ప్రపంచంలో అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్‌ కేంద్రం ఎక్కడుంది?

ABN , First Publish Date - 2022-08-09T21:57:30+05:30 IST

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా చాడ విజయ భాస్కర్‌రెడ్డి ఆగస్టు 4న బాధ్యతలు స్వీకరించారు. దీనితో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరింది. భాస్కరెడ్డి మెదక్‌ జిల్లాలోని దుబ్బాకకు చెందిన వ్యక్తి.

ప్రపంచంలో అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్‌ కేంద్రం ఎక్కడుంది?

పోటీ పరీక్షల ప్రత్యేకం

కరెంట్‌ అఫైర్స్‌


తెలంగాణ అంశాలు

హైకోర్టు న్యాయమూర్తిగా సి.వి.భాస్కర్‌ రెడ్డి

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా చాడ విజయ భాస్కర్‌రెడ్డి ఆగస్టు 4న బాధ్యతలు స్వీకరించారు. దీనితో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరింది. భాస్కరెడ్డి మెదక్‌ జిల్లాలోని దుబ్బాకకు చెందిన వ్యక్తి. 


సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతి ఉత్సవాలు

తొలిసారి  సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతి ఉత్సవాలను ఆగస్టు 18న తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్నది. ఇతను జనగామ జిల్లా ఖిలాషాపూర్‌కు చెందినవాడు. చత్రపతి శివాజీకి సమకాలికుడు. గౌడ వృత్తి చేస్తూ గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటి గోల్కొండ పాలకులు అయిన మొఘల్‌ రాజుపై తిరుబాటు చేసి  ఖిలాషాపూర్‌ను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. 


నేతన్న బీమా

తెలంగాణలోని చేనేత, పవర్‌లూమ్‌ కార్మికులకు బీమా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం‘నేతన్న బీమా’ పథకాన్ని ఆగస్టు 7న ప్రారంభించింది. దీని ద్వారా 80,000 మంది పవర్‌లూమ్‌, నేత కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. ఎల్‌ఐసీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం దీనిని అమలు చేస్తుంది.  సహజ మరణం లేదా ప్రమాదవశాత్తు మరణించిన వారికి రూ.5 లక్షల వరకు భీమా వర్తిస్తుంది.


జాతీయ అంశాలు

ఉప రాష్ట్రపతిగా ధన్‌ఖడ్‌ 

భారత 14వ ఉప రాష్ట్రపతిగా జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ఎన్ని కయ్యారు. ఆగస్టు 6న జరిగిన ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి మార్గరెట్‌ అల్వాపై 346 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తం 780 ఓట్లలో 725(92.94 శాతం) పోలవగా 15 ఓట్లు చెల్లలేదు. ధన్‌ఖడ్‌కు 528(74.36 శాతం), అల్వాకు 182(25.63 శాతం) ఓట్లు వచ్చాయి. ధన్‌ఖడ్‌ ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేస్తారు.


సీజేఐగా యం.యు.లలిత్‌

ఆగస్టు 26న పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ స్థానంలో నూతన సీజేఐగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ పేరు ప్రతిపాదనలో ఉంది.  2014 ఆగస్టు 14న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లలిత్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈయన మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. జస్టిస్‌ ఎస్‌.ఎం.సిక్రీ(1971) తరవాత బార్‌ అసోసియేషన్‌ నుంచి సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన రెండో వ్యక్తిగా గుర్తింపు పొందనున్నారు.


పంచామృత్‌ యోజన

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆగస్టు 4న ఈ పథకాన్ని ప్రకటించింది. ఖర్చుతో కూడుకున్న సాంకేతిక పద్ధతులు, ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ.. సహజ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయం రెట్టింపు చేయడం దీని లక్ష్యం. నీటి వాడకాన్ని తగ్గించడం, చెరకు ఆకులు, పంట అవశేషాలను గరిష్ఠంగా వినియోగించుకోవడం, ఎరువులు, పురుగు మందుల అవశేషాలు తగ్గించడం ద్వారా వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తారు.


