ఈటల దారి ఎటు?

ABN , First Publish Date - 2021-05-13T05:41:20+05:30 IST

రాష్ట్ర మంత్రి వర్గం నుంచి..

ఈటల దారి ఎటు?

రోజుకో నేతతో భేటీల ఆంతర్యమేమిటి..

కొత్త పార్టీ పెట్టేందుకే ఈప్రయత్నాలా..


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌): రాష్ట్ర మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ ఆయిన తర్వాత ఈటల రాజేందర్‌ ఆచీతూచీ అడుగులు వేస్తున్నారు. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు.. కొత్త పార్టీ పెడతారా పెడతారా.. పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా బరిలో దిగి ఉప ఎన్నికల్లో తన సత్తా చాటుతారా అన్న ప్రశ్నలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశాలుగా మారాయి. టీఆర్‌ఎస్‌లో, రాజకీయవర్గాల్లో రాజేందర్‌ రాజకీయభవితవ్యంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఆయన మాత్రం నిమ్మలంగా నిండుకుండలా ఎటు తొనకకుండా వ్యవహరిస్తున్నారు. ఆయన రోజుకో నేతతో బేటీ అవుతూ, ప్రజా హక్కుల సంఘాల నేతలను కలుస్తూ, నియోజకవర్గ, గ్రామస్థాయి ప్రతినిధులతో చర్చలు జరుపుతూ తన ఆంతర్యాన్ని బయటపెట్టకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. 


అందరినీ కలిసి.. అన్ని విషయాలు చర్చించి..

ఆయన వ్యవహారాన్ని గమనిస్తున్న రాజకీయవర్గాలు కొత్తపార్టీ పెట్టడం ఖాయమనే అభిప్రాయానికి వస్తున్నాయి. ఆయన ఒక ఇంటర్వ్యూలో సమాజం ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదని, నిరంతర మార్పును కోరుకునే  సమాజంలో సమయం వచ్చినపుడు మార్పులు తన్నుకొని వస్తాయని చెప్పడం కొత్తపార్టీలు సందర్భం వచ్చినపుడు పుట్టుకొస్తాయని చెప్పకనే చెప్పినట్లుగా భావిస్తున్నారు. ఆయన టీఆర్‌ఎస్‌లో తాను ఇమడలేనని నిశ్చయించుకోవడంతోనే ముఖ్యమంత్రిపై తన నిరసన గళాన్ని పెంచుతూ వస్తున్నారని అభిప్రాయపడతున్నారు. కొత్తపార్టీ ఏర్పాటు చేయడంలో భాగంగానే ఆయన వివిధ పార్టీల నేతలను కలుస్తున్నారని అంటున్నారు. బుధవారం ఆయన టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు  డి శ్రీనివాస్‌తో భేటీ అయ్యారు. అదే సమయంలో డి శ్రీనివాస్‌ తనయుడు బీజేపీ ఎంపీ అరవింద్‌తో కూడా ఆయన విడిగా చర్చించారని తెలిసింది. వారంరోజులుగా ఈటల వరుసగా కొండా విశ్వేశర్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మరో సీనియర్‌ నాయకుడు రాములు నాయక్‌తో బేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కూడా ఆయన టచ్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. 


కాంగ్రెస్‌ జిల్లా నేతలు విమర్మిస్తున్నా.. అగ్రనేతలతో భేటీ

నియోజకవర్గంలో ఈటల ప్రత్యర్థిగా తలపడ్డ కాంగ్రెస్‌ నేత కౌశిక్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. అయినా ఆయన్ట సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిసి చర్చించడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. కాంగ్రెస్‌ పార్టీకే చెందిన ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి ఈటల రాజేందర్‌ను గట్టిగా సమర్థిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహరించిన తీరుపై ధ్వజమెత్తడం రాజకీయంగా రాజేందర్‌కు కలిసి వచ్చే అంశంగా మారింది. రాజేందర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని, బీజేపీలో చేరుతారని  జోరుగా ప్రచారం జరుగుతున్నది. తనకు అన్ని పార్టీ నేతలు ఫోన్లు చేసి మాట్లాడారని, తనకు ఎవరితో శత్రుత్వం లేదని, అందరూ తనకు మద్దతు క్రటించారని చెబుతూ ఆయన ఇతర పార్టీలో చేరుతారని జరుగుతున్న ప్రచారానికి తెరవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈటల వ్యవహరిస్తున్న తీరు ఆయన కొత్త పార్టీ ఏర్పాటుకే మొగ్గుచూపుతున్నారనే అభిప్రాయానికి రాజకీయవర్గాలు వస్తున్నాయి.


కొత్త పార్టీ పెట్టినా తన సొంత నియోజకవర్గంలో సత్తా చాటుకోవడం అత్యంత కీలకమని ఆయన భావిస్తున్నారు. అందుకే ఆయన నియోజకవర్గ గ్రామస్థాయి ప్రజాప్రతినిధులతో ఇతర నేతలతో చర్చిస్తూ తనకు వ్యతిరేకంగా గళం విప్పితున్న వారి గురించి ఆరా తీస్తున్నారని తెలిసింది. ఈ విషయాలపై విశ్లేషిస్తూ, జరుగుతున్న పరిణమాల ఫలితాలు ఎలా ఉంటాయోనని అంచనా వేసుకుంటున్నారని సమాచారం. ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోయే ఆలోచన ఆయనకు లేదని, ఉప ఎన్నికల్లో పార్టీ నాయకత్వం దృష్టి మొత్తాన్ని ఇక్కడే కేంద్రీకరించి తనను ఓడించడానికి అన్ని శక్తులను ఒడ్డుతుందని ఆయన భావిస్తున్నారు.


అందుకే మూడేళ్ల తర్వాత జరిగే సాధారణ ఎన్నికలవైపే ఆయన మొగ్గు చూపుతున్నారని అనుకుంటున్నారు. ఆలోగా తనకు మద్దతుగా వచ్చే అన్ని శక్తులను కలుపుకొని, టీఆర్‌ఎస్‌ అంసతృప్తివాదులను చేరదీసి రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈటల రాజేందర్‌ రాజకీయ పార్టీ పెట్టినా పెట్టక పోయినా ఇప్పటికిప్పుడు రాజీనామా చేసే ఆలోచన మాత్రం లేదని, హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు ఉండవనే అభిప్రాయానికి అందరూ వచ్చారు. 

Updated Date - 2021-05-13T05:41:20+05:30 IST