Abn logo
Apr 29 2020 @ 01:06AM

మోదీజీ, ఏదీ ఆర్థిక ప్యాకేజీ?

కరోనాపై పోరు ఎంత ముఖ్యమో ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కడమూ అంతే ముఖ్యమని ముఖ్యమంత్రులతో తాజా సమావేశంలో ప్రధాని మోదీ చెప్పారు. మరి ముఖ్యమంత్రులతో అయిదవ సమావేశం ఏర్పాటు చేసే లోపు ఆర్థిక ప్యాకేజీ విషయంలో ప్రధానమంత్రి కీలక ప్రకటన చేస్తారా? ఆ కీలక ప్రకటన వెలువడని పక్షంలో ఐదవ సమావేశానికి మరికొందరు ముఖ్యమంత్రులు రాకపోవడమో, మమతా బెనర్జీ లాగా విమర్శలు వర్షించడమో జరిగే అవకాశాలు లేకపోలేదు.


ఇటీవలి కాలంలో  కొన్ని దృశ్యాలు చూడడం మామూలయిపోయింది. నిర్జన దారుల్ని చూసి దీనంగా తలలూపే చెట్ల ఆకులు, ఎవరికి దారిచూపాలో తెలియని ట్రాఫిక్ సూచికలు, భూమికే గ్రహణం పట్టిందా అని ఆశ్చర్యపోతూ ఆకాశంలో తచ్చాడుతున్న పక్షులు, అప్పుడప్పుడూ పాత సంచీ మూపున వేసుకుని, అరిగిన చెప్పుల్ని మరింత అరిగిస్తూ నడుస్తూ వెళుతున్న అగమ్య గోచర బాటసారి, వారం పదిరోజులకోసారి  టీవీల ముందు మూతికి గుడ్డకట్టుకుని ముఖ్య మంత్రులు, కేంద్రమంత్రులు, అధికారులు, సర్పంచులు చెబుతున్నది వింటూ తలఊపే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూడడం అలవాటైపోయింది. ఒక టేబుల్ ముందు కూర్చుని ఆలకించే ఈ దేశ ప్రధానమంత్రి అంతా విన్న తర్వాత గత ఆరు వారాలుగా ముఖ్యమంత్రులకైనా, సర్పంచులకైనా ఇస్తున్న సందేశాల్లో వాక్య నిర్మాణం వేరైనా, స్వరం హెచ్చుతగ్గుల్లోనూ, హావభావాల్లోనూ వ్యత్యాసం ఉన్నా చెబుతున్న విషయాల్లో పెద్ద తేడా ఉండడం లేదు. ‘కరోనా వ్యాపించకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకోండి. రెండు గజాల దూరం పాటించమని చెప్పండి. చాలా దేశాల కంటే మనం ముందుగా అప్రమత్తమై చర్యలు తీసుకున్నాం.’ అనేవే ఆయన సందేశాల సారాంశం. ఆఖరుకు ఆకాశవాణిలో ‘మన్ కీ బాత్’ పేరుతో చేస్తున్న ప్రసంగంలో కూడా అవే భావాలు వ్యక్తమవుతున్నాయి.


మార్చి 20న మొదటి సారి  ముఖ్యమంత్రుల సమావేశంలో మాట్లాడుతూ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏర్పర్చిన కోవిడ్ -19 ఆర్థిక టాస్క్ ఫోర్స్ తగిన సూచనలు చేస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. ఏప్రిల్ 2న జరిగిన రెండవ సమావేశంలో ఆయన ఆర్థిక అంశాల గురించి ఏ మాత్రం ప్రస్తావించలేదు. తాను తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయానికి మద్దతునిచ్చినందుకు మాత్రం ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. మూడవ సమావేశంలో ఆయన ఆర్థిక సవాళ్లను ప్రస్తావిస్తూ ప్రస్తుత పరిస్థితులు మనం స్వయం శక్తితో అభివృద్ధి చెందేందుకు అవకాశాలు కల్పించాయని చెప్పి ఊరుకున్నారు. పైగా ప్రాణంతో పాటు ప్రపంచాన్ని కూడా కాపాడుకోవాలని చెప్పారు. ఇక సోమవారం జరిగిన నాల్గవ సమావేశంలో కోవిడ్ -19తో పోరాడుతూనే ఆర్థిక వ్యవస్థకు మనం ప్రాధాన్యత నీయాలని చెప్పారు.


