శవాలను ఎక్కడ పూడ్చుకోవాలి

ABN , First Publish Date - 2022-10-07T04:44:20+05:30 IST

మా ఊర్లో ఎవరైనా చస్తే పూడ్చుకోవడానికి స్థలం కూడా లేదని వీరబల్లి మండలం మట్లి గ్రామం పాపిరెడిగారిపల్లె హరిజనవాడకు చెందిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

శవాలను ఎక్కడ పూడ్చుకోవాలి
కలేక్టరేట్‌ ఎదుట నిరసనలో మట్లి గ్రామస్థులు

కలెక్టరేట్‌ ఎదుట గ్రామస్థుల ఆందోళన


రాయచోటి (కలెక్టరేట్‌), అక్టోబరు 6:  మా ఊర్లో ఎవరైనా చస్తే పూడ్చుకోవడానికి స్థలం కూడా లేదని వీరబల్లి మండలం మట్లి గ్రామం పాపిరెడిగారిపల్లె హరిజనవాడకు చెందిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రెండు ట్రాక్టర్లలో దాదాపు 60 మంది గ్రామస్థులు గురువారం కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టర్‌ కార్యాలయం ముందు వర్షంలోను నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ పీఎస్‌ గిరీషాను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు కలెక్టర్‌తో మాట్లాడుతూ మా ఊరికి చెందిన కొంతమంది బడాబాబులు మాండవ్య నదిలో ఇసుక తవ్వకాలు చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఈ నది ప్రాంతంలో మా ఊరికి చెందిన రైతులు దాదాపు 30 ఫిల్టర్లు, బోర్లు కూడా వేసి ఉన్నారని వివరించారు. వాళ్లు రాత్రింబవళ్లు ఇసుక లోడేయడం వల్ల ఫిల్టర్లు బయటపడటంతో పాటు నదిలో ఉన్న మా ఊరి సమాధులు కూడా బయట పడుతున్నాయని వారు కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. ఈ విషయమై స్థానిక తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇప్పటికైనా మీరు ఇసుక అక్రమ తవ్వకాలను ఆపి మాకు న్యాయం చేయాలని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. ఈ విషయంపై కలెక్టర్‌ స్పందిస్తూ వీర బల్లి తహసీల్దార్‌తో మాట్లాడి అక్కడ తవ్వకాలు వెంటనే ఆపాలని ఆదేశించారు.

Updated Date - 2022-10-07T04:44:20+05:30 IST