సంతలకు స్థలమేది?

ABN , First Publish Date - 2021-03-08T06:17:39+05:30 IST

ప్రజలకు సంతలను మరింత చేరువ చేయడంతో పాటు రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మరిన్ని సంతల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కొత్తగా 60 సంతలను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్నవాటిని అభివృద్ధి చేయాలని తలచింది. అయితే వీటికి స్థలాలను సమకూర్చడంలో జాప్యం జరుగుతోంది. దీంతో రెండేళ్లవుతున్నా ఇప్పటివరకు ఒక్కటి ఏర్పాటుకాలేదు. పాత సంతల్లో మౌలిక సదుపాయాలను కూడా కల్పించలేదు. సంతల ఆవశ్యకతను సర్పంచులు, ప్రాదేశిక సభ్యులకు, ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు చొరవ చూపకపోవడంతో స్థలాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

సంతలకు స్థలమేది?

నిధులున్నా అమలు సున్నా..
ఇబ్బందులు పడుతున్న
కొనుగోలుదారులు, రైతులు
కొత్తగా 60 సంతల ఏర్పాటుకు నిర్ణయం
ఒక్కటి కూడా ఏర్పాటు కాని వైనం
ఉన్నవాటిలో మౌలిక వసతులు కరువు


ప్రజలకు సంతలను మరింత చేరువ చేయడంతో పాటు రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మరిన్ని సంతల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కొత్తగా 60 సంతలను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్నవాటిని అభివృద్ధి చేయాలని తలచింది. అయితే వీటికి స్థలాలను సమకూర్చడంలో జాప్యం జరుగుతోంది. దీంతో రెండేళ్లవుతున్నా ఇప్పటివరకు ఒక్కటి ఏర్పాటుకాలేదు. పాత సంతల్లో మౌలిక సదుపాయాలను కూడా కల్పించలేదు. సంతల ఆవశ్యకతను సర్పంచులు, ప్రాదేశిక సభ్యులకు, ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు చొరవ చూపకపోవడంతో స్థలాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

హన్మకొండ (ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కొత్తగా 60 సంతలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆలోచన బాగానే ఉన్నా కొన్ని గ్రామాల్లో సంతలకు స్థలాల కొరత ఇబ్బందిగా మారింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శ్మశానవాటికలు, ప్రకృతివనాల ఏర్పాటుకు స్థలాల కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో కొత్త సంతలకు స్థలాలు సమకూర్చలేక పంచాయతీ అధికారులు చేతులెత్తేస్తున్నారు. సంతల అవసరం తెలిసేలా ప్రచారం చేస్తే గ్రామాల్లో స్థలం ఇవ్వడానికి దాతలు ముందుకొచ్చే అవకాశమున్నా దానిని అధికారులు వినియోగించడం లేదు.
స్పందనేది?

సంత ప్రారంభానికి ఎకరా విస్తీర్ణం గల స్థలం అవసరం ఉండగా అందులో 20 దుకాణాలు, (స్టాల్స్‌), తాగునీటి సదుపాయం, ప్లాట్‌ఫామ్‌, వాహనాల పార్కింగ్‌, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పిస్తారు. ఇందుకోసం సుమారు ఒక్కో సంతకు రూ.12లక్షలు వెచ్చిస్తారు. ఈ  కొత్త సంతల ఏర్పాటును జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ)కు అప్పగించారు. ఈ సంస్థ ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ పథకం కింద నిధులను ఖర్చు చేస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కొన్నింటినైనా ఏర్పాటు చేయాలని ఆరు జిల్లాల్లోని డీఆర్‌డీఏలు యత్నిస్తున్నా ఆశించిన ఫలితం కనిపించడం లేదు. సంతల ఏర్పాటుకు ఎకరం స్థలం కోసం గ్రామపంచాయతీలకు లేఖలు రాసినా స్పందన లేదు.

వసతులు కరువు
ప్రస్తుతమున్న సంతలను అభివృద్ధి చేసేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంతల్లో చాలావరకు ప్రధాన రోడ్లపైనే కొనసాగిస్తున్నారు. దీంతో తరచూ ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సంతల వద్ద తాగునీరు కూడా ఉండడం లేదు. ఆయా సంతల్లో మౌలిక వసతుల కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు ఉపాధిహామీ నిధులు కేటాయించాలని సూచించింది. 30 దుకాణాలు అంతకన్నా ఎక్కువ ఉన్న సంతల్లో మౌలిక సదుపాయాలకు రూ.15లక్షలు కేటాయిస్తారు. ఇందులో ఈజీఎస్‌ నిధులు రూ.10 లక్షలు కాగా, గ్రామ పంచాయతీల వాటా రూ.5లక్షలు. 20 దుకాణాలు ఉండే సంతలకు రూ.12.25లక్షలు వెచ్చిస్తారు. ఇందులో ఈజీఎస్‌ నిధులు రూ.9లక్షలు, గ్రామ పంచాయతీ వాటా రూ.3.25లక్షలు. ఈ నిధులతో సంతల్లో నీటి వసతి, మూత్రశాలలు, కూరగాయల వ్యర్థాలను వేసేందుకు డంపింగ్‌ యార్డులు నిర్మిస్తారు. వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తారు. ఆసక్తి చూపే పంచాయతీలు తమ వాటా ధనాన్ని చెల్లిస్తే ఉపాధి నిధులు  మంజూరవుతాయి. గ్రామాల్లో సంతల స్థలం అర ఎకరం వరకు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన విధించారు. ఈ అవకాశాన్ని కూడా గ్రామ పంచాయతీలు పూర్తిస్థాయిలో వాడుకోవడం లేదు. తమ వంతు వాటా ధనాన్ని సమకూర్చడానికి ముందుకు రావడం లేదు. దీంతో సంతల్లో మౌలిక సదుపాయాలు లేక కొనుగోలుదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళల అవస్థలు వర్ణణాతీతం.

రైతులకు మేలు
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 75 మండలాలున్నాయి. 23 లక్షల జనాభా ఉంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని నాలుగు అర్బన్‌ మండలాలు మినహా మిగతావన్నీ వ్యవసాయ ఆధారితమైనవే. ఇక ములుగు, మహబూబాబాద్‌. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లోని కొన్ని మండలాలు పూర్తిగా గిరిజనుల అవాసాలు ఉన్నాయి. ఎక్కువ సంతలు ఈ జిల్లాల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత స్థానం వరంగల్‌ రూరల్‌, జనగామ జిల్లాలు. ప్రతీ మండలంలో కూరగాయలు, ఆకుకూరల సాగు పెద్ద ఎత్తున జరుగుతోంది. పండించిన కూరగాయాలు, వ్యవసాయ ఉత్పత్తులను రైతులు విక్రయించేందుకు వీలుగా ప్రతీ మండలంలో మూడు నాలుగు గ్రామాల్లో సంతలు నిర్వహిస్తున్నారు. ఆయా సంతలకు కూరగాయాలను తెచ్చేందుకు రైతులకు రవాణా సమస్యలు ఎదురవుతున్నాయి. రైతులు అనేక వ్యయప్రయాసాలకు ఓర్చి ఉత్పత్తులను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 56 సంతలు ఉన్నాయి. వీటికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఎంతో మందికి ఉపాధి కూడా లభిస్తోంది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన సంతలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా.. ఆచరణలో ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు.

Updated Date - 2021-03-08T06:17:39+05:30 IST