Abn logo
Aug 19 2021 @ 13:48PM

బాగా పొడుగవ్వాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి?

ఆంధ్రజ్యోతి(19-08-2021)

ప్రశ్న: నాకు 15 ఏళ్లు. ఎత్తు నాలుగడుగుల ఎనిమిది అంగుళాలు. మా నాన్న ఐదడుగుల మూడంగుళాలు, అమ్మ నాలుగడుగుల ఎనిమిది అంగుళాలు ఎత్తు ఉంటారు. నేను బాగా పొడుగవ్వాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి? 


- సాగర్‌, కర్నూల్‌


డాక్టర్ సమాధానం: ఎత్తు సాధారణంగా వంశపారంపర్య లక్షణం. అయితే మీరు ఎదిగే వయసులో ఉన్నారు. కాబట్టి ఆహారం, నిద్ర విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎత్తు పూర్తిగా పెరగకపోయే అవకాశం ఉంది. మీరు కనీసం మరొక మూడు నాలుగేళ్లు ఎత్తు పెరగవచ్చు. ఎత్తు పెరగడానికి ముఖ్యమైనది ఎముకల ఆరోగ్యం. దీని కోసం ఆహారంలో ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్‌- డి సరైన మోతాదుల్లో తీసుకోవాలి. ప్రొటీన్ల కోసం గుడ్లు, మాంసం, చేపలు, పాలు, పెరుగు, పప్పుధాన్యాలు, బాదం, ఆక్రోట్‌, పిస్తా లాంటి గింజలు తీసుకోవచ్చు. ఆకుకూరలు, పాలు, పెరుగు, పనీర్‌ మొదలైన ఆహార పదార్థాల్లో కాల్షియం ఉంటుంది. రోజుకు కనీసం అరలీటరు నుండి ముప్పావు లీటర్‌ పాలు లేదా పాల పదార్థాలు తీసుకుంటే రోజుకు సరిపడా కాల్షియం లభిస్తుంది. విటమిన్‌ - డి కోసం రోజూ కనీసం ఓ అర గంట సమయం ఎండలో తిరిగితే సరిపోతుంది. రోజూ కనీసం రెండువేల కెలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవడం ద్వారా  ఎత్తు మాత్రమే కాక మీరు తగినంత బరువు పెరిగే అవకాశం ఉంటుంది. రోజుకు ముప్పై నుండి అరవై నిమిషాల పాటు వేగంగా నడవడం, పరిగెత్తడం, ఏదైనా ఆటలు ఆడడం లాంటివి చేయండి. ప్రతి రాత్రీ కనీసం ఎనిమిది గంటల నిద్ర  అవసరం. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే వంశపారంపర్యంగా మీరు ఎంతెత్తు పెరగగలరో ఆ ఎత్తు పెరగడంలో ఎలాంటి ఇబ్బందులు రావు. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

[email protected]కు పంపవచ్చు)

ప్రత్యేకంమరిన్ని...