శాపం తొలగేనా

ABN , First Publish Date - 2020-10-01T08:15:04+05:30 IST

పుట్టిన తర్వాత పిల్లల్లో అనేకమందికి వినికిడ సమస్య ఉంటుంది. కొందరికి చూపు సరిగా లేకపోవడం, మాటలు రాకపోవడం, మరికొందరికి శారీరక

శాపం తొలగేనా

 జిల్లాకు రెండు డిస్ట్రిక్ట్‌ ఎర్లీ ఇంటర్‌వెన్షన్‌ సెంటర్‌లు మంజూరు

  రాజమహేంద్రవరం, అమలాపురంలలో ఏర్పాటుకు రూ.1.67 కోట్ల వ్యయం

 పసివయసు పిల్లల్లో శారీరక, మానసిక లోపాలు గుర్తించి వీటిలో చికిత్స

  హియరింగ్‌, స్పీచ్‌, చూపు, దంత సమస్యలు, ప్రవర్తనల్లో లోపాలకు వైద్యం

  నిధులు అందించనున్న కేంద్ర జాతీయ హెల్త్‌ మిషన్‌


(కాకినాడ-ఆంధ్రజ్యోతి) పుట్టిన తర్వాత పిల్లల్లో అనేకమందికి వినికిడ సమస్య ఉంటుంది. కొందరికి చూపు సరిగా లేకపోవడం, మాటలు రాకపోవడం, మరికొందరికి శారీరక వైకల్యం, ఇంకొందరికి మానసిక ప్రవర్తనలో లోపాలు.. దీంతో తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. వీటిని వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే డిస్ట్రిక్ట్‌ ఎర్లీ ఇంటర్‌వెన్షన్‌ కేంద్రాలు జిల్లాకు రెండు మంజూరయ్యాయి. రాజమహేంద్రవరం, అమలాపురంలలో చెరొక కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది.


ఈ మేరకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్త భవనాల నిర్మాణానికి రూ.81.55 లక్షలు, అమలాపురం ఏరియా ఆసుపత్రిలో కొత్త కేంద్రానికి రూ.85.73 కోట్లతో నిర్మాణానికి టెండర్లు పిలించింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద వీటి నిర్మించి అందులో ప్రత్యేక వైద్య నిపుణుల ద్వారా పిల్లల ఆరోగ్యంపై కేంద్రం ప్రత్యేక దృష్టిసారిస్తోంది. ప్రస్తుతం ఇటువంటి కేంద్రాలు కాకినాడ, రంపచోడవరంలలోనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా రాజమహేంద్రవరం, అమలాపురం ప్రాంతాలకు మంజూరు చేశారు.


జిల్లాలో అనేకమంది పిల్లలకు పుట్టుకతోపాటు అనేక లోపాలు ఉంటున్నాయి. వయస్సుతోపాటు పెరిగే ఈ సమస్యలతో అనేకమంది తమ భవిష్యత్తును కోల్పోతున్నారు. కొందరు పిల్లలు పసిప్రాయం నుంచి ఎదిగిన తర్వాత కూడా సరిగ్గా మాట్లాడలేకపోవడం, వినికిడి సమస్య ఎక్కువగా ఉండడం, కొన్నింటిని గుర్తించలేకపోవడం, అందరితో చురుగ్గా, చలాకీగా ఉండకపోవడం, విపరీత ప్రవర్తన వంటి సమస్యలున్నాయి. వీటికి చికిత్స చేసే నిపుణులు తక్కువ. పైగా ఆయా ఆసుపత్రులకు తీసుకువెళ్లినా ఖర్చులు అధికం. ఈ నేపథ్యం లో జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద పిల్లలకు సంబంధించి సమస్యలకు చికిత్స అందించేందుకు కేంద్రం ఈ ఇంటర్వెన్షన్‌ సెంటర్ల ద్వారా పిల్లల్లో లోపాలు సరిచేయడానికి అండగా నిలబడుతోంది.


తాజాగా మంజూరైన ఈ రెండు కేంద్రాల్లో హియరింగ్‌, స్పీచ్‌, సైక్రియాటిక్‌, ఇతర మానసిక సమస్యలకు సంబంధించిన వైద్య నిపుణులను నియమించి చికిత్స చేయిస్తుంది. ఈ కేంద్రాల్లో ఫీల్డ్‌ వలంటీర్లు కూడా పనిచేస్తారు. వీరు తరచుగా తమ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో సర్వేచేసి సమస్యలు, లోపాలున్న విద్యార్థులను గుర్తించి ఈ కేంద్రానికి తీసుకువస్తారు. వైద్యనిపుణుల పర్యవేక్షణలో సరిచేస్తారు.


జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వీటిని నడుపుతారు. ప్రస్తుతం ఈ రెండు కేంద్రాల వల్ల ఆయా ప్రాంతాల్లో సమస్యలున్న పిల్లలను చికిత్స కోసం దూరప్రాంతాలకు తీసుకువెళ్లే వ్యయప్రయాసలు తప్పనున్నాయి.


Updated Date - 2020-10-01T08:15:04+05:30 IST