ఆ రథ గోపురం ఏమయింది?

ABN , First Publish Date - 2021-12-02T06:12:33+05:30 IST

హంపి రాతి రథానికి పరిచయం అక్కరలేదు. అయితే మనం ఇప్పటివరకు ప్రత్యక్షంగానూ, పాఠ్యపుస్తకాల్లోనూ, ఆఖరికి 50 రూపాయల కరెన్సీ నోట్ పైన కూడా ముద్రించి ఉన్న (హంపి విఠలాలయంలోని) సుప్రసిద్ధ రాతి రథం చిత్రంలో ఉన్న విధంగా కాకుండా వేరే విధంగా ఉండడం స్పష్టంగా గమనించవచ్చు...

ఆ రథ గోపురం ఏమయింది?

హంపి రాతి రథానికి పరిచయం అక్కరలేదు. అయితే మనం ఇప్పటివరకు ప్రత్యక్షంగానూ, పాఠ్యపుస్తకాల్లోనూ, ఆఖరికి 50 రూపాయల కరెన్సీ నోట్ పైన కూడా ముద్రించి ఉన్న (హంపి విఠలాలయంలోని) సుప్రసిద్ధ రాతి రథం చిత్రంలో ఉన్న విధంగా కాకుండా వేరే విధంగా ఉండడం స్పష్టంగా గమనించవచ్చు. ఈ చిత్రాన్ని స్పష్టంగా చూడండి. విఠలాలయంలోని రాతి రథంపైభాగంలో ఇటుకలతో నిర్మించిన అందమైన గోపురం ఉంది. హంపిలోని ప్రసిద్ధ విఠల ఆలయ ప్రాంగణంలో ఉన్న రాతి రథంపై గోపురాన్ని ఎవరు తొలగించారు లేదా కూల్చివేశారు? సరే, ఎవరో కూల్చి వేశారనే అనుకున్నా ఈ నిర్మాణాలను పరిరక్షించే భారతీయ పురాతత్వ శాఖ దానిని ఎందుకు పునరుద్ధరించలేదు? లేదా కనీసం ఇప్పుడు ఉపయోగిస్తున్న ఫోటోలలోనైనా గోపురంతో కూడిన రాతి రథాన్ని ఎందుకు చూపడం లేదు? ఈ ప్రశ్న ఇప్పటికీ చరిత్రకారులను, చరిత్ర పరిశోధకులను వేధిస్తోంది.


కర్ణాటకలోని అద్భుత దేవాలయాలు, శిల్ప సంపద, నిర్మాణాలు, శిల్పాలు మధ్యయుగంలో ఖిల్జీలు, తుగ్లక్‌లు, బహమనీలు మొదలైన వారిచే దాడులకు గురై ధ్వంసం చేయబడ్డాయి. అయితే హంపిలోని రాతి రథంపై ఉన్న అందమైన, విశిష్టమైన గోపురాన్ని ఎవరు ధ్వంసం చేశారు? అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఎవరూ చెప్పడం లేదు. బహమనీ సుల్తాన్ సైనికుల చేతిలో హంపి రాతి రథం పైనున్న గోపురం ధ్వంసం అయి ఉండవచ్చని ఒక దుర్మార్గపు అజ్ఞానంలో అందరం ఉన్నాం.


ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలో, హంపిని సందర్శించిన కొంతమంది విదేశీ ఫొటోగ్రాఫర్ల కెమెరాల్లో ఈ రాతి రథం గోపురం స్పష్టంగా బంధించబడింది. అంటే, ఈ గోపురం మాత్రం ధ్వంసానికి గురికాలేదని చెప్పవచ్చు. ఆ ఛాయాచిత్రాలను బ్రిటీష్ ప్రభుత్వ విభాగాలు తమ ఆర్కైవ్‌లలో భద్రపరిచాయి, అయితే, ఇవి ఇంగ్లాండ్‌లో సురక్షితంగా, చరిత్రకారులు, పరిశోధకుల అధ్యయనాలకు మాత్రమే పరిమితమై ఉన్నాయి. ఎడ్మండ్ డేవిడ్ లోయిన్ అనే బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ హంపిలోని విఠల దేవాలయ సముదాయంలోని అన్ని ఆలయాలు, శిల్పసంపదలను తన ఫొటోలలో బంధించాడు. ఈ ఫొటోలలో రాతి రథంపై ఇటుకలతో నిర్మించిన అందమైన గోపురం ఉంది. దశాబ్దాల నిర్లక్ష్యానికి సమాధానంగా విఠల ఆలయం సముదాయంలోనూ, రాతి రథంపై పెరిగిన మొక్కలు కూడా ఆ చిత్రాలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆలయ ప్రాంగణమంతా గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగినట్లు కూడా చిత్రాలలో గోచరమవుతుంది. 


