తెల్లబోయిన పత్తిరైతులు

ABN , First Publish Date - 2021-10-22T06:40:43+05:30 IST

తెల్లబంగారంగా పిలుచుకునే పత్తి పంట ఈసారి రైతుకంట కన్నీరు నింపుతోంది.

తెల్లబోయిన పత్తిరైతులు
నిర్మల్‌లో పత్తి పంటను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు

ఆందోళనలో అన్నదాతలు 

జిల్లాలో గణనీయంగా దిగుబడి తగ్గే అవకాశం 

కొనుగోళ్లకు ముందుకు రాని సీసీఐ 

వర్షంతో కోల్పోయిన పత్తి నాణ్యత 

అందని ఫసల్‌బీమా 

నిర్మల్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి)  : తెల్లబంగారంగా పిలుచుకునే పత్తి పంట ఈసారి రైతుకంట కన్నీరు నింపుతోంది. జిల్లాలో భారీగా కురిసిన వర్షాల కారణంగా పత్తి చేనులన్నీ నీళ్లలో మునిగిపోయాయి. వరుసగా వర్షాల బారిన పడిన పత్తిపంట నాణ్యతపై ప్రస్తుతం అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. చాలా గ్రామాల్లో పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడంతో అన్నదాతను కుంగదీస్తోంది. ఏకధాటిగా వర్షాలు కురియడం తో పత్తిపంట పూర్తిగా తడిసి ముద్దయిన కారణంగా దాని రంగు సైతం మారిపోయింది. దీంతో నాణ్యత కోల్పోయిన కారణంగా ధర కూడా తగ్గిపోనుంది. కాగా ఈసారి పత్తిపంటను కొనుగోలు చేసేందుకు సీసీఐ ముందుకు రాకపోవడం రైతులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాలో ఈ సారి 1.61లక్షల ఎకరాల్లో పత్తిపంటను సాగుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే 11 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. వర్షాలు దశల వారిగా పెద్దఎత్తున కురియడంతో పత్తి దిగుబడులపై ఆ ప్రభావం పడింది. ఇటు ప్రకృతి కారణంగా దిగుబడులు తగ్గిపోవడం , నాణ్యత లేకపోవడంతో పాటు సీసీఐ కొనుగోళ్లకు ముందుకు రాకపోవడంతో పత్తిరైతులు గందరగోళానికి గురవుతున్నారు. అయితే ప్రభుత్వం క్వింటాల్‌కు రూ. 6025 మద్దతు ధరను ప్రకటించినప్పటికీ ప్రైవేటు వ్యాపారులు మాత్రం పత్తినాణ్యతను బట్టి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7400 వరకు ధరను చెల్లిస్తున్నారు. సీసీఐ కొనుగోలు జరపకపోతుండడం, ప్రైవేటులో ధర ఎక్కువగా ఉన్న కారణంగా రైతులు తమపంటను వ్యాపారులను విక్రయిస్తున్నారు. అయితే ఇక్కడ ఓ తిరకాసు తలెత్తుతోంది. పత్తి తడిసిపోయిన కారణంగా నాణ్యత విషయంలో అనేక కొర్రీలు ఎదురవుతున్నాయంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం కేవలం క్వింటాల్‌కు రూ. 5825 మద్దతు ధరను మాత్రమే చెల్లించారు. 9లక్షల క్వింటాళ్ళ పత్తి దిగుబడి వచ్చింది. ఈ సారి గతం కన్నా 3 లక్షల క్వింటాళ్ల అధిక దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. అలాగే గత సంవత్సరం సీసీఐ 8.50 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. ప్రైవేటు వ్యాపారులు మాత్రం కేవలం 50 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం. ఈ సారి మాత్రం సీసీఐ కొనుగోళ్లపై చేతులెత్తేయడంతో రైతులు ఇక ప్రైవేటు వ్యాపారులపైనే ఆధారపడి తమ పత్తిని విక్రయించుకుంటున్నారు. దీనికి తోడుగా కేంద్రప్రభుత్వం ద్వారా అమలయ్యే ఫసల్‌బీమా పథకం సైతం నిలిచిపోవడంతో రైతులు నష్టపోయిన పంటలకు ఎలాంటి బీమా సౌకర్యాన్ని పొందలేకపోతున్నారు. ఎకరానికి సుమారు 35 వేల వరకు పత్తి సాగుకోసం రైతులు ఖర్చు చేస్తున్నారు. దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడం, నాణ్యత లేని కారణంగా రైతులు పూర్తినష్టాల పాలయ్యారు. పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి అందవని, చేసిన అప్పులతో మరిన్ని ఇబ్బందులు మొదలయ్యాయని పత్తిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

