మీ సాహిత్య చరిత్రల్లో విమర్శల్లో దళిత మహిళ చోటెక్కడ?

ABN , First Publish Date - 2020-08-24T06:35:00+05:30 IST

సాహిత్య సమాజాల మీద ‘విమర్శ’గా వచ్చిన ఒక జడివాన జల్లు- ‘బహుళ’ విమర్శ వ్యాసాల సంకలనం. సాహిత్య సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు రాళ్లవానగా సాహిత్యాన్ని కొంతవరకైనా...

మీ సాహిత్య చరిత్రల్లో విమర్శల్లో దళిత మహిళ చోటెక్కడ?

దళిత మహిళలకు సంబంధించి ఆధిపత్య వ్యవస్థలన్నీ ప్రతికూలంగా చుట్టుముట్టి ఉంటయి. ఇంత ప్రతికూల పరిస్థితుల్లో దళిత మహిళలు చదువుకోవడమే ఒక యుద్ధం. చదువుకొని రచయిత్రులుగా సాహిత్యాల్లోకి రావడం పెద్ద యుద్ధమే. వీరి రచనలు వెలుగు చూడడం చిన్న విషయం కాదు. వీరి రచనలు బూతుగా ఉన్నాయనీ, అర్థం కావడం లేదని, వీరి సాహిత్యాల్ని సాహిత్య చరిత్రలు పక్కనబెట్టి అవాచ్యమ్‌ చేసినయి.


సాహిత్య సమాజాల మీద ‘విమర్శ’గా వచ్చిన ఒక జడివాన జల్లు- ‘బహుళ’ విమర్శ వ్యాసాల సంకలనం. సాహిత్య సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు రాళ్లవానగా సాహిత్యాన్ని కొంతవరకైనా పొక్కిలించిన పర్‌స్పెక్టివ్‌ ‘బహుళ’ కృషి అభినందనీయం. బహుళ సంపాదకత్వ ముందు మాటలో ‘‘ఇది సర్వ సమగ్రమని అనుకోవడం లేదు’’ అని వారి పరిమితులు చెప్పుకున్నంక కూడా సాహితీ మిత్రుడు బివిఎన్‌ స్వామి వివిధ 27-7-2020లో ప్రతిపాదించినట్లు ‘సమగ్రము’ అనలేము.


అసమగ్రము అనడానికి ప్రధాన కారణం- ఎస్సీ, బీసీ, ఆదివాసీ, మైనారిటీలుగా ఈ సమాజాభివృద్ధిలో చెమటను, రక్తాన్ని ధారబోస్తూన్న బహుజన జెండర్‌ సాహిత్య చరిత్రలు, సాహిత్య విమర్శ సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు ‘బహుళ’లో లుప్తమైనందువల్ల. ఆధిపత్యాల్ని నిరసిస్తూ అస్తిత్వాల్ని స్వాగతించడము ఆహ్వానించదగిందే కానీ ఆ స్వాగతాలు జనాభాలో దాదాపు 50ుగా ఉన్న బహుజన జెండర్‌ సాహిత్యాల దాకా వెళ్లలేకపోయాయి. 


