అగ్రనాయకుల్లో విద్యార్థి నేత ఏడీ?

ABN , First Publish Date - 2021-12-10T14:04:20+05:30 IST

కొన్ని దశాబ్దాలుగా..

అగ్రనాయకుల్లో విద్యార్థి నేత ఏడీ?

విద్యార్ధులే నాయకులుగా మరాలి

వారు సమాజానికి దూరం కాకుడదు


న్యూఢిల్లీ(ఆంధ్రజ్యోతి): కొన్ని దశాబ్దాలుగా విద్యార్థి లోకం నుంచి ఒక చెప్పుకోదగ్గ పెద్ద నాయకుడెవరూ ఉద్భవించలేదని.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీరమణ ఆవేదన వ్యక్తం చేశారు. సంస్కరణల తర్వాత సామాజిక ప్రయోజనాల కోసం కృషిలో విద్యార్థుల పాత్ర తగ్గిపోతోందని ఆయన పేర్కొన్నారు. ఆధునిక ప్రజాస్వామ్యంలో విద్యార్థుల పాత్ర ఎంతో ఉన్నదని ఆయన గుర్తుచేశారు. ఈ దేశ యువత సామాజికంగా, రాజకీయంగా చైతన్యవంతమైనప్పుడే విద్య, ఆహారం, వస్త్రాలు, ఆరోగ్యసంరక్షణ మొదలైన సమస్యలకు జాతీయ ప్రాధాన్యత లభిస్తుందని, చదువుకున్న యువకులు సామాజిక వాస్తవికతకు దూరంగా ఉండరాదని ఆయన హితవు పలికారు.


గురువారం ఢిల్లీలో జరిగిన జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (ఎన్‌ఎల్‌యు) స్నాతకోత్సవంలో సీజేఐ జస్టిస్‌ రమణ ప్రసంగించారు. ప్రగతిశీలంగా, హేతుబద్ధంగా, నిజాయతీతో ఆలోచించే విద్యార్థులు ప్రజా జీవితంలో ప్రవేశించాలని, నాయకులుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో జరిగిన సామాజిక విప్లవాలు, మార్పులు.. అన్నీ రాజకీయంగా చైతన్యవంతమైన, సామాజిక బాధ్యత గల విద్యార్థుల నుంచే వచ్చాయని, వారు సమాజంలోని అసమానతల పట్ల గొంతెత్తారని జస్టిస్‌ రమణ గుర్తు చేశారు. రాజకీయ చైతన్యంతో చేసే అర్థవంతమైన చర్చలే మన రాజ్యాంగం ఆశించిన సుందర భవిష్యత్‌ దిశగా దేశాన్ని నడిపిస్తాయని, బాధ్యత గల యువత ద్వారా ప్రజాస్వామ్యం పటిష్ఠమవుతుందని అన్నారు. విద్యార్థులు సమాజంలో భాగమని, వారు సమాజానికి దూరంగా ఉండకూడదని ఆయన చెప్పారు.


దేశ జనాభాలో నాలుగో వంతు మందికి ఇంకా మౌలిక విద్య అందుబాటులో లేదని ఆవేదన వెలిబుచ్చారు. విద్యార్థులు మొత్తం సమాజం గురించి యోచించకుండా సంకుచిత, వివక్షతో కూడిన అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తే దేశ ప్రజాస్వామ్యం, ప్రగతి దెబ్బతింటాయని ఆయన హెచ్చరించారు. మన ఆకాంక్షలు ఎంత ముఖ్యమో ఆదర్శం కూడా అంతే ముఖ్యమని, ఆదర్శాలు లేని ఆకాంక్షలు ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ రెండింటినీ సమపాళ్లలో మేళవించి దేశాన్ని శక్తిమంతంగా మార్చేందుకు కృషి చేయాలని చెప్పారు. తమ రోజుల్లో విద్యార్జన వేరుగా ఉండేదని.. పాఠశాల, కాలేజీలే కాక, సమాజంలో ఉన్న క్లిష్టమైన పరిస్థితులు కూడా తమకు విలువైన పాఠాలు నేర్పాయని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. 


జైళ్లలా తరగతి గదులు

ప్రైవేట్‌ రంగంలోనడుస్తున్న రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కోచింగ్‌ సెంటర్లలో చదువుకోవడం వల్ల బాగా డబ్బు లభించే లాభసాటి ఉద్యోగావకాశాలు వస్తాయనుకొని.. తల్లిదండ్రులు తమ పిల్లలను వాటికి పంపుతున్నారని, సామాజిక శాస్త్రాలను పూర్తిగా విస్మరిస్తున్నారని జస్టిస్‌ రమణ వ్యాఖ్యానించారు. విద్యార్థులు జైళ్ల వంటి గదుల్లో ఊపిరి సలపని వాతావరణంలో చదవడం వల్ల సమగ్ర అభివృద్ధి సాధించలేరని ఆయన అన్నారు. దేశంలో నాణ్యమైన న్యాయవిద్యను అందించేందుకు ఏర్పర్చిన జాతీయ న్యాయవిశ్వవిద్యాలయాలలో చదివిన విద్యార్థుల్లో అత్యధికులు కార్పొరేట్‌ లా సంస్థల్లో చేరుతున్నారని, దీని వల్ల అవి సామాజిక వాస్తవికతకు దూరమైన సంపన్నుల కేంద్రాలుగా గుర్తింపు పొందుతున్నాయన్నాయని అన్నారు. న్యాయ విద్యార్థులు వివిధ సామాజిక అంశాలకు సంబంధించి కోర్టుల్లో పోరాటాలు చేయగలిగిన సామర్థ్యం సంపాదించాలన్నారు. న్యాయవాదులు సామాజిక ఆర్థిక, రాజకీయ వాస్తవికతలకు దూరంగా ఉండరాదని.. సామాజిక పరివర్తనకు, దేశంలో మార్పులకు వారు దోహదం చేయాలని, సామాజిక నిర్మాతలుగా మారాలని విజ్ఞప్తి చేశారు.


న్యాయవాద వృత్తి లాభాలు ఆర్జించేందుకు కాదని, అది సేవ లాంటిదని అన్నారు. సమాజంలో పరిస్థితులు మన ఆలోచనల కంటే భిన్నంగా ఉంటాయని కోర్టు గదులు సినిమాల్లో చూపించినట్లు ఉండవని ఆయన చెప్పారు. శిథిలమైన కోర్టు గదులు, విరిగిన కుర్చీల్లో కూర్చునే న్యాయమూర్తులు, సరైన సౌకర్యాలు లేకుండా పనిచేసే సిబ్బంది, శౌచాలయాలు లేని పరిస్థితి సైతం ఉందని ఆయన చెప్పారు. న్యాయవిద్యార్థులు న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఎన్‌ఎల్‌యు వైఎస్‌ చాన్స్‌లర్‌ పెండ్యాల కృష్ణ దేవరావు నిర్వహించగా, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీఎన్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-10T14:04:20+05:30 IST