Advertisement
Advertisement
Abn logo
Advertisement

వీటితో ఇన్ని ప్రయోజనాలా..?

రోగనిరోధకశక్తిని పెంచే విటమిన్‌ ‘సి’


మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ముఖ్య‌మైన పోష‌కాల్లో విట‌మిన్ సి ఒక‌టి. నిత్యం అది ఉన్న ఆహారపదార్థాలు తీసుకుంటేనే మ‌న శ‌రీరానికి సరిపడినంత విట‌మిన్ సి అందుతుంది. రోజూ పండ్లు, కూరగాయలు తింటే శరీరానికి సరిపడా విటమిన్ సి పొందవచ్చు. 

చాలా పండ్లు, కూరగాయల్లో ఉండే విటమిన్ సి లో యాంటీ ఆక్సిడెంట్స్  పుష్కలంగా ఉంటాయి. అస్కార్బిక్ యాసిడ్‌గా పిలిచే విటమిన్ సి శరీరంలో వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. విటమిన్‌ సి వల్ల గాయాలు త్వ‌ర‌గా మానుతాయి. ఎముక‌లు దృఢంగా ఉంటాయి. రకరకాల వ్యాధులు రాకుండా అది అడ్డుకుంటుంది. ఇత‌ర ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా మ‌న‌కు విట‌మిన్ సి వ‌ల్ల క‌లుగుతాయి. ఏయే పదార్థాల్లో విటమిన్‌ సి లభిస్తుందో, దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

విటమిన్ సి గుండెకు మేలు చేస్తుంది. కేన్సర్ వచ్చే అవకాశాల్ని తగ్గిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎముకలు బలంగా ఉండాలన్నా విటమిన్ సి అవసరం. శరీర బరువును క్రమబద్ధీకరించడంలో దీనిదే కీలక పాత్ర. శరీరంలోని కొవ్వు కణాలు శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది విటమిన్ ‘సి’. అందువల్ల కొవ్వు కణాలు పెరగకుండా ఉంటాయి. ఎంతకీ పొట్ట తగ్గట్లేదని భావించేవారు క్రమంతప్పకుండా విటమిన్ సి ఉండే పండ్లు, కూరగాయల్ని ఎక్కువగా తింటే సత్ఫలితాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు.


ఎంత అవసరం

మగవాళ్లకు రోజూ 90 మిల్లీగ్రాముల విటమిన్ సి అవసరం. ఆడవారికి రోజుకు 75 మిల్లీగ్రాములు విటమిన్‌ సి సరిపోతుంది. ఎంత పెద్దవాళ్ళైనాసరే ఒకేరోజులో రెండువేల మిల్లీగ్రాములకు మించి విటమిన్ సి తీసుకోకూడదు. అలా చేస్తే కడుపునొప్పి, ఇతర ఆరోగ్యసమస్యలు వస్తాయి.


ఎన్నో ప్రయోజనాలు

తరచూ జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం, ఇన్‌ఫెక్షన్లు మన శరీరాన్ని బాధిస్తుంటే నిమ్మరసమే అందుకు చక్కని పరిష్కారం. నిమ్మరసంలో ఉండే విటమిన్‌ - సి రోగనిరోధక శక్తిని ఇనుమడింపచేస్తుంది. రకరకాల మానసిక ఒత్తిళ్లకు నిమ్మకాయ నీళ్ళు లేదా లెమన్‌ - టీ ఎంతో ప్రయోజనకరంగా పనిచేస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారికి నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది. భోజనానికి ముందు గ్లాసు నిమ్మరసం తాగాలి. దీనివల్ల మన పొట్ట నిండి, ఆహారం తక్కువగా తీసుకుంటాం. పైగా జీవక్రియ రేటు అదుపులో ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా నిమ్మరసం ఆరోగ్యానికే కాదు, సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. మొటిమల్ని దూరంచేసి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.- యాంటీ ఏజింగ్‌ ఏజెంట్‌గా నిమ్మరసం బాగా పనిచేస్తుంది. తద్వారా వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. 

