Abn logo
Aug 6 2021 @ 00:46AM

జయశంకర్‌ కోరిన తెలంగాణ ఏదీ?

యావత్‌ జీవితాన్ని ప్రజాశ్రేయస్సు కోసమే వెచ్చించి, తెలంగాణ ఆత్మగౌరవ పోరాటాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడంలో సిద్ధాంత భూమిక పోషించిన విద్యాధికుడు ఆచార్య జయశంకర్. ఆదర్శవంతమైన మానవ సమాజాన్ని ఆయన కలలుగన్నాడు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ స్వయం పాలనకోసం భావజాల వ్యాప్తిలో సఫలీకృతులయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాన్ని అభివృద్ధి, ఆత్మ గౌరవ పోరాటంగా చాటి చెప్పారు. తెలంగాణ వాదం పట్ల, తెలంగాణకు జరుగుతున్న అవమానాలు, అన్యాయాలపట్ల సామాన్య ప్రజానీకానికి సైతం అవగాహన కలిగించి, రాజకీయ చైతన్యాన్ని రగిలించారు. ఉద్యమంలో సకలజనులను భాగస్వామ్యం చేయడం కోసం భావజాల వ్యాప్తి -ప్రజాందోళనలు -రాజకీయ ప్రక్రియ అనే రూపాలకు శ్రీకారం చుట్టారు. ఉద్యమం చల్లబడుతున్నప్పుడల్లా అటు రాజకీయ నాయకులను, ఇటు ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తూ ఉద్యమాన్ని బతికించారు. తెలంగాణవాదాన్ని సజీవంగా ఉంచడంలో ఆయన పాత్ర వెలకట్టలేనిది. తెలంగాణ యువతను అగ్గిరవ్వలుగా మార్చి, సంస్కృతిని, పండుగలను మరిచి బతుకుతున్న వాళ్ళను ఒక్కటిగా చేశాడు. మన చందమామ తెలంగాణే అంటూ దానిని అందుకోవడానికి సబ్బండవర్ణాలూ ఒక్కటికావాలన్నాడు. స్వరాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో సీమాంధ్ర పాలకుల పాలనాసంస్కృతికి భిన్నంగా విధాన నిర్ణయాలు జరగాల్సిఉందని జయశంకర్ సార్ అనేవారు. సమైక్య రాష్ట్రంలో విధానాలు కాంట్రాక్టర్ల, కార్పొరేట్‌ శక్తుల కేంద్రంగా ఉన్నందున, అందుకు పూర్తిభిన్నమైన రీతిలో తెలంగాణ రాష్ట్రంలో పౌరులను భాగస్వాములను చేసే విధంగా విధానాల రూపకల్పన జరగాలన్నారు. ఎట్టకేలకు అమరుల త్యాగాల పునాదుల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కానీ, నేటి పాలకులు జయశంకర్‌ ఆశయాలకు విరుద్ధంగా తెలంగాణ సంపదను బహిరంగ మార్కెట్‌లో వేలం వేస్తూ కాంట్రాక్టర్లకు, కార్పొరేట్‌ శక్తులకు అంటగడుతున్నారు. సీమాంధ్ర పాలకుల కంటే పదింతలు దోచేస్తూ నాటి విధానాలనే కొనసాగిస్తున్నారు. మన నిధులు మనకు దక్కడం అంటే మూడు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించడం కాదు. కృష్ణా, గోదావరి నదీజలాల్లో మనకు రావాల్సిన వాటాను లెక్కలతో సహా సమాజం ముందుంచారు జయశంకర్. నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎంత మేరకు పక్కరాష్ట్రంతో, కేంద్రంతో కొట్లాడుతోందో గమనిస్తూనే ఉన్నాం. మన నీళ్లు మనకు దక్కాలంటే రాష్ర్ట ఏర్పాటు ఒకటే మార్గమన్న జయశంకర్ ఆలోచనలను పాలకులు స్వరాష్ట్రంలో ఆచరణలో పెట్టిందిలేదు. నియామకాల విషయంలోనూ అదే జరిగింది. స్వరాష్ట్రంలో ఏడేండ్ల కాలంలో లక్షాముప్పైరెండు వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న లెక్కలు మోసపూరితమైనవి. రాష్ట్ర అవతరణ నాటికి ఉన్న ఖాళీలనే పాలకులు నేటికీ చూపుతున్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఎంతమంది ఉద్యోగ విరమణ పొందారు, ఏ సెక్టార్‌లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, కొత్తగా ఏర్పడిన జిల్లాల్లోనూ, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలలోను, మండలాలలోను ఎంతమంది ఉద్యోగులు అవసరమన్న లెక్కలు మాత్రం చెప్పరు, భర్తీ చేయరు. కాని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీ ఏర్పడిన వెంటనే ఆగమేఘాల మీద రాజకీయ నిరుద్యోగులతో వాటిని భర్తీ చేస్తరు. 2018 ఎన్నికల్లో అధికారపక్షం నిరుద్యోగ భృతి హామీతో యువతను ఓట్లకోసం వాడుకున్నది తప్ప ఇచ్చింది లేదు. తెలంగాణ ప్రజలు ‘జాతిపితగా’ పిలుచుకునే జయశంకర్ సార్ ఆశలు, ఆశయాలు, స్వరాష్ట్రంలో అణగారిన బతుకులలో వెలుగులు నింపడం ద్వారా, మట్టిమనుషుల బతుకులకు భరోసా దొరకడం ద్వారా నెరవేరుతాయని తెలంగాణ సమాజం ఆశించింది. కాని ఆ వైపుగా కనీసం అడుగులు కూడ పడడం లేదు. భౌగోళిక తెలంగాణతోనే కర్తవ్యం ముగిసిపోరాదనీ, ఏర్పడబోయే నూతన రాష్ట్రంలోని సంపద ప్రతి పౌరునికి అందేవిధంగా తెలంగాణ పౌర సమాజం తెలంగాణ పునర్నిర్మాణంలో ఒక కీలక శక్తిగా కావాలని జయశంకర్ సూచించారు. జయశంకర్ సార్ జయంతిని ఆ లక్ష్యానికి అనుగుణంగా జరుపుకోవడం అంటే తెలంగాణ సంపద దుర్వినియోగం కాకుండా ప్రజలకు దక్కేవిధంగా కొట్లాడటం, నదీజలాల్లో మన వాటాను సాధించుకోవడం, నిరుద్యోగుల పక్షాన పోరాడడం, పౌర హక్కులను కాపాడుకోవడం, అంతిమంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు నిలబడడం. తెలంగాణ విద్యావంతుల వేదిక శక్తి మేరకు ఈ కర్తవ్యాన్ని కొనసాగిస్తుంది. 

పందుల సైదులు

(తెలంగాణ విద్యావంతుల వేదిక)

(నేడు జయశంకర్ జయంతి)

ప్రత్యేకంమరిన్ని...