ఇక పర్‌స్పెక్టివ్‌ ప్రచురణ సంస్థ తమ మానిఫెస్టోలో బాలగోపాల్‌ మాటగా ‘‘అణచివేతను వ్యతిరేకించేది ఏదయినా ప్రజాస్వామిక దృక్పథమే. ఎన్ని తేడాలున్నా వినదగినదే, చర్చించదగినదే, అధ్యయనం చేయదగినదే’’ అనే అవగాహనా దృక్పథాలతో ప్రచురణలు చేస్తుందని ప్రకటించుకుంది. కానీ ఈ సంస్థ ప్రచురణలు మొదలైన 1988 నుంచి ఇప్పటిదాకా చూస్తే... అణచివేతను వ్యతిరేకించే ఆధిపత్య గొంతులకే (ఒకటి అరా బీసీ, ముస్లిమ్‌లు తప్ప) పెద్దపీటగా ప్రచురణలున్నాయి. ఎస్సీ, బీసీ, ఆదివాసీ మహిళలపై జరిగే చుట్టుముట్టు అణచివేతలు, వారు ఆక్రోశిస్తున్న ప్రజాస్వామిక విలువలు, వారి తిరుగుబాటులు, వారి దృక్పథాలను ప్రచురణకు స్వీకరించలేకపోయింది. తమ మానిఫెస్టోలో చెప్పుకున్న ఆదర్శాలు-- మెజారిటీగా ఉన్న సామాజిక ఉత్పత్తి శక్తుల జెండర్‌ అణచివేతల్ని వారి ప్రశ్నల్ని, వారి జీవితానుభవాల్ని, చరిత్రల్ని, వారి భాషా నుడికార వ్యక్తీకరణ ప్రత్యేకతల్ని సౌందర్యాల్ని వినడం, చర్చించడం, అధ్యయనం చేయడమనే ప్రజాస్వామిక దృక్పథాల్ని ఆచరణలో ఉల్లంఘించిందని ప్రచురణలు సాక్ష్యమిస్తాయి.


‘ముదితల్‌ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించగ’ వంటి అభివృద్ధికరమైన ఆలోచనలు అంతప్పుర స్త్రీల పట్ల ప్రాచీన సాహిత్యాల్లో కూడా కనిపిస్తుంటయి. ఇక ఆధునిక కాలంలో తెలుగులో కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, చలం, కొడవటిగంటి వంటి బ్రాహ్మణ మగ రచయితలు తమ కుటుంబా ల్లోని మహిళలపై ఉన్న దురాచారాల్ని నిర్మూలించడానికి వాటిని తమ రచనల ద్వారా సమాజం ముందు పెట్టి విస్తృత అధ్యయనాలు, చర్చలు ప్రేరేపించి ప్రభుత్వాలను ప్రభావితం చేసి చట్టాలు తీసుకుని రాగలిగారు. ఆ ఫలితాల వల్ల జనాభాలో కనీసం 5ు కూడా లేని సవర్ణ మహిళలు తమకున్న సామాజిక దురాచారాలను దాటుకొని బైటకొచ్చారు. తమ మగవాళ్లతో సమానంగా అన్ని రంగాల్లో వాటా అడిగే దశకు చేరుకున్నది సవర్ణ స్త్రీ సాహిత్యం.


ఒకపక్క కులాధిపత్యం పేరుతో సమాజంలో అతిచిన్న జనాభాగా వున్న, ఉత్పత్తికి ఆవలవున్న సవర్ణ మగస్వామ్యాలు చరిత్ర, రాజకీయాలు, ఉద్యమాలు, సాహిత్య నిర్మాణాలపై తమకున్న అవగాహననే సార్వజనీనం చేసి భిన్న అస్తిత్వాల బహుజన సమాజమ్మీద రుద్దారు. మరోపక్క జెండర్‌ పేరుతో తమ మగ స్వామ్యాలు వేసిన దారినే నడిచిన సవర్ణ హిందూ స్త్రీ స్వామ్యాలు తమ చెమట చిందని అభిప్రాయాలనే, జెండర్‌పై తమకున్న అవగాహననే సార్వజనీనంగా ప్రచారం చేసి, చరిత్రల్లో, సాహిత్యాల్లో, ఉద్యమాల్లో, రాజకీయాల్లో బహుజన కులాల జెండర్‌ అస్తిత్వాల్ని మాయం చేసినయి. సాహిత్య చరిత్రలు, సాహిత్య విమర్శలు ఆధిపత్య పురుషులు కేంద్రకంగా, తర్వాత ఆధిపత్య స్త్రీలు కేంద్రకంగా వచ్చినయి. సాహిత్య చరిత్ర రచనల్లో, విమర్శల్లో బహుజన కులాల జెండర్‌లకు సూదిమొన గుర్తింపులేని అన్యాయాలు జరిగినవి.