ఉసిరి, నారింజ, నిమ్మకాయ, కివి, ద్రాక్ష, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టమాటా, జామకాయ, మామిడికాయ, స్ట్రాబెర్రీ, బ్రకోలీ, మొలకలు, కాలీఫ్లవర్, బంగాళాదుంపలు వంటి వాటిలో విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది.

ఆరెంజ్‌ : నారింజ పండ్ల‌లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. ఒక గ్లాస్ నారింజ రసం తాగితే దానినుండి 124 మిల్లీగ్రాముల విట‌మిన్ సి ల‌భిస్తుంది. అందువ‌ల్ల నిత్యం నారింజ జ్యూస్ తాగ‌డం మంచిది. దీనివల్ల శరీరానికి పొటాషియం, ఫోలేట్‌, లూటీన్, విట‌మిన్ ఎ త‌దిత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. 

ద్రాక్షపండ్లు : ఒక్కో ద్రాక్షపండులో దాదాపుగా 45 మిల్లీగ్రాముల విట‌మిన్ సి ఉంటుంది. అలాగే శరీరానికి అవసరమైన ఫైబ‌ర్‌, పొటాషియం, విట‌మిన్ ఎ కూడా ద్రాక్షపండ్ల ద్వారా ల‌భిస్తాయి.

క్యాప్సికం : ఒక మీడియం సైజ్ క్యాప్సికంలో 95 మిల్లీగ్రాముల విట‌మిన్ సి ఉంటుంది. ఇది మ‌న‌కు ఒక రోజుకు స‌రిపోతుంది. అలాగే విట‌మిన్ ఎ, కె, బి 6 లు కూడా క్యాప్సికం ద్వారా ల‌భిస్తాయి.

స్ట్రాబెర్రీ : ఒక చిన్న క‌ప్పునిండుగా ఉన్న స్ట్రాబెర్రీ ముక్క‌ల‌లో 98 మిల్లీగ్రాముల విట‌మిన్ సి ఉంటుంది. అలాగే పొటాషియం, మెగ్నిషియం త‌దిత‌ర పోష‌కాలు కూడా మ‌న‌కు స్ట్రాబెర్రీల ద్వారా అందుతాయి.

బ్రొకొలి : ఒక క‌ప్పు బ్రొకొలి ముక్క‌ల్లో 81 మిల్లీగ్రాముల విట‌మిన్ సి ఉంటుంది. అలాగే బ్రొకొలిలో ఉండే కాల్షియం, పొటాషియం, ఫైబ‌ర్‌, విట‌మిన్ ఎ, కె, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌యోగ‌పడ‌తాయి.

కివి : కివీల‌లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. ఒక చిన్న కివీ పండులో 60 మిల్లీగ్రాముల విట‌మిన్ సి దొరుకుతుంది. అలాగే పొటాషియం, ఫైబ‌ర్‌లు కూడా కివీల ద్వారా అందుతాయి.

క్యాబేజీ : ప‌చ్చి క్యాబేజీ క‌న్నా ఉడ‌క‌బెట్టిన‌ క్యాబేజీలోనే విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. ఒక క‌ప్పు ప‌చ్చి క్యాబేజీలో దాదాపుగా 30 మిల్లీగ్రాముల విట‌మిన్ సి ఉంటుంది. అదే ఒక క‌ప్పు ఉడ‌క‌బెట్టిన క్యాబేజీలో అయితే 60 మిల్లీగ్రాముల విట‌మిన్ సి ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, మిన‌ర‌ల్స్‌, విట‌మిన్ కె, ఫైబ‌ర్‌లు కూడా క్యాబేజీలో ల‌భిస్తాయి.

కాలిఫ్ల‌వ‌ర్ : ఒక క‌ప్పు ప‌చ్చి కాలిఫ్ల‌వ‌ర్‌లో 50 మిల్లీగ్రాముల విట‌మిన్ సి ఉంటుంది. అలాగే కాల్షియం, ఫైబ‌ర్‌, పొటాషియం, ఫోలేట్‌, విట‌మిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు కూడా కాలిఫ్ల‌వ‌ర్‌లో పుష్క‌లంగా ఉంటాయి. దీని వ‌ల్ల శరీరానికి కావలసిన పోష‌ణ ల‌భిస్తుంది.


– లావణ్య వెనగంటి

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...