ఇదేమి ‘స్పందన’

ABN , First Publish Date - 2021-10-12T06:28:02+05:30 IST

ర్కారు కొర్రీలతో పింఛన్లు కోల్పోయిన అభాగ్యులు, గ్రామాల్లో కక్షసాధింపులతో నెలకొన్న భూవివాదాలతో రైతులు, రేషన్‌ కార్డులు కోల్పోయి మరికొందరు.. ఒంగోలులోని కలెక్టరేట్‌కు పోటెత్తారు.

ఇదేమి ‘స్పందన’
స్పందనలో కలెక్టర్‌కు అర్జీలు ఇచ్చేందుకు ఒంగోలులోని ప్రకాశం భవన్‌లో బారులు తీరిన ప్రజలు

భరోసా పోయె..బతుకు బరువాయె! 

పెన్షన్‌ కోల్పోయి వృద్ధుల కన్నీరు  

క్యూలలో గంటల తరబడి నిల్చొని వినతులు

గ్రామాల్లో  పెరుగుతున్న భూవివాదాలు

అలంకారప్రాయంగా సచివాలయ వ్యవస్థ

అర్జీలతో కలెక్టరేట్‌కు క్యూకడుతున్న ప్రజానీకం

 ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో వెల్లడి

‘పెన్షన్‌ కోసం అర్జీ పెట్టుకోవడానికి ఇప్పటికి ఐదుసార్లు వచ్చాను. అయినా స్పందన లేదు. ’ ఇది ఓ దివ్యాంగురాలి ఆవేదన.

‘పెన్షన్‌ మీదే ఆధారపడి బతుకుతున్నాను. ఉన్నట్లుండి అది ఆగిపోయింది.  తిండికి లేక పస్తులుంటున్నాను’ ఒక వృద్ధురాలి కన్నీటి రోదన. 

‘2020 మార్చిలో చనిపోయిన వ్యక్తి వివరాలను రేషన్‌ కార్డు నుంచి తొలగించాలని కోరితే  సచివాలయ  సిబ్బంది మరణించిన అతని  వేలిముద్ర కావాలని అడుగుతున్నారు’. ఇది ఓ యువకుడు వేదన. 

ఆధార్‌ కార్డు వేలిముద్రలు పడటం లేదని, ఈకేవైసీ కాలేదని పథకాల లబ్ధిని తీసేశారంటూ మరికొందరి ఆక్రోశం. 

భూ వివాదాలు, ఆన్‌లైన్‌ సమస్యలపై  ప్రదక్షిణలు చేస్తున్న ఇంకొందరు. 

ఒంగోలులోని ప్రకాశం భవన్‌లో ప్రతి సోమవారం కలెక్టర్‌ నిర్వహించే  స్పందన (ప్రజా ఫిర్యాదుల దినం)కు అర్జీలు పోటెత్తుతున్నాయి. అత్యధిక శాతం మంది పింఛన్‌ కోసం వస్తున్నారు. ఇక గ్రామాల్లో రాజకీయ కక్షసాధింపులు ఎక్కువై ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న భూ వివాదాలపై కూడా అర్జీలు అధికంగా అందుతున్నాయి.  ఇతరత్రా సమస్యలను కూడా పలువురు ఏకరువు పెడుతున్నారు. కొందరు ఒకటికి నాలుగు సార్లు తిరిగినా సమస్య పరిష్కారం కావడం లేదు.  ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 

ఒంగోలు (జడ్పీ), అక్టోబరు 11: సర్కారు కొర్రీలతో పింఛన్లు కోల్పోయిన అభాగ్యులు, గ్రామాల్లో కక్షసాధింపులతో నెలకొన్న భూవివాదాలతో రైతులు, రేషన్‌ కార్డులు కోల్పోయి మరికొందరు.. ఒంగోలులోని కలెక్టరేట్‌కు పోటెత్తారు. ప్రతి సోమవారం నిర్వహించే స్పందనకు రానురానూ సమస్యలతో వచ్చేవారు పెరిగిపోతున్నారు. ప్రధానంగా అర్హులైన వృద్ధులకు సైతం పెన్షన్‌ను తీసివేస్తున్నారు. అకస్మాత్తుగా పెన్షన్‌ ఆగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో కాలూచేయి కూడదీసుకుని అష్టకష్టాలు పడుతూ తమ గోడు చెప్పుకోవడానికి కలెక్టరేట్‌కు వస్తున్నారు. ఈ సోమవారం వచ్చిన అర్జీల్లో ఎక్కువశాతం వారివే ఉండటం అందుకు నిదర్శనం. ఇక అక్కడ వారి కష్టాలు వర్ణనాతీతం. అందరితోపాటు వారు కూడా వయసు సహకరించకపోయినా సరే వరుసలో నిలబడాల్సిందే. ముదిమి వయసులో మారుమూల గ్రామాల నుంచి ఇక్కడకు రావడమే ఒక విషాదమైతే వారికోసం కనీసం ప్రత్యేక సదుపాయాలు చేయాలన్న స్పృహ కూడా యంత్రాంగానికి లేకపోవడంతో వరుసలో నిలబడలేక వారి ఇబ్బంది చూపరులకు కంటతడి పెట్టిస్తోంది.