ప్రాచీనకాలంలో డక్కలి మహిళలు రాయకుంటే... ‘దయ్యం పియ్యండుకుంటేంది? డక్కలిది పాశమొండు కుంటేంది? ఆ సాహిత్యాలు కుక్కముట్టిన కుండలు’ అనే సూత్రీకరణలు ఎట్లా వస్తాయి? డక్కలి మహి ళలు రాసిండ్రనేగదా! ఇప్పటికి డక్కలి వాళ్లిండ్లకు పోతే... ‘కవిలె’ కట్టలు కనిపిస్తుంటయి. డక్కలి మహిళలు ఆ ‘కవిలె’ల్ని విప్పి అవలీలగా చదువు తుంటరు. వాటిని భద్రంగా గౌరవంగా ఒక తరాన్నించి ఇంకో తరానికి అందిస్తూ కొనసాగి స్తుంటరు. ఇప్పటికి తాటాకుల మీద ఘంటంతో డక్కలి రాజమొగిలి అవలీలగా రాస్తుంటడు. ఇవేవి సాహిత్యకారులకు, సాహిత్య విమర్శకులకు పట్టనిది.


ఆధునిక కాలంలో ఆంధ్ర, క్రైస్తవ కీర్తనలు 1860 నుంచి దళిత మహిళలు రచన చేస్తున్నారని ‘నల్లపొద్దు’ (దళిత మహిళల ఆంథాలజి)లో గోగు శ్యామల చెప్పేదాకా- ఆంధ్ర కవుల చరిత్రలు, గోల్కొండ పత్రికలు, ఆంధ్ర కవయిత్రులు, నిశానీ నీలిమేఘాలు, చిక్కనవుతున్న పాట.. ఇవన్నీ దళిత మహిళలు రచయిత్రులుగా లేరనే అభిప్రాయాలతో భ్రమింపజేసినయి.


హిందూ ఆధిపత్య కులాల సంస్కర్తలు, రచ యితలు పాశ్చాత్య ప్రభావా లతో తమ సమాజాల్లోని స్త్రీ జనాభ్యుదయం కోసం విశేష కృషి చేసినట్లు బహుజన కులాల సంస్కర్తలు, రచయి తలు తమ సమాజాల మహిళల అభివృద్ధి కోసం కృషి చేయలేకపోవడం జరిగింది. అందుకే బహుజన మహిళలు బాల్యవివాహాలు, నిరక్షరాస్యత, జోగినీ, వెట్టి కూలీ వంటి సమస్యల్నించి ఇంకా విముక్తికాని దశ ల్లోనే ఉన్నారు. జాతీయో ద్యమంలో జరిగిన స్త్రీ జనోద్ధరణ ఇంకా బహుజన  కులాల జెండర్‌ల దాకా చేరలేదు. వారి నోటి రచనలు, రాత రచనల మీద ఎలాంటి పరామర్శ  జరగడం లేదు.


సమాజ ఉత్పత్తిలో చెమటచుక్కను చిందించని జనాభాలో భాగమైన సవర్ణ స్త్రీవాదం సమాజాభివృద్ధికి ఉత్పత్తి శక్తులుగా తమ జవజీవాలం దిస్తున్న బహుజన కులాల జెండర్‌ అస్తిత్వాల్ని, సాహిత్యాలను చీకటి చేస్తున్నది. దళిత మహిళల సాహిత్యాల్లోని అస్తిత్వాల్ని, వారి మట్టి పొరల భాషా వ్యక్తీకరణ విశిష్టతల్ని, జెండర్‌ని మించిన కుల అణచి వేతల్ని చర్చ చేయకుండా, వాటిపై అధ్యయనం జరపకుండా ఏక పక్షంగా స్త్రీవాదంలో చేర్చడం అన్యాయమే. ఇక ‘దళిత స్త్రీవాదం’ అనే పదాన్ని కూడా ఏకోన్ముఖంగా కాయిన్‌ చేసింది సవర్ణ స్త్రీవాదము. స్త్రీవాదం అంటేనే పాశ్చాత్య, తెల్లరంగుగల, కులంలేని ఆధిపత్య మహిళల నుంచి అరువు తెచ్చుకున్న సవర్ణ జెండర్‌ల వాదము. ఈ వాదం దళిత మహిళల జీవితాలకు సరిపోని వాదము. అయినా ‘దళిత స్త్రీవాదులు’ అని దళిత మహిళని చూపిస్తుంది. ‘బహుళ’ జెండర్‌ రాజకీయ విమర్శ వ్యాసంలో కూడా ఇదే జరిగింది. రేపు బీసీ స్త్రీవాదం, ఆదివాసీ స్త్రీవాదం కూడా ప్రకటించినా ఆశ్చర్యం లేదు.


