Advertisement
Advertisement
Abn logo
Advertisement

చిన్న పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలంటే..

ఆంధ్రజ్యోతి(27-04-2020):

ప్రశ్న: మా బాబుకు ఏడు నెలలు. ఎలాంటి ఆహారం ఇవ్వాలో సూచిస్తారా?

- త్రివేణి, వరంగల్


డాక్టర్ సమాధానం:‌  పిల్లలకు అయిదారు నెలల వయసు వచ్చేవరకు తల్లిపాలు లేదా పిల్లల వైద్యులు సూచించిన ఫార్ములా పాలు మాత్రమే పట్టడం శ్రేయస్కరం. అయిదు నెలలు నిండిన తరువాత ఘనాహారం మొదలు పెట్టినా తల్లిపాలను ఇవ్వడం మానకూడదు. ఆరు నుండి తొమ్మిది నెలల వయసు వరకు రోజుకు కనీసం మూడు లేదా నాలుగు సార్లు తల్లిపాలు పట్టవచ్చు. మిగిలిన రెండు లేదా మూడుసార్లలో ఒకసారి తాజాగా ఇంట్లో తయారు చేసి వడకట్టిన పళ్లరసాలు, వడకట్టిన కూరగాయల, ఆకుకూరల సూప్స్‌ తాగించండి. మిగతా ఒకటి లేదా రెండు సార్లు ఇంట్లో తయారు చేసిన లేదా బయట కొన్న పిల్లల ఆహారం ఇవ్వండి. అన్నం, బార్లీ, ఓట్స్‌ లాంటివి మెత్తగా పొడిచేసి వండి పెట్టండి. క్యారెట్‌, బంగాళా దుంప వంటివి  ఉడికించి మెత్తగా చేసి పెట్టవచ్చు.


అరటి, సపోటా లాంటి పళ్ళు బాగా మెత్తగా నలిపి గింజలు తీసి పెట్టండి. కానీ ఆపిల్‌, బేరి పళ్ళు లాంటివి మాత్రం ఉడికించి మెత్తగా చేసి మాత్రమే ఇవ్వాలి. మొదటిసారి ఘనాహారం ఇచ్చేప్పుడు పిల్లలకు మింగడం రాకపోవచ్చు కాబట్టి ఆ ఆహారాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేసి ఒక స్పూను నెయ్యితో కలిపి పెట్టాలి. ఎనిమిది నెలలు దాటిన తరువాత మాత్రం  మిక్సీలో వేసిన ఆహారాన్ని ఇవ్వడం మానెయ్యాలి. తొమ్మిది నుండి పన్నెండు నెలల వయసు పిల్లలకు రోజుకు రెండు లేదా మూడుసార్లు తల్లి పాలను ఇచ్చి.. మిగిలిన సమయంలో వివిధ రకాల ఆహారం పెట్టవచ్చు. సంవత్సరం లోపు పిల్లలకు తేనె, పంచదార లాంటివి పెట్టకూడదు.

 

డా. లహరి సూరపనేని 

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

 [email protected]కు పంపవచ్చు)

Advertisement

పిల్లల సంరక్షణమరిన్ని...

Advertisement