చేతులెత్తేసిన సీసీఐ 

ప్రతియేటా పత్తి పంటను సీసీఐ పెద్దఎత్తున కొనుగోలు చేసేది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను చెల్లించి ఈ పంటను కొనుగోలు చేసేవారు. అయితే అనూహ్యంగా ఈసారి పత్తిపంటను కొనుగోలు చేయలేమంటూ సీసీఐ చేతులెత్తేయడంతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో ప్రైవేటు వ్యాపారులు ఎక్కువ ధరను చెల్లించేందుకు ముందుకు వస్తుం డడం రైతులకు కొంత మేరకు ఊరటనిస్తోంది. గత సంవత్సరం 9లక్షల క్వింటాళ్ల పత్తిదిగుబడి సాధించగా, సీసీఐ ఇందులో నుంచి 8.50లక్షల క్వింటాళ్లపత్తిని రూ.5825 మద్దతుధరతో కొనుగోలు చేసింది. అయితే ఈ సారి మాత్రం సీసీఐ కొనుగోళ్ళ కోసం వెనకడుగు వేయడంతో రైతులు ఇక ప్రైవేటు వ్యాపారులనే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సారి కేంద్ర ప్రభుత్వం పత్తిక్వింటాల్‌కు మద్దతు ధరను రూ. 6025గా ఖరారు చేసింది. మద్దతు ధర కన్నా రూ. 1000కి పైగా ప్రైవేటు వ్యాపారుల వద్ద ఎక్కువగా ధర వస్తుండడంతో రైతులు ప్రైవేటుబాటనే పడుతున్నారు. 

దిగుబడిపై తీవ్ర ప్రభావం

భారీ వర్షాల కారణంగా పత్తిపంట కోలుకోలేకపోతోంది. పత్తిచేలన్నీ వర్షంలోనే తడిసిపోవడమే కాకుండా చేలల్లో నీరు చేరుకున్న కారణంగా పత్తినాణ్యతపై ప్రతికూలత ఏర్పడుతోందంటున్నారు. ఈ సారి 1.61లక్షల ఎకరాల్లో పత్తిపంటను సాగుచేయగా 11 లక్షల క్వింటాళ్ల దిగుబడి సాధ్యమవుతుందని అధికారులు అంఛనాలు రూపొందించారు. అయితే వర్షం తో పత్తిచేలు నీట మునిగిపోయిన కారణంగా దిగుబడులు పెద్దఎత్తున తగ్గిపోనున్నాయంటున్నారు. దీంతో రైతుల ఆశలన్నీ గల్లంతు కాబోతోందన్న ఆందోళన మొదలైంది. నాణ్యత కోల్పోయిన పత్తిని వ్యాపారులు తక్కువ ధరలకే కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత ఉన్న పత్తిని మాత్రం ప్రభుత్వ మద్దతు ధర కన్నా ఎక్కువగా చెల్లించి కొనుగోలు చేస్తున్నప్పటికి తడిసిపోయి రంగుమారిన పత్తిని కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. గత సంవత్సరం కన్నా ఈ సారి 3లక్షల క్వింటాళ్ల పత్తి అధికంగా దిగుబడి రావచ్చని ఆశించారు. కాని భారీ వర్షాల కారణంగా ఆ ఆశలు ఆడియాశలయ్యాయి. 

నిరాశ మిగిల్చిన ఫసల్‌బీమా

కేంద్రప్రభుత్వం అమలు చేసే ఫసల్‌బీమా పథకం సక్రమంగా అమ లై ఉంటే రైతులకు కొంత మేరకైనా ప్రయోజనం దక్కేదంటున్నారు. రాష్ట్రప్రభుత్వం ఈ ఫసల్‌బీమా పథకానికి సంబంధించి ప్రీమియంను చెల్లించకపోవడంతోనే అసలు సమస్య ఎదురవుతోందంటున్నారు. ఫసల్‌ బీమా ప్రీమియంలో రాష్ట్రం తన వాటాను సక్రమంగా చెల్లించకపోతుండడంతో ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఒకవేళ ఫసల్‌బీమా పథ కం సక్రమంగా అమలై ఉంటే రైతులకు ఎంతో ప్రయోజనం దక్కేదంటున్నారు. వాతావరణ ఆధారిత పంటలబీమా పథకంతో రైతులకు బీమానే కాకుండా సాగు పరంగా కూడా ఎన్నో అవకాశాలు దక్కేవంటున్నారు. 

పెట్టిన పెట్టుబడులు కూడా నిండలేదు

నాకున్న మూడు ఎకరాల భూమిలో పత్తి పంటను సాగుచేశాను. పురుగుల మందుల కోసం రూ. 36వేలను ఖర్చు చేశాను. ఇందులో ఆరు క్వింటాళ్ల పత్తి మాత్రమే చేతికి వచ్చింది. పెట్టిన పెట్టుబడులు కూడా నిండక పూర్తిగా నష్టపోయాను. ఎలా బ్రతకాలో అర్థం కావడం లేదు. నాలాంటి వాళ్ళకు ప్రభుత్వం ఆర్థికసహాయం చేసి ఆదుకోవాలి. 


Updated Date - 2021-10-22T06:40:43+05:30 IST