచి 8 టిప్పర్లతో ఇసుకను తరలిస్తున్నారు. పోలీసులు కాని, రెవెన్యూ అధికారులు కాని తొంగి కూడా చూడలేదు. అయితే చెరువులకు మరమ్మతు పనులు చేయడానికి ప్రభుత్వ అనుమతులతో ఇసుకను తరలిస్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ  ఒక్కో ఇసుక టిప్పరు రూ. 50 వేల ప్రకారం బెంగళూరు, బేతంచర్ల, డోన్‌ తదితర ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారని గ్రామస్థులు ఆరోపించారు. రీచ్‌ లేని ప్రాంతంలోని వంకలో ఇసుకను తరలించడానికి అనుమతులు ఉన్నాయా? అని గ్రామస్థులు అడ్డం తగలడంతో రవాణా నిలిపివేశారు. 

ఫ కేసులు పెడతామని  భయపెడుతున్నారు 

ఇసుక అక్రమ తరలింపును నివారించాల్సిన పోలీసులు మేం అడ్డుకుంటే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మేం టిప్పర్లను అడ్డుకున్నాక పోలీసులు వచ్చారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఇలా అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహించడం సమంజసం కాదు. 

- రమేష్‌, బొందిమడుగుల 

ఫ వాహనాలు సీజ్‌ చేసి విచారణ చేపడతాం 

ఇరిగేషన్‌ అధికారుల సిఫారసుల మేరకు చెరువు మరమ్మతు పనులకు ఇసుకను తరలించేందుకు అనుమతులు ఇచ్చాం. అలా కాకుండా ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలించి అమ్ముకుంటే ఎంతటి వారైనా ఉపేక్షించం. వాహనాలను సీజ్‌ చేసి పోలీ్‌సస్టేషన్‌కు తరలించాం. కేసు నమోదు చేస్తాం.  

  - నిజాముద్దీన్‌, డిప్యూటీ తహసీల్దార్‌ 


Updated Date - 2022-04-12T05:47:18+05:30 IST