ఇక్కడ మరో విషయాన్ని ప్రస్తావించుకోవాలి. తాడిపత్రిలోని చింతల వెంకటరమణ దేవాలయంలోనూ హంపి మాదిరి రాతి రథం ఉంది. ఈ వెంకటరమణ ఆలయాన్ని కృష్ణ దేవరాయల సామంతులైన పెమ్మసాని తిమ్మ నాయుడు, రామలింగ నాయుడులు నిర్మించారు. అదే కాలంలో నిర్మించిన తాడిపత్రి ఆలయంలోని రథం, దానిపై గోపురం ఇప్పటికీ అలాగే ఉన్నాయి. కానీ, హంపి రాతి రథంపై ఉన్న గోపురం, అది నిర్మితమైన ఐదు శతాబ్దాల తర్వాత 20వ శతాబ్దం మధ్యకాలంలో ధ్వంసమైనట్టుగా భావిస్తున్నారు. శత్రు మూకలు దాడి చేసిన తర్వాత కూడా మిగిలి ఉన్న ఈ అద్భుత గోపురం 20వ శతాబ్దపు ‘ఆధునిక’ అధికారుల చేతుల్లో తొలగింపునకు గురైందని, హొయసల నిర్మాణాలపై అధ్యయనం చేస్తున్న ప్రముఖ చరిత్రకారుడు రవి నవలవల్లి ఆరోపిస్తున్నారు. హంపి రాతి రథంపై ఉన్న ఇటుక గోపురం ఎంతో అందంగా, రంగురంగుల్లో ఉండాలి. అనంతర దశాబ్దాలలో ఈ గోపురం ఎందుకు అదృశ్యమైంది? ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? ప్రకృతి విపత్తా? నిర్లక్ష్యమా లేదా దుశ్చర్యా? అనే ప్రశ్నలు ఈ చరిత్రకారుడు సంధిస్తున్నారు. 


ఈ రాతి రథంపై చాలా కాలం క్రితం ఒక ఆంగ్ల దినపత్రికలో ప్రచురించిన ఒక వ్యాసంలో ‘రథంపై ఒక గోపురం ఉంది. ఇది ఒక దేవాలయం. ఈ రాతి రథాన్ని లాగే విధంగా గుర్రాలు ఉండేవని, అయితే ఆ అశ్వాల స్థానంలో రాతి రథానికి రెండు ఏనుగుల విగ్రహాలు తగిలించారని’ ఆరోపించారు.


ఒక్క విషయం మాత్రం స్పష్టం, కృష్ణదేవరాయలు కళింగ యుద్ధంలో గెలిచినప్పుడు, విజయ చిహ్నంగా నిర్మించిన ఈ అందమైనరాతి రథంపై ఉన్న గోపురం తరువాతి సంవత్సరాలలో సురక్షితంగా ఉంది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా బ్రిటిష్ వారిచే శుభ్రం చేయబడి రక్షించబడిన ఈ అందమైన రాతిరథం గోపురం అనంతర కాలంలో అదే బ్రిటిష్ పాలకుల హయాంలో ధ్వంసమైంది.


నేటికీ మన దేశంలో గుప్తనిధులకై చారిత్రక నిర్మాణాలను ధ్వంసం చేసే బాధాకరమైన పరిస్థితి నెలకొంది. గుప్త నిధుల అన్వేషణ కోసం చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, స్థావరాలు, శాసనాలు, గోడలను ధ్వంసం చేసే ముఠాలు ఇప్పటికీ సంచరిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే హంపి శిలా రథ గోపురంలో గుప్త బంగారం నిధులు ఉండవచ్చనే అనుమానంతో కొంతమంది దుండగులు ఆ గోపురాన్ని ధ్వంసం చేసి ఉండవచ్చనే వాదన కూడా ఉంది. అయితే, బ్రిటిష్ పాలకుల హయాంలో బోధ్ గయలోని బుద్ధ దేవాలయం స్తూపాన్ని అందంగా పునర్నిర్మించారు. ఇదే సమయంలో శిలా రథంపై గోపురాన్ని ఎందుకు నిర్మించలేదనే సంశయం కూడా ఉన్నది. హంపి రాతి రథాన్ని ఎందుకు వదిలివేసారు? రాతి రథం లోపల దిగిన ఫొటోలు చూస్తుంటే ఈ ప్రశ్నలన్నీ తలెత్తుతున్నాయి.


హంపి రథానికి గోపురం ఉందనే విషయానికి మరింత ప్రాచుర్యం కల్పించాలి. మన పాఠ్యపుస్తకాల కమిటీ దీనిపై శ్రద్ధ చూపాలని, టూరిస్ట్ గైడ్‌లకు విపులంగా తెలియజేయాలని చరిత్రకారులు డిమాండ్ చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం ఉన్న ఆ గోపురాన్ని ఎందుకు పునర్నిర్మించలేకపోతున్నారు? బ్రిటిష్ ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటోల ఆధారంగా భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ స్మారక చిహ్నమైన హంపి శిలారథంపై నిన్నటి వరకు ఉన్న ఇటుక బురుజును పునర్నిర్మించాలి. మన వారసత్వాన్ని మనం గౌరవించుకోవాలని కర్ణాటక రాష్ట్రంలోని చరిత్రకారులు ఉద్యమిస్తున్నారు. ఇది మంచి పరిణామమే. అయితే, కేంద్ర పురావస్తు శాఖ నిబంధనలు, ప్రపంచ వారసత్వ సంపద నియమ నిబంధనలను అనుసరించి ప్రస్తుతం ఉన్న చారిత్రక కట్టడాలను ఏమాత్రం పునర్నిర్మాణం చేయవద్దని నిబంధనలున్నాయి. కాగా, వాటిని సంప్రదాయ పద్ధతిలో మాత్రమే మరమ్మతులు, పునర్నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందనే అంశాల ప్రాతిపదికగా ఈ గోపురాన్ని పునర్నిర్మాణం చేయాలని కేంద్ర పురావస్తు శాఖను అభ్యర్ధించవచ్చు.

కన్నెకంటి వెంకట రమణ

జాయింట్ డైరెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్

Updated Date - 2021-12-02T06:12:33+05:30 IST