మిసెస్‌ ఇండియా వరల్డ్‌ 2022-23

మిసెస్‌ ఇండియా వరల్డ్‌ 2022-23గా జమ్మూ కశ్మీర్‌కు చెందిన సర్గమ్‌ కౌశల్‌ ఎంపికయ్యారు. 2022లో జరిగే మిసెస్‌ వరల్డ్‌ పోటీలో భారత్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. ముంబైలో జరిగిన ఈ పోటీలలో జూహీ వ్యాస్‌, చాహత్‌ దలాల్‌ ఒకటి, రెండో రన్నరప్‌గా నిలిచారు.


అంతర్జాతీయ అంశాలు

మాల్దీవుల అధ్యక్షుడి భారత్‌ పర్యటన

మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్‌ సోలిహ్‌ ఆగస్టు 1 నుంచి 4 వరకు భారత్‌లో పర్యటించారు. 2018లో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరవాత భారత్‌లో పర్యటించడం ఇది మూడో సారి. ఈ సందర్భంగా ఇరువురు ప్రధానులు మాల్దీవులలో అతిపెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టు అయిన ‘గ్రేటర్‌ మేల్‌ కనెక్టివిటీ’ని ప్రారంభించారు. ఇరుదేశాల మధ్య ఆరు పరస్పర అవగాహన ఒప్పందాలు కుదిరాయి. స్థానిక సంస్థల మహిళా ప్రతినిధులకు శిక్షణ- సాంకేతిక నైపుణ్యం మెరుగుపర్చడం, సైబర్‌ సెక్యూరిటీ రంగంలో సహకారం, ఫిషింగ్‌ జోన్‌ అంచనాలో సహకారం, విపత్తు నిర్వహణలో పరస్పర సహకారం వాటిలో ముఖ్యమైనవి.


అల్‌ జవహరి హతం

ఒసామా బిన్‌ లాడెన్‌ తరవాత ఆల్‌ఖైదా అధిపతిగా వ్యవహరిస్తున్న అయమన్‌ -  అల్‌- జవహరి ఆగస్టు 1న అమెరికా జరిపిన డ్రోన్ల దాడిలో మరణించారు. ఆఫ్ఘానిస్థాన్‌లోని కాబుల్‌లోని ఒక గృహంలో ఉన్న ఇతనిపై హెల్‌ఫైర్‌ మిస్సైల్స్‌ ప్రయోగించడం ద్వారా హతమార్చారు. అల్‌ఖైదా వ్యవస్థాపకుడు లాడెన్‌ కూడా 2011లో పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌ నగరంలో అమెరికా సైన్యాల చేతిలో హతమయ్యాడు.


ప్రపంచంలో అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్‌ కేంద్రం

ప్రపంచంలో అతిపెద్ద తేలియాడే సౌరవిద్యుత్‌ కేంద్రాన్ని మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో గల నర్మదా నదిపై ఉన్న ఒంకారేశ్వర్‌ డ్యాంపై నిర్మించనున్నారు. రూ.300 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా 600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుంది. ఈ నిర్మాణం పూర్తయితే థర్మల్‌ విద్యుత్‌, జల విద్యుత్‌, సోలార్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే మధ్యప్రదేశ్‌లోని ఏకైక జిల్లాగా ఖాండ్వా నిలవనుంది. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్‌ కేంద్రం తెలంగాణలోని రామగుండంలో ఉంది.


సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

స్కైలైట్‌ విన్యాసాలు

జూలై 25 నుంచి 29 వరకు అంతర్గత సామర్థ్యాన్ని నిర్ధారించుకోవడానికి, ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ను పరీక్షించుకోవడానికి భారత్‌ నిర్వహించిన విన్యాసాలు ఇవి. దీనిలో ఇస్రో, ఇతర అంతరిక్ష సంస్థలు పాలుపంచుకున్నాయి. ఇటీవల జరిగిన రష్యా - ఉక్రెయిన్‌ వివాదంలో కీలకపాత్ర పోషించిన ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ను దృష్టిలో ఉంచుకుని సైబర్‌, విద్యుదయస్కాంత ప్రభావాలపై భారత సైన్యం అధ్యయనాలు నిర్వహించింది.


