బ్రేక్‌ ఫాస్ట్‌పై చిన్నచూపు తగదు

ABN , First Publish Date - 2020-04-01T16:26:16+05:30 IST

అల్పాహారం ముఖ్యమైనదని, రోజంతా ఉత్సాహంగా పనిచేసేందుకు అది దోహదపడుతుందని, దానిని వదిలేస్తే దీర్ఘకాలంలో అనారోగ్యానికి దారితీస్తుందనీ చాలామందికి

బ్రేక్‌ ఫాస్ట్‌పై చిన్నచూపు తగదు

ఆంధ్రజ్యోతి(01-04-2020)

అల్పాహారం ముఖ్యమైనదని, రోజంతా ఉత్సాహంగా పనిచేసేందుకు అది దోహదపడుతుందని, దానిని వదిలేస్తే దీర్ఘకాలంలో అనారోగ్యానికి దారితీస్తుందనీ చాలామందికి తెలుసు. ఉదయం నిద్రలేచాక తినే మొదటి ఆహారాన్ని విస్మరించకూడదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 

అల్పాహారం ఎప్పుడు తీసుకోవాలి, ఏఏ పదార్థాలు అయితే ఆరోగ్యానికి మేలు చేస్తాయి, వ్యాయామం, వర్కవుట్లు చేసేవారు ఎప్పుడు తినాలి అనే వివరాల గురించి న్యూట్రిషనిస్టులు పలు సూచనలు చేస్తున్నారు. బ్రేక్‌ ఫాస్ట్‌ను దాటవేస్తే దీర్ఘకాలంలో గుండె జబ్బులకు కూడా దారి తీసే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. 


రోగ నిరోధక శక్తి కోసం

ఆరోగ్య ప్రయోజనాల రీత్యా చూస్తే రోజులో మొదటిసారిగా తీసుకునే ఆహారాన్ని విస్మరించరాదు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి బ్రేక్‌ఫాస్ట్‌ తప్పనిసరి. ఉదయం అల్పాహారం తీసుకోవాల్సిన సమయంలో అనవసర జాప్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.


ఏ సమయంలో

ఉదయం నిద్రలేచిన తర్వాత కనీసం రెండు గంటలలోపే అల్పాహారం తినాలి. నిద్రలేచిన తర్వాత 15 నిమిషాలకల్లా తాజా పండు కానీ, ఎండుద్రాక్ష, ఖర్జూరం, బాదం వంటి డ్రై ఫ్రూట్స్‌ కానీ తినాలి. ఆ తర్వాత అల్పాహారం తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ఒకవేళ ఉదయం వ్యాయామం, వర్కవుట్లు చేసే అలవాటు ఉన్నవారు అవి పూర్తయిన తర్వాత అల్పాహారం తీసుకుంటే మంచిది. ఆ సమయానికి ఇంట్లో అల్పాహారం వండుకునే అవకాశం లేనివారు ధాన్యంతో తయారు చేసిన జావ తాగడం ఉత్తమం. అలా కుదరని పక్షంలో బయట స్థానికంగా లభించే వేడి వేడి ఇడ్లీలు, ఉప్మా, దోశ, పరోటా, పోహా, రాగి జావ వంటి వాటితో బ్రేక్‌ ఫాస్ట్‌ చేయడం మంచిది.

 

ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ వద్దే వద్దు

ప్యాకేజ్డ్‌ ఫుడ్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ జోలికి వెళ్ళకుండా ఉండటమే మంచిది. అలా చెప్పారని బ్రేక్‌ ఫాస్ట్‌ బంద్‌ చేయడం కూడా పొరపాటే. బరువు తగ్గాలనే కాంక్షతో ఆరోగ్యానికి చేటు తెచ్చుకోవడం తగదని నిపుణులు చెబుతున్నారు. స్థానికంగా లభించే ఆహారం తినడం వల్ల స్థానిక ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చడానికి సహకరించనట్లు అవుతుంది. అంతేకాదు స్థానిక సంప్రదాయ రుచులను ప్రోత్సహించినట్లు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. 


