ఎక్కడి పనులు అక్కడే!

ABN , First Publish Date - 2022-08-16T08:03:47+05:30 IST

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో చేపడుతున్న పనుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది.

ఎక్కడి పనులు అక్కడే!

నత్తనడకన సాగుతున్న ఉపాధి హామీ పనులు


రెండేళ్లలో  26.94 లక్షల పనుల ప్రతిపాదన

ఇంకా పెండింగ్‌లోనే 14.50 లక్షల పనులు

హైదరాబాద్‌/న్యూస్‌ నెట్‌వర్క్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో చేపడుతున్న పనుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. ఏ ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులను ఆ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాల్సి ఉండగా.. ప్రతి గ్రామంలోనూ ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌ పనుల సంఖ్య లక్షల్లోకి చేరుతోంది. చాలా గ్రామాల్లో ప్రతి ఏటా కొత్తగా పనులు ప్రతిపాదించడం, హడావుడిగా మొదలుపెట్టి సగంలోనే వదిలేస్తున్న పరిస్థితులు ఉంటున్నాయి. లక్షల్లో పనులు పెండింగ్‌ ఉన్నప్పటికీ.. ఏటా కొత్త పనులు వెతుకుతూ పాతవాటిని పూర్తి చేయడంపై దృష్టి పెట్టడంలేదు. ఈ నేపథ్యంలోను కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులపై పరిమితి విధించినట్లు తెలుస్తోంది. అధికారిక అంచనా ప్రకారం గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల (2020-21, 2021-22)లోనే రాష్ట్ర వ్యాప్తంగా 26.94 లక్షల పనులు ప్రతిపాదించగా.. వాటిలో 12.44 లక్షల పనుల్ని మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన 14.50 లక్షల్లో కొన్ని పనులు కొనసాగుతుండగా..

చాలా వరకు పెండింగ్‌లోనే ఉన్నాయి. చాలా చోట్ల ఉపాధి పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తుండటంతో బిల్లుల సమస్య తలెత్తుతోంది. కొన్నిరకాల పనులు చేసేందుకు కూలీలు ముందుకు రాకపోవడం, పంచాయతీ పాలకవర్గాల అభ్యంతరాలతో అర్ధాంతరంగా ఆపేస్తున్నారు. గతంలో ప్రతిపాదించిన పనులను కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ ప్రతిపాదించడం, ఒకే పనిని ఏళ్ల తరబడి కొనసాగించడం, క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు లేకపోవడం వంటి పలు కారణాలూ ఉన్నాయి.  అయితే వివిధ కారణాలతో పనులన్నీ పెండింగ్‌లో ఉంటుండడంతో ఉపాధి హామీ పథకం ప్రయోజనం గ్రామీణ ప్రజలకు దక్కడంలేదు. ఫలితంగా పథకం లక్ష్యం నెరవేరకుండా పోతోంది. 


పెండింగ్‌ల వల్లే కేంద్రం పరిమితి..

ఏటా లక్షల్లో పెండింగ్‌ పనులు నమోదవుతుండడంతో కేంద్ర ప్రభుత్వం పనులపై పరిమితి విధించింది. గతంలో ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో వందల సంఖ్యలో పనులు ప్రతిపాదించే అవకాశం ఉండగా.. తాజా నిబంధన ప్రకారం ప్రతి గ్రామంలో కేవలం 20 పనులను మాత్రమే ప్రతిపాదించాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగానే ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు సమాచారం. అయితే ప్రతిపాదించిన 20 పనుల్లో పూర్తయిన వాటి స్థానంలో కొత్త పనులను నమోదు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు కేంద్ర విభాగం ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా పనులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండకుండా.. సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంటుందని ప్రజా సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. 


పనుల పెండింగ్‌కు ప్రధాన కారణాలివే..!

ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స నిబంధనలను విస్మరించి ఎక్కువ  పనులను ప్రతిపాదిస్తుండటంతో ఆర్థిక సంవత్సం ముగిసే సమయానికి పూర్తి చేయలేకపోతున్నారు. బిల్లుల సమస్యతో పనులను ఆపేస్తున్నారు. 

పనుల పర్యవేక్షణ బాధ్యతను గ్రామ కార్యదర్శులకు అప్పగించినప్పటికీ.. ఫీల్డ్‌ అసిస్టెంట్లు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో పనులు చేసేందుకు కూలీలను రప్పించలేక పోతున్నారు.  

చాలా గ్రామాల్లో తేలికపాటి పనులపైనే ఉపాధి కూలీలు ఆసక్తి చూపుతున్నారు. గుట్టలున్న ప్రాంతాల్లో తవ్వకం పనులకు ముందుకు రావడంలేదు. 

గ్రామానికి అవసరం లేకున్నా.. మొక్కుబడిగా పనులను ప్రతిపాదిస్తుండడంతో వాటిని పూర్తి చేయకుండా నిలిపేస్తున్నారు. 

కొన్ని పనులను హడావుడిగా మొదలుపెట్టి.. ఆ తర్వాత అవసరం లేదంటూ నిలిపి వేస్తున్నారు. 

Updated Date - 2022-08-16T08:03:47+05:30 IST