Advertisement
Advertisement
Abn logo
Advertisement

వారికి ఏ డైట్‌ అవసరం?

ఆంధ్రజ్యోతి(27-06-2020)

ప్రశ్న: మా పేరెంట్స్‌ వయస్సు 70 ఏళ్లు పైనే. బీపీ, షుగర్‌ సమస్యలు ఉన్నాయి. కొవ్వు తగ్గించే మందులు, బీపీ, షుగర్‌ మందులు వాడుతున్నారు. కరోనా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఐసోలేషన్‌లో ఉన్నట్టుగానే ఉంచుతున్నాం. అయితే వారి ఆహార ప్రణాళిక ఎలా ఉండాలో సలహా ఇవ్వండి.


- కుమార్‌, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: వయసు పైబడిన వారిలో శరీరంలో రిపేర్‌ శాతం తగ్గడం వల్ల, అవయవాల పనితీరు మందగించడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీళ్లు మూడు ముఖ్యమైన విషయాలు పాటించాలి.


నిద్ర: రాత్రి నిద్ర సరిగ్గా పట్టకపోవడం సాధారణం. అయితే నిద్ర వచ్చినా రాకపోయినా టైమ్‌కు పడుకోవడం అలవాటు చేసుకోవాలి. నిద్రకు ఉపక్రమించే ముందు చామంతి టీ లేదా  కప్పు తేనె వేసిన పాలు తాగాలి. ఒక చిన్న నువ్వుల లడ్డు తిని కొద్దిగా నీళ్లు తాగి పడుకున్నా సరిపోతుంది. ఇది దినచర్యగా చేసుకోవాలి.


వ్యాయామం: శరీరం స్టిఫ్‌గా ఉండడం, నొప్పులు, పొట్టలో గాలి పెరగడం వంటివి సాధారణంగా కనిపిస్తాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. గాలి బయటకు వెళ్లే స్ట్రెచింగ్‌ చేస్తే ఇంకా బాగుంటుంది. ఆవ నూనె మసాజ్‌ వారానికి ఒకసారి చేసుకుని తలస్నానం చేయాలి. ప్రతిరోజూ ఉదయం గంటపాటు ఎండలో కూర్చోవాలి. 


ఆహారం: వయసు పైబడిన వారిలో అరుగుదల తగ్గుతుంది. కాబట్టి సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. 


ఇలాంటి ఆహారం తీసుకుంటే మరీ మంచిది.


ఉదయం 6 : బాదం పలుకులు 2, నల్ల ఎండు ద్రాక్ష 5(నానబెట్టినవి)


ఉదయం 7 : టీ / కాఫీ / గ్రీన్‌టీ


ఉదయం 8 : ఇడ్లీలు రెండు / నువ్వులు వేసిన టొమాటో చట్నీతో ఉప్మా + ఒక కోడిగుడ్డు


ఉదయం 11 : పల్చటి రాగి జావ లేక మజ్జిగ (అల్లం కరివేపాకు పచ్చి మిర్చి పసుపు పొడి చేసి వేయాలి) లేక వెజ్‌సూప్‌


మధ్యాహ్నం 1 : ఓట్స్‌ జావ + పప్పు + మజ్జిగ


సాయంత్రం 4 : ఒక బౌల్‌ నిండా పండ్లు


సాయంత్రం 5 : టీ / కాఫీ / వెజ్‌సూప్‌


రాత్రి 8 : మెత్తగా ఉడికించిన అన్నం + పచ్చిబఠాణీ లేక బీన్స్‌కర్రీ


రాత్రి 10 : గుప్పెడు గుమ్మడి గింజలు + చామంతి టీ


డాక్టర్ బి.జానకి, న్యూట్రిషనిస్ట్

[email protected]


Advertisement
Advertisement