కారంచేడు, చుండూరు ఉద్యమాల అనంతర కాలం నుంచి దళిత రచయిత్రులు-- ప్రధానంగా మాదిగ, మాల మహిళల రచనలు-- వెలుగు చూస్తున్నయి. విజయభారతి, చల్లపల్లి స్వరూప రాణి, జూపాక సుభద్ర, వినోదిని, మెర్సీమార్గరెట్‌, ఝాన్సీ కేవీ కుమారి, గోగుశ్యామల, జాజులగౌరి, మేరీమాదిగ, తాళ్లపెల్లి యాకమ్మ, సిస్టర్‌ అనసూయ, కన్నారం ఝాన్సీ మొదలగు దళిత రచయిత్రులు మగపెత్తనాలకన్నా తమ చుట్టూత చుట్టుముట్టిన కులహింసల్ని, వివక్షల్ని, సామాజిక అణచివేతల్ని తమ సాహిత్యాల్లో విస్తృతంగా వస్తువీకరించారు. తాము అనుభ వించే హింసల్లో అణచివేతల్లో పదిట్ల పదకొండోదిగ మగపెత్త నాల్ని, అణచివేతల్ని వెలువరిస్తే... మగపెత్తనమే ప్రధాన హింసగా దళిత మహిళలు ఎదుర్కుంటున్నారని ప్రచారం చేస్తున్నది స్త్రీవాద సాహిత్యము.


పాశ్చాత్య ఫెమినిజం పరిభాషను అనువదించుకున్న భారత స్త్రీవాదము- పురుషులు స్త్రీలను వ్యవస్థీకృతంగా లోబర్చుకోవడాన్ని ‘పితృస్వామ్యం’గా నిర్వచించి ఈ అవ గాహనలనే ఆయుధంగా చరిత్రలను, సాహిత్యాల్ని, ఉద్యమాలని అధ్యయనం చేస్తుంది. కానీ ఈ నిర్వ చనాలు భారతదేశ కుల సమాజానికి సరిపోని పరికరాలు. ఇక్కడ ఏ కులపురుషులు ఏ కులస్త్రీలను వ్యవస్థీకృతంగా లోబర్చుకున్నారనే చర్చ ఉండది.


కుల సమాజంలో పితృస్వామ్యమంటే- ఆర్థిక, రాజ కీయ, సామాజిక వ్యవస్థల్ని నియంత్రించే అతికొద్ది జనాభాగా ఉన్న ఆధిపత్య హిందూ కుల మగ సమాజం మనువాద సూత్రాలతో, పురుష సూక్తాలతో తమ కులాల్లోని ఆడవాళ్లనేగాక, మొత్తం బహుజన కులాల ఆడ మగ సమాజాన్ని వ్యవస్థీకృతంగా బానిసలు చేసుకుని లోబర్చుకోవడం. ఈ పితృస్వామ్యం కేవలం ఆడవాళ్లమీద మగవాళ్లు చేసే పెత్తనం కాదు.