నాల్గవ సమావేశంలో ప్రధానమంత్రి స్వరంలో కనపడ్డ మార్పు– కరోనా వ్యాప్తి కన్నా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంపై ఆయన ఎక్కువ ఆందోళన పడుతున్నట్లు సూచిస్తోంది. అయినప్పటికీ ప్రధాని మోదీ నెల రోజుల క్రితం మొదటి రోజు ప్రస్తావించిన ఆర్థిక టాస్క్‌ఫోర్స్ ఇప్పటివరకూ ఏమి చేసిందో, ఏమి చేయబోతుందో అన్న విషయంపై సూచన మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. నిజానికి రెండు, మూడవ సమావేశాల నుంచే ముఖ్యమంత్రులు రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వాల్సిన ఆర్థిక మద్దతు గురించి ప్రస్తావించడం ప్రారంభించారు. రకరకాల సూచనలు చేశారు. కనుక నాల్గవ సమావేశంలోనైనా ఆయన ముఖ్యమంత్రుల ఆందోళనను పట్టించుకుంటారని  కొందరు ఊహించారు. కాని ఈ సారి ముఖ్యమంత్రుల సమావేశంలో ఒక పథకం ప్రకారం  కేవలం 9 మంది ముఖ్యమంత్రులతోనే మాట్లాడనిచ్చారు. వారిలో మెజారిటీ బిజెపి పాలిత లేదా మద్దతుతో నడుస్తున్న ప్రభుత్వాల అధినేతలే. కనుక ఒడిషా, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు మాత్రమే కేంద్రం తమను ఆర్థికంగా ఆదుకోవాలని వీడియో సమావేశంలో అడగగలిగారు.  


ప్రధానమంత్రితో జరిగిన ప్రతి సమావేశం తర్వాత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) విడుదల చేసే పత్రికా ప్రకటనలో ప్రధానమంత్రి ఏమి మాట్లాడారో వివరంగా ఇస్తుంది కాని ముఖ్యమంత్రులు ఏమి మాట్లాడారో, ఏమేమి అడిగారో ఎప్పుడూ సవివరంగా చెప్పే ప్రయత్నం చేయదు. పైగా ప్రతి ప్రకటనలోనూ ముఖ్యమంత్రులు అత్యంత క్లిష్ట సమయంలో ఈ దేశానికి సమర్థమైన నాయకత్వం అందిస్తున్నందుకు ప్రధానమంత్రిని  శ్లాఘించారని ఒక వాక్యం చేరుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దేశానికి మొత్తంగా నాయకత్వం వహిస్తున్నప్పుడు ఆయనకూ, ముఖ్యమంత్రులకూ మధ్య జరిగిన వీడియో సమావేశం గురించి వివరాలను పిఐబి కేవలం పాక్షికంగానే విడుదల చేయడంలో ఆంతర్యమేమిటి? ముఖ్యమంత్రులతో సమావేశమైనా, సర్పంచులతో సమావేశమైనా ప్రధాని మాట్లాడే మాటలు ఒకే విధంగా ఉన్నట్లే పిఐబి విడుదల చేసే ప్రకటనలు కూడా అదే మాదిరి ఉండడం గమనార్హం.


మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రధానమంత్రి తన ప్రసంగాల్లో ఎక్కడా ముఖ్యమంత్రులు కరోనాను అరికట్టడంలో చేస్తున్న ప్రత్యేక కృషిని ప్రస్తావించిన దాఖలాలు కనపడలేదు. ఫలానా రాష్ట్రంలో ఫలానా ముఖ్యమంత్రి అద్భుతంగా పనిచేశారని కానీ, వారు చేసిన సూచనలు నిర్మాణాత్మకంగా ఉన్నాయని కానీ ప్రశంసించిన సందర్భాలు లేవు. నిజానికి కరోనాపై క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నదీ, అధికార యంత్రాంగాన్ని సమర్థంగా ఉపయోగించుకుంటున్నదీ రాష్ట్ర ప్రభుత్వాలే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కేవలం రాజకీయాలకే ప్రాధాన్యత నిచ్చే ఒకరిద్దరు ముఖ్యమంత్రులను వదిలిపెడితే మిగతా ముఖ్యమంత్రులందరికీ కరోనా వైరస్‌ను ఎదుర్కోవడం అనేది తమ సమర్థతకు గీటురాయిగా మారింది. ప్రజల ముందు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వం స్పష్టంగా వివిధ రూపాల్లో కనబడి సమస్యలను తీరుస్తున్నట్లు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా ఇది ముఖ్యమంత్రుల మధ్య వారి సమర్థతకు పోటీగా పరిణమించింది. ఉదాహరణకు రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడడంతో కేసిఆర్, జగన్‌ల మధ్య అనుభవం, విజ్ఞతను పోల్చి చూసి చర్చించేందుకు జాతీయ స్థాయిలో కూడా ఆస్కారం కలిగింది. అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, పినరాయి విజయన్, అశోక్ గెహ్లాట్ మొదలైన నేతలంతా తమ అస్తిత్వాన్ని తమదైన రీతిలో ప్రదర్శిస్తున్నారు. మోదీ తమను ఎలాగూ పొగడరని వారికి తెలియని విషయం కాదు. 


లాక్‌డౌన్ విషయంలో మొదట్లో అందరూ తనకు సహకరించినందుకు కృజ్ఞతలు చెప్పిన  మోదీ  తర్వాత పరిస్థితులు చూసి రాష్ట్రాలకు నిర్ణయాధికారం వదిలేశారు. మోదీ ఏప్రిల్  14న మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటిస్తే కేసిఆర్ తెలంగాణలో మే 7 వరకు పొడిగించడం, ఢిల్లీలో కేజ్రీవాల్ నియమించిన కమిటీ మే 16 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించక తప్పదని చెప్పడంతో మొత్తం దేశవ్యాప్తంగా పరిస్థితిని కేంద్రం నియంత్రించడం సాధ్యం కాదన్న విషయం స్పష్టమైంది. టెక్నాలజీని ఎక్కువగా అలవరుచుకోవాలని, రెండు గజాల దూరం పాటించాలని, కరోనా అనంతరం కొత్త జీవితాలను గడపాల్సి వస్తుందని ఇవాళ ప్రధానమంత్రి చెప్పాల్సిన అవసరం లేకుండానే ప్రజలు తమంతట తాము పరిణామాలకు సిద్ధమవుతున్నారు. ఇళ్లనుంచి పనిచేయమని, వీడియో సమావేశాలు నిర్వహించుకొమ్మని ప్రజలకు ఎవరూ చెప్పనక్కర్లేదు. ఫేస్‌బుక్ లైవ్, జూమ్‌లను వాడుకొమ్మని బోధించనక్కర్లేదు.

