తెల్లరాయి తవ్వకాలు నిలిపివేయండి

ABN , First Publish Date - 2022-05-24T04:15:56+05:30 IST

మండలంలోని అప్పసముద్రం గ్రామ సమీపంలో జరుగుతున్న తెల్లరాయి తవ్వకాలను నిలిపివేయాలని మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం క్వారీ వద్ద గ్రామస్థులు ఆందోళన చేశారు.

తెల్లరాయి తవ్వకాలు నిలిపివేయండి
క్వారీ వద్ద ఆందోళన చేస్తున్న గ్రామస్థులు

క్వారీ వద్ద గ్రామస్థుల ఆందోళన 

ఉదయగిరి రూరల్‌, మే 23: మండలంలోని అప్పసముద్రం గ్రామ సమీపంలో జరుగుతున్న తెల్లరాయి తవ్వకాలను నిలిపివేయాలని మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం క్వారీ వద్ద గ్రామస్థులు ఆందోళన చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికార బలంతో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు 42 ఎకరాల్లో తెల్లరాయి తవ్వకాలకు మైనింగ్‌ శాఖ నుంచి అనుమతి తెచ్చుకొన్నారన్నారు. అధికారులు  పంచాయతీ తీర్మానం లేకుండా, గ్రామసభ నిర్వహించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా మామూళ్లమత్తులో అనుమతులు ఇచ్చారన్నారు. అక్రమంగా అనుమతి పొందిన వారు నిబంధనలకు విరుద్ధంగా 50-60 అడుగుల లోతులో గుంతలు తవ్వి తెల్లరాయి నిక్షేపాలను వెలికితీస్తున్నారన్నారు. ఇప్పటికే 10-15 ఎకరాల్లో భారీగా గుంతలు తవ్వారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి సమయాల్లో బ్లాస్టింగ్‌లు నిర్వహిస్తున్నారన్నారు. ఆ సమయంలో క్వారీకి చుట్టుపక్కల ఉన్న గొర్రెలు, మేకల దొడ్లు, పొలాల్లో రాళ్లు పడుతున్నాయని రైతులు, జీవాల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు రెవెన్యూ, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపానపోలేదన్నారు. అనంతరం ఆందోళనకారులు క్వారీలో ఉన్న హిటాచీ, ఇతర వాహనాలను బయటకు పంపించేశారు. విషయం తెలుసుకొన్న పోలీసు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు క్వారీ వద్దకు చేరుకోవడంతో గ్రామస్థులు వారి ముందు తమ గోడు వెల్లబోసుకొన్నారు. వెంటనే క్వారీ అనుమతి రద్దు చేసి తెల్లరాయి తవ్వకాలు అపాలని, లేదంటే కలెక్టరేట్‌ను ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచు వాకా సుబ్బారెడ్డి, గ్రామస్థులు చేజర్ల సుధాకర్‌రెడ్డి, పెంచలరెడ్డి, కృష్ణారెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-24T04:15:56+05:30 IST