ఆమె ఎక్కడ?

ABN , First Publish Date - 2022-06-26T09:18:07+05:30 IST

ప్రేమించి పెళ్లాడిన భర్తతో చిన్న గొడవపడిన ఆ ఇల్లాలు.. ఆయన్ను, కడుపున పుట్టిన ఇద్దరు అమ్మాయులను వదిలేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.

ఆమె ఎక్కడ?

  •  సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వివాహిత
  • ఇది జరిగి 3 నెలలు.. భర్త, ఇద్దరు పిల్లల కన్నీరుమున్నీరు
  • పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన
  • సెల్ఫీ వీడియో విడుదల చేసి అజ్ఞాతంలోకి 


తాండూరు, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ప్రేమించి పెళ్లాడిన భర్తతో చిన్న గొడవపడిన ఆ ఇల్లాలు.. ఆయన్ను, కడుపున పుట్టిన ఇద్దరు అమ్మాయులను వదిలేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తన చావుకు ఎవరూ కారణం కాదని, గర్భసంబంధ సమస్యల కారణంగా కడుపునొప్పితో బాధపడుతున్నానని.. తన మృతదేహం దొరికితే ఇంటికి తేవొద్దంటూ ఆమె రాసినట్టుగా భావిస్తున్న ఓ లేఖ ఇంట్లో దొరికింది. ఆందోళనకు గురైన భర్త, పిల్లలు.. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది జరిగి మూడు నెలలు దాటిపోయింది! ఆమె ఆచూకీ దొరకలేదు. మృతదేహమైనా లభించలేదు. ఆమె కోసం భర్త.. తల్లి కోసం ఆ ఇద్దరు పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎప్పుడేం వార్త వినాల్సి వస్తుందోనని నరకం అనుభవిస్తున్నారు. చివరికి.. ఆమె లేని జీవితం తమకొద్దంటూ పోలీసులకు గట్టి హెచ్చరిక పంపారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ 48 గంటల్లో ఆమె ఆచూకీ తెలపాలని, లేదంటే తాను, తన ఇద్దరు పిల్లల మృతదేహాలున్న లొకేషన్‌ను షేర్‌చేస్తానని చెబుతూ ఆ భర్త ఆడియో, వీడియో విడుదల చేసి పిల్లలతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లాడు!! బీఎస్పీ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు దొరిశెట్టి సత్యమూర్తి, ఆయన ఇద్దరు పిల్లల కన్నీటి గాథ ఇది. తాండూరుకు చెందిన సత్యమూర్తి 19 ఏళ్ల క్రితం అన్నపూర్ణ (36)ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇంటర్‌, తొమ్మిదో క్లాసు చదువుతున్న ఇద్దరు కూతుళ్లున్నారు.


 భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరగడంతో మార్చి 6న మధ్యాహ్నం అన్నపూర్ణ తన సెల్‌ఫోన్‌, ఒంటి మీద ఉన్న ఆభరణాలు వదిలేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ‘నా ప్లిలలు జాగ్రత్త. నా భర్త దేవుడు. ఆయన్ను అనుమానించకండి. ఎన్నో ఆశలతో ఇల్లు కట్టుకున్నాము. ఈ ఇంట్లో నా పిల్లల పెళ్లిళ్లు చెయ్యాలి. వారు ఈ ఇంట్లో సంతోషంగా ఉండాలి. అందుకే నేను ఇంట్లో చనిపోవాలనుకోవడం లేదు. నా చావు వల్ల నా ఇల్లు అపవిత్రం కావొద్దు. అందుకే ఇంటికి దూరంగా వెళ్లి చనిపోతున్నాను’ అని రాసిపెట్టి ఉన్న ఓ లేఖ లభ్యమైంది. తాను ఇంట్లోంచి వెళ్లిపోయిన మార్చి 6నే తాను చనిపోయిన రోజుగా లేఖలో ఆమె  పేర్కొన్నారు. మార్చి 8న ఘటనపై పోలీసులకు సత్యమూర్తి ఫిర్యాదు చేశారు. తల్లి కోసం కూతుళ్లు కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ సోషల్‌ మీడియాలో కూడా ‘అమ్మా.. ఇంటికి రా.. ’ అంటూ వీడియో పోస్ట్‌లు పెట్టారు.


 అనేక దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. భర్త సత్యమూర్తి, వారి బంధువులు కూడా తెలంగాణతోపాటు దేశంలో ఉన్న పలు రాష్ట్రాల్లో పలు పోలీసుస్టేషన్లలో ఆచూకీ  కోసం ప్రయత్నాలు చేశారు. అయినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. శనివారం సత్యమూర్తి ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. తన భార్య ఆచూకీ తెలుసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని, ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని అందులో ఆరోపించారు.  48 గంటల్లో తన భార్య అన్నపూర్ణ ఆచూకీ తెలపాలని, లేకపోతే తమ శవాలు ఉన్న లొకేషన్‌ షేర్‌ చేస్తామంటూ హెచ్చరించారు. పిల్లలేమో అమ్మ లేకుండా తాము బతకలేమని.. వీడియోలో పేర్కొన్నారు. అనంతరం పిల్లలతో సహా సత్యమూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో తాండూరులో సత్యమూర్తి కుటుంబీకులు, బంధువులు, తెలిసిన వారు ఆందోళన చెందుతున్నారు.  కాగా అన్నపూర్ణ ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని తాండూరు పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-06-26T09:18:07+05:30 IST