చనిపోయిన వ్యక్తి వేలిముద్ర వేయాలంట

2020 మార్చిలో చనిపోయిన వ్యక్తి పేరును రేషన్‌కార్డు నుంచి తొలగించాలని ఆయన కొడుకు వలంటీరు ద్వారా సచివాలయంలో ప్రయత్నించి వారి ప్రశ్నలకు విసిగి వేసారి స్పందనలో అర్జీ ఇవ్వడానికి కలెక్టరేట్‌కు వచ్చాడు. అతనికి సచివాలయ సిబ్బంది చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యపోవడం ఖాయం. చనిపోయిన వ్యక్తి వచ్చి వేలిముద్ర వేస్తే తొలగిస్తారట. సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి. జిల్లాకేంద్రానికి వెళ్లమని మరోసారి జవాబు. వీరు చేస్తున జాప్యానికి దానితో అనుసంధానమై ఉన్న పెన్షన్‌ దగ్గర నుంచి వివిధ సంక్షేమ పథకాలు ఆగిపోయాయని బాధితుడి ఆవేదన.


భూ వివాదాలపైనా అధికంగా వినతులు 

పింఛన్ల కోసం వచ్చే వారి తర్వాత గ్రామాల్లో భూవివాదాలను పరిష్కరించాలని కోరుతూ వచ్చేవారు ఎక్కువగా ఉన్నారు. సోమవారం మొత్తం 360 వరకూ అర్జీలు రాగా అందులో 90వరకు పింఛన్ల కోసం, అలాగే భూవివాదాలకు సంబంధించి 88 వరకు అర్జీలు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామాల్లో మితిమీరిన రాజకీయ జోక్యంతో సివిల్‌ వివాదాలు రోజురోజుకూ పెరిగిపోతు న్నాయి. గిట్టని వారిని లక్ష్యంగా చేసుకుని తమకు సహక రించే అధికారుల అండదండలతో లేనిపోని వివాదాలకు ఆజ్యం పోస్తూ పచ్చని పల్లెల్లో చిచ్చుపెడుతూ చలిమంట కాచుకుంటున్నారు. స్పందనకు వచ్చే అర్జీల్లో దాదాపు 40 శాతం గ్రామాల్లో భూముల తాలూకా వివాదాలకు సంబంధించినవే కావడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.


నెరవేరని సచివాలయ వ్యవస్థ లక్ష్యం

సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని సమస్యలు అక్కడే పరిష్కారమవుతాయని ఇకపై జిల్లాకేంద్రాలకు ప్రజలు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదని కొన్ని వందల సార్లు ప్రభుత్వ పెద్దలు వివిధ వేదికలపై చెప్పి ఉంటారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కనీసం వృద్ధుల పెన్షన్‌ సమస్యపై కూడా సచివాలయ యంత్రాంగం స్పందించక పోవడంతో తమకు సత్తువ లేకపోయినా జిల్లా కేంద్రానికి వస్తున్నారు. పలు పథకాలకు అర్హత ఉన్నా సచివాలయాల్లో నమోదు చేయడం లేదంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఇందుకు తాజాగా గడువు పూర్తయిన ఈబీసీ నేస్తం పథకమే ఉదాహరణ. 


కలెక్టర్‌ సీరియస్‌ అవుతున్నా మారని  తీరు

ప్రతి స్పందన సమావేశంలో కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ యంత్రాగానికి అర్జీల పరిష్కారం విషయంలో కఠినమైన ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు. సచివాలయాల సందర్శనకు వెళ్లినప్పుడు సైతం తమ పరిధిలోని అంశాలపై పారదర్శకంగా వ్యవహరించాలని, అర్హులైన లబ్ధిదారుల విషయంలో సత్వర నిర్ణయాలు ఉండాలని సున్నితంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా పనితీరులో మార్పు ఆశించినంతగా కనిపించడం లేదు. 


అర్జీలను గడువులోపు పరిష్కరించాలి

కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

 స్పందనలో వచ్చే అర్జీలను గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవన్‌లోని స్పందన హాలులో సోమవారం ఆయన డయల్‌ యువర్‌ కలెక్టర్‌ నిర్వహించడంతోపాటు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజానీకం నుంచి అర్జీలను స్వీకరించారు. వాటిపై స్పందించిన కలెక్టర్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. పరిష్కారం కాని అర్జీలు ఉంటే ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో అర్జీదారుడికి తెలియజేయాలన్నారు. స్పందన  వినతులపై ప్రతి శుక్రవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామన్నారు. సంబంధిత అఽధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్షించి పెండింగ్‌ అర్జీలపై దృష్టి సారించాలన్నారు. జేసీలు కేఎస్‌ విశ్వనాఽథన్‌, టీఎస్‌ చేతన్‌, కృష్ణవేణి, ఇన్‌చార్జి డీఆర్వో సరళావందనం పాల్గొన్నారు. 





Updated Date - 2021-10-12T06:28:02+05:30 IST