HYD : Metro Stationsలో వరుస ఘటనల కలకలం.. ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో కీలక అంశాలు వెలుగులోకి..!

ABN , First Publish Date - 2022-02-14T16:39:28+05:30 IST

Metro Stationsలో వరుస ఘటనల కలకలం.. ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో కీలక అంశాలు వెలుగులోకి..!

HYD : Metro Stationsలో వరుస ఘటనల కలకలం.. ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో కీలక అంశాలు వెలుగులోకి..!

హైదరాబాద్‌ సిటీ : మెట్రో స్టేషన్లను కొందరు సూసైడ్‌ స్పాట్లుగా ఎంచుకుంటున్నారు. ప్లాట్‌ఫాంపై నుంచి దూకుతూ బలవన్మరణాలకు యత్నిస్తున్నారు. మరికొందరు ఆకతాయిలు పట్టాలపైకి పరుగులు తీస్తూ సెల్ఫీలతో వింత చేష్టలు చేస్తున్నారు. మెట్రో ప్లాట్‌ఫాంలపై భద్రతను పర్యవేక్షించేందుకు తగిన సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో నగరంలోని పలు స్టేషన్లలో ఊహించని ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శనివారం ప్రకా‌ష్‌నగర్‌ స్టేషన్‌పై నుంచి ఓ ప్రయాణికుడు దూకి ఆత్మహత్యకు యత్నించడం, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి ఘటనలకు కారణాలేంటో తెలుసుకునేందుకు ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’ పలు స్టేషన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. కారిడార్‌-3 నాగోలు-రాయదుర్గంలోని పెద్దమ్మగుడి నుంచి అమీర్‌పేట వరకు, కారిడార్‌-2 జేబీఎస్-ఎంజీబీస్‌ రూట్‌లోని 11 స్టేషన్లను ఆంధ్రజ్యోతి బృందం సందర్శించింది. ఇందులో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.


- ప్రధానంగా పూర్తిస్థాయి సెక్యూరిటీ సిబ్బందితో తొలి రోజుల్లో పకడ్బందీగా ఉన్న భద్రతా వ్యవస్థ కొవిడ్‌ కష్టాలతో కొన్నిచోట్ల సెక్యూరిటీ సిబ్బందిని తొలగించడంతో బలహీనపడినట్లు కనిపించింది. 

- పెద్దమ్మగుడి, జూబ్లీహిల్స్‌ రోడ్‌-5, యూసఫ్‌గూడ, మధురానగర్‌, సికింద్రాబాద్‌ వెస్ట్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, గాంధీ హాస్పిటల్‌, ముషీరాబాద్‌ స్టేషన్లలో సెక్యూరిటీ సిబ్బంది కనిపించలేదు.

- జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, అమీర్‌పేట్‌, ఎంజీబీఎస్‌లో ప్రతీ ప్లాట్‌ఫాంపై ఒక సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. 

- ప్రవేశద్వారం వద్ద మాత్రమే తనిఖీలు చేస్తుండడంతో కొంతమంది యువతీ, యువకులు, ఆకతాయిలు ప్లాట్‌ఫాంలపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

- చిన్న స్టేషన్లలోని ప్లాట్‌ఫాంలపై చాలామంది సెల్ఫీలు తీసుకుంటూ, పరుగులు తీస్తూ కనిపించారు. 


గతంలో కొన్ని ఘటనలు..

భద్రతా వైఫల్యంతో కొందరు ఆకతాయిలు ప్లాట్‌ఫాంలపై ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. మరికొందరు వ్యక్తిగత కారణాలు, కుటుంబ సమస్యలతో స్టేషన్‌పై నుంచి కిందకు దూకి ఆత్మహత్యయత్నానికి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 

- 2018 నవంబర్‌ 8న అమీర్‌పేట్‌ మెట్రోస్టేషన్‌ మొదటి అంతస్తు నుంచి దూకి ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. 

- 2019 సెప్టెంబర్‌ 30న చైతన్యపురి మెట్రోస్టేషన్‌పై నుంచి దూకి మరొకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

- 2021 అక్టోబర్‌ 1న దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ మొదటి అంతస్తుపై నుంచి దూకిన 45 ఏళ్ల వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

- 2021 నవంబర్‌ 12న అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ రెండో అంతస్తు పై నుంచి రాత్రి వేళ ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా మెట్రో సిబ్బంది ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 

- 2022 జనవరి 2న సికింద్రాబాద్‌ ఈస్ట్‌ స్టేషన్‌లో ఎదురుగా రైలు వస్తున్నా ఓ వ్యక్తి మెట్రో పట్టాలపై పరుగెత్తడం కలకలం రేపింది. 

- 2022 ఫిబ్రవరి 12న రాత్రి నిజామాబాద్‌కు చెందిన రాజు ప్రకా్‌షనగర్‌ మెట్రో పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

- మెట్రో ప్రారంభమైన 2017 నవంబర్‌ 29 నుంచి ఇప్పటి వరకు ఎనిమిది ఘటనలు చోటుచేసుకున్నాయి. 


భద్రతా లోపానికి కారణాలివేనా..

కొవిడ్‌తో ఎల్‌అండ్‌టీకి భారీ నష్టం వస్తుండడంతో కాస్ట్‌ కటింగ్‌ కింద ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, చిక్కడపల్లి, మలక్‌పేట్‌, ఉస్మానియా ఆస్పత్రి, ఎస్‌ఆర్‌నగర్‌ లాంటి చిన్నస్టేషన్లలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందిని తొలగించారు. కేవలం రద్దీ ఎక్కువగా ఉండే స్టేషన్లలో మాత్రమే సిబ్బందిని అందుబాటులో ఉంచారు.


మెట్రో స్టేషన్‌ నుంచి దూకి ఆత్మహత్య..

మెట్రోస్టేషన్‌ పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బేగంపేట ఎస్‌ఐ సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా, నిజామ్‌సాగర్‌ మండలం, సోమలంక గ్రామానికి చెందిన పోచయ్య కుమారుడు రాజు (38) ఉద్యోగ నిమిత్తం నిజామాబాద్‌ టౌన్‌లోని నాగారంలో నివాసం ఉంటున్నాడు. నాలుగేళ్లుగా సరైన ఉద్యోగం దొరక్క ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. స్నేహితుల వద్దకు వెళ్లి ఉద్యోగం చూసుకుంటానని ఈ నెల 10న నగరానికి వచ్చాడు. ఏమైందో గానీ శనివారం రాత్రి 11 గంటల తర్వాత బేగంపేటలోని ప్రకా‌ష్‌నగర్‌ మెట్రో రైల్వేస్టేషన్‌కు వచ్చి పై నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడ్డ  రాజును సిబ్బంది గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. రాజుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.



Updated Date - 2022-02-14T16:39:28+05:30 IST