Abn logo
Jan 24 2021 @ 02:52AM

'రాజన్న రాజ్యం' ఎక్కడ జగనన్నా!?

  • అన్న అన్యాయం చేశారంటూ షర్మిల ఆగ్రహం
  • తెలంగాణలో పార్టీ పెట్టి... ‘రాజన్న రాజ్యం’ చూపిస్తా
  • ఏపీలో తమిళనాడు తరహా రాజకీయాలు తేవడమా!
  • తండ్రి వైఎస్‌ కాకుండా.. తాత రాజారెడ్డి ఆదర్శమా?
  • జగనన్నపైకి షర్మిల వదులుతున్న బాణాలు
  • వచ్చే నెలలో కొత్త పార్టీ.. వైఎస్‌ వారసత్వం తనదేనని వాదన


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి, ఆయన సోదరి వైఎస్‌ షర్మిలకు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయా? ఇద్దరి మధ్యా మాటలు కూడా కరువయ్యాయా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీని చేస్తానని లేదా తెలంగాణలో పార్టీ పెట్టించి ముఖ్యమంత్రిని చేస్తానని చెల్లి షర్మిలకు జగన్‌ హామీ ఇచ్చారా? అన్న జైలుకు వెళ్లినప్పుడు దాదాపు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి, జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకొన్న తనను ఇప్పుడు నిర్లక్ష్యం చేయడం ఏమిటి? అని షర్మిల ఆవేదన చెందుతున్నారా? కన్న కూతురు నిరాదరణకు గురవడాన్ని తల్లి విజయలక్ష్మి జీర్ణించుకోలేకపోతున్నారా? తాము ఆశించిన రాజన్న రాజ్యం ఆంధ్రప్రదేశ్‌లో కనిపించడం లేదని, తమిళనాడు తరహా రాజకీయాలను తీసుకొచ్చారని జగన్‌ రెడ్డిపై వారిద్దరూ ఆగ్రహంగా ఉన్నారా? ఇటు రాజకీయాలలో ఎదగనీయకుండా, అటు తండ్రి హయాంలో ప్రారంభించిన వ్యాపారాలలో కూడా తన పాత్ర లేకుండా చేసినందుకు అన్నపై షర్మిల మండిపడుతున్నారా? తాను ఏమిటో రుజువు చేసుకోవడానికి తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించాలని షర్మిల నిర్ణయించుకున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ ‘అవును’ అనే సమాధానమే లభిస్తోంది.


గన్‌ ప్రభుత్వం రాజన్న రాజ్యం దిశగా అడుగులు వేయడంలేదని, తనను నిర్లక్ష్యం చేయడమే కాకుండా రాజశేఖర్‌ రెడ్డితో సన్నిహితంగా మెలిగిన వారిని కూడా పక్కనపెడుతూ వచ్చారని తన సన్నిహితుల వద్ద షర్మిల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తానేమిటో అన్నకు చూపించాలన్న పట్టుదలతో ఉన్న షర్మిల, తెలంగాణలో సొంత రాజకీయ పార్టీని ప్రారంభించాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి మొదటి పక్షంలో, బహుశా ఫిబ్రవరి 9వ తేదీన తాను రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్టుగా విలేకరుల సమావేశంలో ప్రకటించాలని షర్మిల నిర్ణయించుకున్నట్టు సమాచారం. తాను ప్రారంభించబోతున్న రాజకీయ పార్టీకి ‘తెలంగాణ వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌’ అని నామకరణం కూడా షర్మిల చేసుకున్నారు. 


పీలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిల సారథ్యంలో తెలంగాణలో పార్టీ పెట్టించి సీఎంని చేస్తానని జగన్‌ రెడ్డి తనకే కాకుండా తమ తల్లి విజయలక్ష్మికి కూడా హామీ ఇచ్చారనీ, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో తన ఆర్థిక ప్రయోజనాలను, ఆస్తులను రక్షించుకోవడానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సన్నిహితంగా మెలుగుతూ ఎన్నికలకు ముందు తమకిచ్చిన హామీని విస్మరించారనీ షర్మిల ఆగ్రహంగా ఉన్నారు. 