విదేశాల్లో ఉంటే

దేశీయంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇడ్లీ, ఉప్మా, దోశ, వడ, గారె, పూరీ వంటివి లభిస్తాయి. విదేశాల్లో ఉన్నవారు బ్రేక్‌  ఫాస్ట్‌గా ఎటువంటి ఆహారం తీసుకోవాలనే విషయంలో కూడా నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అమెరికా, ఆఫ్రికా, మధ్య ఆశియా, దక్షిణ అమెరికా తదితర ప్రాంతాల్లో కూడా స్థానికంగా అందుబాటులో ఉండే ఆహారం తీసుకోవచ్చు. గోధుమ బ్రెడ్డు, వెన్న, జున్ను, గ్రుడ్లు, మిల్లెట్లు వంటివి ఉదయం అల్పాహారంగా తీసుకోవాలి. ప్రతి రోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనం చేస్తున్నాం కదా, ఉదయం తినడం ఎందుకు? అనే వాదన తప్పని నిపుణులు చెబుతున్నారు. ఏ దేశంలో ఉన్నా సరే ఉదయం ఏ వేళలో నిద్రలేచినా, రెండు గంటల లోపు అల్పాహారం తినాలి.


విస్మరిస్తే

ఉదయం వేళ బ్రేక్‌ ఫాస్ట్‌ను విస్మరించిన వారికి దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఆనారోగ్యకర జీవనశైలి కారణంగా సమతుల ఆహారం లోపిస్తుంది. ఫలితంగా గుండెకు, దేహంలోని వివిధ అవయవాలకు రక్తం సరఫరా చేసే ధమనులు దెబ్బతింటాయి. రక్తపోటు, అధిక బరువు సమస్యలు కూడా వస్తాయి. ఇంకా మద్యపానం, ధూమపానం అలవాట్లు కూడా ఉంటే ఆరోగ్యం మరింతగా దిగజారుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బ్రేక్‌ ఫాస్ట్‌ను విస్మరించిన పక్షంలో రక్తనాళాలపై ప్లేక్‌ ఏర్పడి సన్నబడిపోతాయని అధ్యయనంలో గుర్తించారు. కాగా ఆరోగ్యకరమైన అల్పాహారం తినేవాళ్ళకు గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. బరువు, కొలెస్టారాల్‌ను ఆరోగ్యకర స్థాయుల్లో ఉండేలా చేస్తుంది. తరచూ బ్రేక్‌ ఫాస్ట్‌ను విస్మరించినా, తక్కువ శక్తినిచ్చే అల్పాహారం తీసుకున్నా అథెరోస్క్లెరోసిస్‌ కనబడుతుంది.


అంటే బ్రేక్‌ ఫాస్ట్‌ చేసేవాళ్ళతో పోలిస్తే ధమనుల లోపలివైపు కొవ్వు్ అధికంగా పేరుకుపోయి రక్తం సరఫరాకు ఆటంకాలు ఏర్పడతాయి. ధమనులు సాగే గుణం కోల్పోయి కాఠిన్యంగా మారతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్రేక్‌ ఫాస్ట్‌ అసలు చేయనివారిలో నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. రక్త పోటు, ఫాస్టింగ్ గ్లూకోజ్‌ స్థాయిల్లో వ్యతాసాలు ఏర్పడతాయి.


అధ్యయనం ఇలా

స్పెయిన్‌లో మాడ్రిడ్‌ నగరంలో ఎటువంటి గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు లేని 4,052 మంది స్ర్తీపురుషులపై ఒక హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. వీరిలో ఉదయం వేళ ఎటువంటి అల్పాహారం తీసుకోని 2.9 శాతం మంది ఉన్నారు. స్వల్ప శక్తినిచ్చే అల్పాహారం తీసుకునేవాళ్లు 69.4 శాతం మంది, బ్రేక్‌ ఫాస్ట్‌ చేసేవాళ్లు 27.7 శాతం మంది ఉన్నారు. వీరిలో బ్రేక్‌ ఫాస్ట్‌ను విస్మరించే వారి జీవనశైలి పూర్తిగా అనారోగ్యకరంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. పౌష్టికాహార లోపం ఉన్నట్లు వెల్లడైంది. స్వల్ప శక్తినిచ్చే బ్రేక్‌ పాస్ట్‌ చేసిన వారిలో కూడా కార్డియోమెటబాలిక్‌ రిస్కు ఉన్నట్లు తేలింది. నిత్యం అల్పాహారం సమృద్ధిగా తీసుకునేవారి గుండె, కిడ్నీలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు రుజువైంది.

– ఎన్‌. మృదులలిత


Updated Date - 2020-04-01T16:26:16+05:30 IST