అర్జున్‌ మార్క్‌ 1ఏ

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ట్యాంక్‌ విధ్వంసక క్షిపణి(యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్‌) ‘అర్జున్‌ మార్క్‌ 1ఏ’ని డీఆర్‌డీఓ ఆగస్టు 4న పరీక్షించింది. డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీఓ) రూపొందించిన ఈ లేజర్‌ ఆధారిత క్షిపణిని మహారాష్ట్ర ఆహ్మద్‌నగర్‌లోని ఆర్మ్‌డ్‌ కోర్‌ సెంటర్‌ అండ్‌ స్కూల్‌లో పరీక్షించారు.


భారత్‌లో 64 రామ్‌సర్‌ సైట్లు

భారత్‌ నూతనంగా 10 చిత్తడినేలలను ప్రతిపాదించింది. దీంతో దేశంలో రామ్‌సర్‌ సైట్స్‌ కింద చేరిన చిత్తడి నేలల సంఖ్య 64కి చేరింది. కొత్తగా చేరిన 10లో 6 తమిళనాడుకు చెందినవి కాగా, గోవా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఒడిసా నుంచి ఒక్కోటి ఉన్నాయి. తమిళనాడు నుంచి కుడంకులం పక్షుల అభయారణ్యం, గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ బయోస్పియర్‌ రిజర్వ్‌, వెంబమ్నార్‌ వెట్‌ల్యాండ్‌, వెల్లోడీ పక్షుల అభయారణ్యం, ఉదయ్‌ మార్తాంపురం పక్షుల అభయారణ్యం, వేదాంతంగల్‌ పక్షుల అభయారణ్యం చేర్చారు. ఇతర రాష్ట్రాల నుంచి సత్కోషియ(జార్జ్‌), రంగనాథుడు బర్డ్‌ సాంక్చుయరీ(కర్ణాటక), సిర్పూర్‌ చిత్తడినేల(మధ్యప్రదేశ్‌), నందా సరస్సు(గోవా) ముఖ్యమైనవి. కొత్తగా చేర్చిన 10 చిత్తడి నేలలను కలుపుకొని భారత్‌లో వీటి విస్తీర్ణణం 12,50,361 హెక్టార్లకు చేరింది.


క్రీడలు

ఎస్‌ఏఎఫ్‌ఎఫ్‌ యు20 ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌

2022కి గానూ సౌత్‌ ఏషియన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌(ఎస్‌ఏఎఫ్‌ఎఫ్‌) అండర్‌ 20 చాంపియన్‌షిప్‌ టోర్నీని డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ గెలుపొందింది. ఒడిసాలోని కళింగ స్టేడియంలో ఆగస్టు 5న జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 5-2 తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించడం ద్వారా  భారత్‌ గెలుపొందింది. గుర్‌కిరత్‌ సింగ్‌ ఉత్తమ విలువైన ఆటగాడిగా ఎంపికయ్యాడు.  భారత్‌కు చెందిన ఉత్తమ గోల్‌కీపర్‌గా కూడా ఎంపికయ్యాడు.


మహిళల యురోపియన్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌

మహిళల యురోపియన్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ అయిన యూఈఎఫ్‌ఏ(యూనియన్‌ ఆఫ్‌ యురోపియన్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌) 2022 ఎడిషన్‌ను ఇంగ్లాండ్‌ జట్టు తొలిసారిగా గెలుపొందింది. లండన్‌లోని వెంబ్గే స్టేడియంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో జర్మని జట్టుని 2-1 తేడాతో ఓడించడం ద్వారా ఇంగ్లాండ్‌ విజేతగా నిలిచింది.


-ఎస్‌. మహిపాల్‌రెడ్డి

సీనియర్‌ ఫ్యాకల్టీ

Updated Date - 2022-08-09T21:57:30+05:30 IST