న చెల్లెలు తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకున్న సంబంధాలు దెబ్బతింటాయని జగన్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, ఒకసారి చెల్లి షర్మిల రాజకీయాల్లోకి ప్రవేశిస్తే తెలంగాణకే పరిమితమవుతారన్న గ్యారంటీ లేదనీ, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కూడా ప్రవేశించవచ్చుననీ, ఈ క్రమంలో ఆమె తనను కూడా టార్గెట్‌ చేసుకోవచ్చుననీ జగన్‌ రెడ్డి కలత చెందుతున్నట్టు చెబుతున్నారు.


రాజశేఖర్‌ రెడ్డి కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన వారందరూ జగన్‌కంటే షర్మిల ఎక్కువ మొండి అని చెబుతున్నారు. ఆమె ఒక నిర్ణయానికి వస్తే మార్చడం ఎవరితరం కాదని వారంటున్నారు.


ర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభించడం జరిగితే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి విశ్వసనీయతకు గండిపడుతుందని వైఎస్‌ కుటుంబ సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని వారు షర్మిల వద్ద ప్రస్తావించగా, తన సోదరుడు తనను దారుణంగా మోసం చేశాడని, అతను కష్టాల్లో ఉన్నప్పుడు తమను వాడుకొని ఇప్పుడు ఇంతలా నిర్లక్ష్యం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తన రాజకీయ ప్రయాణం వల్ల జగన్‌ రెడ్డికి లాభమా? నష్టమా? అన్నది తనకు అనవసరమని ఆమె స్పష్టం చేస్తున్నారు. 


రాజశేఖర్‌ రెడ్డి జీవించి ఉన్నప్పుడు జగన్‌తో పోల్చితే తననే ఎక్కువ ప్రేమగా చూసుకునేవారని, ఆయనకు నిజమైన వారసురాలిని తానేనని షర్మిల తేల్చి చెబుతున్నారు. జగన్‌ పాలన రాజన్న రాజ్యాన్ని తలపిస్తుందని తాము ఆశించామని, 20 మాసాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అలా కనిపించడం లేదని, తండ్రి రాజశేఖర్‌ రెడ్డిని కాకుండా తాత రాజారెడ్డిని జగన్‌ ఆదర్శంగా తీసుకున్నారని షర్మిల విమర్శిస్తున్నారు. ఈ కారణంగానే ‘రాజన్న రాజ్యం’ ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు తెలియజేయడానికే తెలంగాణలో తాను రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్టు తమ కుటుంబ శ్రేయోభిలాషులకు ఆమె వివరిస్తున్నారు. 


ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని దెబ్బతీయడంతోపాటు రాష్ట్రంలో జగన్‌ పాలనా తీరుతెన్నులపై తెలంగాణలోని నాయకులు, ఇతరులలో నెగెటివ్‌ అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో జగన్‌ చేస్తున్న తప్పులను, వ్యవహార శైలిని ఎత్తిచూపడం ద్వారా తెలంగాణ ప్రజల్లో తనపట్ల నమ్మకం ఏర్పడేలా ముందుకు వెళ్లాలని షర్మిల నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.


రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి వచ్చే నెలలో ఏర్పాటు చేయనున్న విలేకరుల సమావేశంలో షర్మిలతోపాటు తల్లి విజయలక్ష్మి కూడా పాల్గొంటే తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అది పెద్ద కుదుపే అవుతుంది. జగన్‌ రెడ్డి  ప్రచారం చేసుకుంటున్న విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతుంది.


న్నా చెల్లెలు చెరోవైపు నిలబడితే తల్లి విజయలక్ష్మి కూతురి వైపే మొగ్గు చూపే ఆలోచనలో ఉన్నారనీ, అదేజరిగితే ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ రెడ్డి ప్రభ మసకబారుతుందనీ చెప్పవచ్చు. ఒకవైపు సొంత బాబాయ్‌ వివేకానంద రెడ్డి కూతురు సునీత, మరోవైపు సొంత చెల్లి షర్మిల తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే జరిగే నష్టం తెలుసుగనుకే జగన్‌ రెడ్డి ఇటీవల కలత చెందుతున్నట్టు చెబుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement