ఆంధ్రజ్యోతి(19-05-2022)
ప్రశ్న: నేను చాలా సన్నగా ఉంటాను. కాస్త బరువు పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
- లక్కీ, ఆదిలాబాద్
డాక్టర్ సమాధానం: బరువు పెరగడానికి ఆహారం అధిక మోతాదులో తీసుకుంటే సరిపోదు. తగిన ఆహారం సరైన పాళ్ళలో, సమయంలో తీసుకోవాలి. అప్పుడే అందులోని పోషకాలు శరీరానికి చక్కగా వంటబట్టి బరువు పెరగడంతో పాటు శక్తీ వస్తుంది. శక్తినిచ్చే కార్బోహైడ్రేట్ల కోసం అన్ని రకాల ధాన్యాలు, పండ్లు ఉపయోగపడతాయి. కండరాలు బలమవడానికి అవసరమయ్యే మాంసకృత్తుల కోసం పాలు, గుడ్లు, చికెన్, చేప, అన్ని రకాల పప్పు ధాన్యాలు రోజూ తీసుకోవాలి. అలాగే మంచి రకాల కొవ్వుల కోసం బాదం, ఆక్రోట్ లాంటి గింజలు, అవిసె గింజలు, వేరుశెనగలు మొదలైనవి తీసుకోవాలి. ప్రతిపూటా ఆహారంలో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవడం ద్వారా కూడా కొద్దిగా ఎక్కువ క్యాలరీలను శరీరానికి అందించవచ్చు. రోజూ తప్పనిసరిగా అరగంట పాటు వ్యాయామం చేసినా లేదా ఏదైనా ఆటలాడినా ఆకలి పెరగడమే గాక తీసుకున్న ఆహారం చక్కగా వంటబట్టి బరువు పెరిగేందుకు, శక్తి పెరిగేందుకు ఉపయోగపడుతుంది.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
[email protected]కు పంపవచ్చు)