అనుమతుల్లేని ఆస్పత్రులపై కొరడా

ABN , First Publish Date - 2022-09-22T07:51:32+05:30 IST

రాష్ట్రంలో అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది.

అనుమతుల్లేని ఆస్పత్రులపై కొరడా

  • అర్హతల్లేని వైద్యులు, సిబ్బందిపై కూడా..
  • రాష్ట్రవ్యాప్తంగా మూకుమ్మడి తనిఖీలు
  • నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు
  • 10 రోజుల్లోగా పూర్తి నివేదిక
  • జిల్లా వైద్యాధికారులకు ప్రభుత్వం ఆదేశం

హైదరాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్‌ హోమ్స్‌, క్లినిక్స్‌, కన్సల్టేషన్‌ రూమ్స్‌, పాలీ క్లినిక్కులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, ఫిజియోథెరపీ యూనిట్స్‌, డెంటల్‌ ఆస్పత్రులు.. తెలంగాణ క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్స్‌ లేకుండానే నడుస్తున్నాయి. ఏదైనా సంఘటన జరిగిన తర్వాతే వాటికి అనుమతులు లేవన్న విషయం బయటపడుతోంది. ఇలాంటి ఆస్పత్రులు, సిబ్బందిపై ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అనుమతుల్లేని ఆస్పత్రులపై కొరడా ఝుళిపించేందుకు సర్కారు సిద్ధమైంది. అంతేకాకుండా కొన్ని ఆస్పత్రులు నిబంధనలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చుకోలేదు. ముఖ్యంగా మెడికల్‌ ఎక్వి్‌పమెంట్‌, శానిటేషన్‌, అలాగే ఆస్పత్రుల నుంచి వచ్చే వ్యర్థాల నిర్వహణ విషయంలో నిబంధనలను పాటించడం లేదు. ఈ విషయాలన్నీ కూడా వైద్యశాఖ దృష్టికి వచ్చాయి.


మూకుమ్మడి తనిఖీలు

రాష్ట్రవ్యాప్తంగా అనుమతుల్లేకుండా నడుస్తున్న ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలపై మూకుమ్మడి తనిఖీలు చేయాలని వైద్యశాఖ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు డీఎంహెచ్‌వోలు అందరికీ సర్క్యులర్‌ జారీచేశారు. తక్షణమే తనిఖీలు చేపట్టేందుకు బృందాలను ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. తనిఖీ బృందాల్లో డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రామ్‌ ఆఫీసర్లను నియమించుకోవాలని ఆదేశించారు. పది రోజుల్లో అన్ని ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో తనిఖీలు పూర్తి చేయాలని, వెంటనే సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించారు. అలాగే క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టంలోని నిబంధనలను పాటించని ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, వైద్యులు, వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా... రాష్ట్ర రాజధానిలో వేల సంఖ్య లో ఆస్పత్రులు, క్లినిక్కులు, నర్సింగ్‌ హోమ్స్‌ ఉన్నాయి. అలా గే 460కిపైగా ప్రైవేటు డయాగ్నస్టిక్‌ కేంద్రాలున్నాయి. ఇంత పెద్ద నగరంలో కేవలం పది రోజుల వ్యవధిలో తనిఖీలు ఎలా సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొద్ది నెలల క్రితం హైదరాబాద్‌లోని ఉప్పల్‌ సమీపంలో ఓ వైద్యుడు ఎటువంటి అర్హతలు లేకుండానే ఓ ప్రైవేటు ఆస్పత్రిని నడిపాడు. అక్కడ చికిత్స పొందిన ఓ గర్భిణీ మృతి చెందింది. దీనిపై విచారణకు వెళ్లిన వైద్యాధికారులు ఆ ఆస్పత్రికి అసలు అనుమతే లేదని తేల్చారు. అలాగే వైద్యుడికి కూడా అర్హతలు లేవని గుర్తించారు. తాజాగా చేపట్టనున్న తనిఖీలతోనైనా ఇటువంటి వాటికి చెక్‌ పడుతుందో లేదో చూడాలి. 

Updated Date - 2022-09-22T07:51:32+05:30 IST