తమ ఆడవారిని ‘న స్త్రీ స్వాతంత్రమర్హతి’ అని వంటిళ్లకు పరిమితం చేసి, అసూర్యంపశ్యలను చేసిన మగస్వామ్యం పితృస్వామ్యం. భర్తవుంటేనే బతుకు, లేకుంటే భర్తతో చావాలని ‘సతి’, భర్త చనిపో యినా, వేరుబడినా పునర్వివాహాలు నిషిద్ధం చేసిన క్రూరత్వాలు పితృ స్వామ్యం. ఈ క్రూరత్వాలు బహుజన కులాల్లో ఆడవాళ్ల మీద కనబడవు. ఊరూవాడా మహిళల కాళ్లకు చెప్పులు తొడిగే మగవాళ్లని, ఊరి మహిళల ముట్టుబట్టలు ఉతికే మగవాళ్లని, మహిళల కాలిగోళ్లు తీసి కాలిమైల కడిగే మగవాళ్లని... బహుజన కులాల్లోనే చూస్తాం గానీ ఆధిపత్య హిందూ కులాల మగవాళ్లల్లో చూడం.


బహుజన మగసమాజం ఇంటి ఆడవాళ్లమీద అజమాయిషీ, జులుం చేస్తుంది, బైటికిబోతే దానిది బానిస బతుకు. ఈ అజమాయిషీలను, హింసలను కూడా బహుజన కులాల మహిళ నిరసించా ల్సిందే, రూపుమాపాల్సిందే. ఐతే- ఇంటి ఆడవాళ్లని, బైట వ్యవస్థల్నీ కూడా శాసించే, అణచివేసే మగస్వామ్యాలనూ ఇంట్ల పెత్తనం, బయట బాంచరికం చేసే మగ స్వామ్యాలనూ ఒకటే గాట కట్టి అధ్యయనం చేయడం వల్ల బహుజన కుల సమా జాలు నష్టపోతున్నాయి.


దళిత మహిళలకు సంబం ధించి ఆధిపత్య వ్యవస్థలన్నీ ప్రతికూలంగా చుట్టుముట్టి ఉంటయి. ఇంత ప్రతికూల పరిస్థితుల్లో దళిత మహిళలు చదువుకోవడమే ఒక యుద్ధం. చదువుకొని రచయిత్రులుగా సాహిత్యాల్లోకి రావడం పెద్ద యుద్ధమే. వీరి రచనలు వెలుగు చూడడం చిన్న విషయం కాదు. వీరి రచనలు బూతుగా ఉన్నాయనీ, అర్థం కావడం లేదని, వీరి సాహిత్యాల్ని సాహిత్య చరిత్రలు పక్కనబెట్టి అవాచ్యమ్‌ చేసినయి.


డీ క్లాస్‌, డీ కాస్ట్‌, డీ జెండర్‌ కావడం సమ సమాజ నిర్మాణం కోసమే కాదు సాహిత్య విమర్శను ప్రజాస్వామ్యీకరించడం కోసం కూడా అవ సరమని చెప్పిన చేరా డీ సవర్ణ జెండర్‌ సాహిత్య విమర్శకాన్నే ఆగి పోయిండు. నాలుగు దశాబ్దాల కిందనే (1980) సవర్ణ రచయిత్రులు సాహిత్యాల మీద వివరణాత్మక విశ్లేషణలు చేసి తెలుగు సాహిత్య విమర్శలోకి జెండర్‌ రాజకీయ అవగాహనకు దోహదం చేశాడు. కానీ తన విమర్శను దళిత జెండర్‌ సాహిత్యాలకు దూరంబెట్టి అప్రజా స్వామికాల్నే కనబరిచిండు. బహుజన విమర్శకులు కూడా చేరా దారులనే అనుసరిస్తున్నారు గానీ దళిత మహిళా సాహిత్యాల పట్ల మౌనమే కనబరుస్తున్నారు. సమాజంలోని ఆఖరి అంచుల జెండర్‌ అస్తిత్వ సమూహాల సాహిత్యాల అధ్యయన పరికరాలను, పద్ధతులను, సిద్ధాంతాలను నిర్మించే, నిర్ధారించే కృషి ప్రజాస్వామిక సాహిత్య సమాజాల మీద మిగిలే ఉంది.

జూపాక సుభద్ర

94410 91305


Updated Date - 2020-08-24T06:35:00+05:30 IST