సీఎం వెళ్లింది ఎక్కడికి?

ABN , First Publish Date - 2022-05-21T08:10:34+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారిక విదేశీ పర్యటన... కట్టుదిట్టంగా, గుట్టుగా సాగుతోందా? ప్రభుత్వ యంత్రాంగం చెప్పినట్లు కాకుండా... మరోరకంగా

సీఎం వెళ్లింది ఎక్కడికి?

చెప్పింది దావోస్‌కు.. దిగింది లండన్‌లో

అధికారిక పర్యటనలో ‘అనధికార ట్రిప్‌’

సతీసమేతంగా ప్రత్యేక విమానంలో...

సీఎంతో కనిపించని అధికార బృందం

లండన్‌కు ఎందుకు వెళ్లారన్నదే ప్రశ్న

అధికారిక పర్యటనపై ఎందుకీ గుట్టు?


అమరావతి, మే 20 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారిక విదేశీ పర్యటన... కట్టుదిట్టంగా, గుట్టుగా సాగుతోందా? ప్రభుత్వ యంత్రాంగం చెప్పినట్లు కాకుండా... మరోరకంగా ఎందుకు జరుగుతోంది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన... ముందస్తు షెడ్యూలు ప్రకారం కాకుండా, ‘డీవియేషన్ల’తో సాగవచ్చునా? తాజా పరిణామాలతో తలెత్తుతున్న అనుమానాలివి. ఎందుకంటే... ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, ముఖ్యమంత్రి జగన్‌ స్విట్జర్లాండ్‌లోని దావో్‌సకు వెళ్తున్నారు. ఈ బృందంలో జగన్‌ సతీమణి కూడా ఉన్నారని అందులో చెప్పలేదు. కానీ... శుక్రవారం ఉదయం 9.40 గంటలకు గన్నవరం నుంచి స్పెషల్‌ ఫ్లైట్‌లో సతీసమేతంగా జగన్‌ బయలుదేరారు. శుక్రవారం సాయంత్రానికి జగన్‌ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ చేరుకుంటారని అధికారిక సమాచారం ఇచ్చారు. కానీ... ఆ విమానం రాత్రి 10.30 గంటల సమయంలో లండన్‌లో ల్యాండ్‌ అయ్యింది.


భారత్‌ నుంచి దావోస్‌ వెళ్లేందుకు లండన్‌ దాకా వెళ్లాల్సిన అవసరమే లేదు. లండన్‌కంటే చాలా ముందే దావోస్‌ వచ్చేస్తుంది. అయినా సరే... సీఎం ప్రయాణించే విమానం లండన్‌లో దిగింది. దావో్‌సకు వెళ్లాల్సిన సీఎం లండన్‌లో ఎందుకు దిగారో తెలియడంలేదు. ప్రపంచ ఆర్థిక సదస్సులో మన రాష్ట్రం గురించి చెప్పి, పెట్టుబడులను ఆకర్షించేందుకు జగన్‌ దావోస్‌ వెళ్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ ఏర్పాట్లు చూసేందుకు కొందరు అధికారులు ముందే అక్కడికి చేరుకోవడం సహజం. మిగిలిన ఉన్నతాధికారులు సీఎంతోపాటే ప్రత్యేక విమానంలో వెళతారు. కానీ... శుక్రవారం సీఎం వెళ్లిన ప్రత్యేక విమానంలో జగన్‌, ఆయన సతీమణితోపాటు ఏవియేషన్‌ సలహాదారు భరత్‌ రెడ్డి మాత్రమే వెళ్లినట్లు సమాచారం!

Updated Date - 2022-05-21T08:10:34+05:30 IST