Abn logo
Sep 23 2021 @ 00:37AM

రామగుండంలో అక్రమ నిర్మాణాలపై కొరడా

అనుమతి లేని భవన స్లాబ్‌ను కూల్చివేస్తున్న టాస్క్‌ఫోర్స్‌ కమిటీ

కోల్‌సిటీ, సెప్టెంబరు 22: రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అనుమతి లేని అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు కమిషనర్‌, ఆర్‌డీఓ శంకర్‌ కుమార్‌ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ బుధవారం కూల్చివేత చేపట్టారు. స్థానిక సప్తగిరికాలనీ, నర్రశాలపల్లి రోడ్డులోని అనుమతి లేని రెండు భవనాలను జేసీబీలు, డ్రిల్‌ మిషన్లతో కూల్చివేశారు. ఎన్‌టీపీసీ మెయిన్‌గేట్‌ పక్కనే ఖాజిపల్లి సమీపంలో నిర్మించిన కట్టడాలను కూల్చివేసేందుకు వెళ్లగా గ్రామస్థులు అడ్డుతగిలారు. దీంతో ఎన్‌టీపీసీ పోలీసులు రంగంలోకి దిగారు. సామాను తీసివేసేందుకు ఒక రోజు సమయం ఇవ్వాలని నిర్మాణదారులు కోరారు. దీంతో ఒక రోజు సమయం ఇచ్చారు. నూతన మున్సిపల్‌ చట్టం, టీఎస్‌ బీపాస్‌ నిబంధనలు అనుసరించి ఎలాంటి నోటీసులు లేకుండానే అనుమతి లేని నిర్మాణాలను కూల్చివేయవచ్చునని, ఈ మేరకు కలెక్టర్‌ ఆదేశానుసారం కూల్చివేత కార్యక్రమం నిర్వహించినట్టు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులు డిప్యూటీ తహసీల్దార్లు వరలక్ష్మి, కిరణ్‌కుమార్‌, ఆర్‌అండ్‌బీ ఏఈ జావిద్‌, ఫైర్‌ సర్వీస్‌ నుంచి సత్య నారాయణ, టీపీఎస్‌లు సతీష్‌, ప్రశాంత్‌, శ్యాంసుందర్‌ పాల్గొన్నారు.