మరి ప్రధానమంత్రితో సమావేశాల నుంచి ముఖ్యమంత్రులు ఏం ఆశిస్తున్నారు? కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ సోమవారం నాడు జరిగిన ముఖ్యమంత్రుల సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో ఆయన అధికారులు ఇచ్చిన వివరణ చూస్తే దీనికి జవాబు అర్థమవుతోంది. ఎలాగూ తమ ముఖ్యమంత్రికి ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం లేనందువల్ల ఆయన తన ప్రధాన కార్యదర్శిని సమావేశానికి పంపారని, పైగా కేరళ రాష్ట్రానికి ఏమి కావాలో గత సమావేశంలో వివరంగా చెప్పడమే కాక హోంమంత్రి అమిత్ షాతో అదే రోజు వివరంగా మాట్లాడారని ఆ రాష్ట్ర అధికార వర్గాలు తెలిపాయి.  కేరళ ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభంలో ఉన్నదని, ప్రస్తుత క్లిష్ట పరిస్థితినుంచి గట్టెక్కడానికి ఆర్థిక ప్యాకేజీ కావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గత సమావేశంలో అడగడమే కాక హోంమంత్రికి కూడా చెప్పారు. ఇప్పటికే  ప్రభుత్వోద్యోగులకు  నెల రోజుల జీతం కోత విధించాల్సిన పరిస్థితిని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అందువల్ల తాము అప్పులు చేసుకునే సామర్థ్యాన్ని జీఎస్‌డీపీలో 3 నుంచి 5 శాతానికి పెంచాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ‘మేము మూడు గంటలు సమావేశంలో ఉన్నాం కాని మాకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండానే  అస్పష్టమైన లాక్‌డౌన్ సర్క్యులర్లను జారీ చేస్తున్నారు. ప్రతి రాష్ట్రానికీ దానికి సంబంధించిన సమస్యలుంటాయి. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతున్నదో కేంద్రానికి ఆలోచన లేదు’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు. నాలుగు సమావేశాలైన తర్వాత కూడా  కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఆర్థిక ప్యాకేజీకోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉన్నదని ఆమె అన్నారు.


సింహం మీద స్వారీ చేయగలమే కాని, ఆ సింహంపై నుంచి ఎలా దిగాలో తెలియని పరిస్థితి ఇవాళ దేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానంగా దేశ ప్రధానమంత్రి మోదీ ఎదుర్కొంటున్నారు. కేంద్రం ఆర్థిక మద్దతునిస్తే కాని తాము పరిస్థితిని అదుపులోకి తేలేమని ముఖ్యమంత్రులు అంటున్నారు.  దేశం మొత్తాన్ని ఏక త్రాటిపై నడిపిన ఘనతను మొదట్లో తెచ్చుకున్న మోదీ ఇవాళ అదే వేగం కొనసాగించడం అంత సులభంగా కనపడడం లేదు. లాక్‌డౌన్ ఎత్తివేసే విషయంలోనూ, ఆర్థిక ప్యాకేజీ విషయంలోనూ, కరోనాపై పోరులో విజయం సాధించే విషయంలోనూ– ఆయనకూ ముఖ్యమంత్రులకూ మధ్య రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు అమలు అవుతున్నాయి. పైగా బిజెపికి ప్రధాన సమర్థక వర్గమైన వ్యాపార వర్గం, ముఖ్యంగా చిన్న, మధ్యతరహా వర్గం ఈ ప్రతిష్టంభన ఎక్కువ కాలం కొనసాగకూడదని ఒత్తిడి చేస్తోంది. తాము రోజుకు రూ.40వేల కోట్లు కోల్పోతున్నామని, 71శాతం సంస్థలు మార్చి నెల జీతాలు ఇవ్వలేకపోయాయని, లక్షల కోట్లు నిరర్థక ఆస్తులుగా మారే ప్రమాదం ఏర్పడిందని  అఖిల భారత ఉత్పత్తి దారుల సంస్థ తెలిపింది. బహుశా అందుకే కరోనాపై పోరు ఎంత ముఖ్యమో ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కడం అంత ముఖ్యమని ముఖ్యమంత్రులతో తాజా సమావేశంలో మోదీ చెప్పి ఉంటారు. ముఖ్యమంత్రులతో అయిదవ సమావేశం ఏర్పాటు చేసే లోపు ప్రధాని ఆర్థిక ప్యాకేజీ విషయంలో కీలక ప్రకటన చేస్తారా అన్న విషయం రాజధానిలో చర్చనీయాంశమవుతోంది. లేకపోతే అయిదవ సమావేశానికి మరికొందరు ముఖ్యమంత్రులు రాకపోవడమో, మమతా బెనర్జీలాగా విమర్శించడమో జరిగే అవకాశాలు లేకపోలేదు. ఊరికే ఉపన్యాసాలు వినేందుకు ఎవరైనా ఎందుకు వస్తారు?
ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Advertisement
Advertisement
Advertisement