ప్రైవేటు వైద్య విద్య దారెటు?

ABN , First Publish Date - 2022-08-17T20:52:29+05:30 IST

రాష్ట్రంలో ప్రైవేటు కాలేజీ(Private college)ల నిర్వహణ యాజమాన్యాలకు భారంగా మారుతోందా? వైద్య విద్య(Medical education) కోసం విద్యార్థులు మునుపటిలా ఆ కాలేజీలవైపు చూడటం లేదా? ఏటా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు

ప్రైవేటు వైద్య విద్య దారెటు?

పెరుగుతున్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు.. 

నిరుడు 8, ఈ ఏడాది 9 కాలేజీలకు సర్కారు అర్జీ

రెండేళ్లలో 2100 ఎంబీబీస్‌ సీట్లు అందుబాటులోకి

మొత్తంగా ప్రభుత్వ కాలేజీల్లోనే దాదాపు 4వేల సీట్లు

ప్రైవేటు కాలేజీల యాజమాన్యంపై నిర్వహణ భారం

తగ్గనున్న సీ-కేటగిరీ ఫీజులు.. 

3-4 కాలేజీలు అమ్మకానికి! 


హైదరాబాద్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రైవేటు కాలేజీ(Private college)ల నిర్వహణ యాజమాన్యాలకు భారంగా మారుతోందా?  వైద్య విద్య(Medical education) కోసం విద్యార్థులు మునుపటిలా ఆ కాలేజీలవైపు చూడటం లేదా? ఏటా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు వస్తుండటం.. పెద్ద సంఖ్యలో ఎంబీబీఎస్‌ సీట్లు(MBBS seats) అందుబాటులోకి రావడంతో ఇవే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 11 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలున్నాయి. నిరుడు ఎనిమిది మెడికల్‌ కాలేజీల కోసం ప్రభుత్వం దరఖాస్తు చేసింది. ఈ ఏడాది మరో తొమ్మిది మెడికల్‌ కాలేజీలు కావాలని ఆగస్టు 9, 10 తేదీల్లో దరఖాస్తు చేసింది. ఇప్పటికే జగిత్యాల, నాగర్‌కర్నూల్‌ కాలేజీలకు అనుమతులొచ్చాయి. మిగిలినవాటికి కూడా ఈనెలాఖరుకు అనుమతులొస్తాయని అధికారులు చెబుతున్నారు.


ఈ కాలేజీలు అందుబాటులోకొస్తే రాష్ట్రంలో సర్కారీలోనే 28 మెడికల్‌ కాలేజీలు అవుతాయి. ప్రస్తుతం ప్రైవేటులో 23 మెడికల్‌ కాలేజీలున్నాయి. ఈ ఏడాది మరో మూడు, నాలుగు కాలేజీల కోసం యజమాన్యాలు దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఫలితంగా వచ్చే విద్యాసంవత్సరం నాటికి ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 50కిపైగానే వైద్య కళాశాలలుంటాయి. దరఖాస్తులకు అనుమతులొస్తే గనక రెండేళ్లలోనే ప్రభుత్వ కాలేజీల్లో 2100 సీట్లు, మొత్తంగా 3,915 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకొస్తాయి. ప్రైవేటులోనూ కలిపితే మొత్తం 7వేలకుపైగా ఎంబీబీఎస్‌ సీట్లు అవుతాయి. ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు పెరగనుండటంతో పేరున్న ప్రైవేటు కాలేజీలను పక్కనబెడితే కొత్త కాలేజీలపై నిర్వహణ భారం పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్కారీ కాలేజీలు భారీగా పెరుగుతుండటంతో ప్రైవేటు కాలేజీలకు కొత్త సమస్యలొచ్చాయి. కాలేజీలు పెరగడంతో ఒక్కసారి అధ్యాపకులకు డిమాండ్‌ పెరిగింది. ప్రైవేటులో ఉన్న అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు ప్రభుత్వ కళాశాలలకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ప్రైవేటు కాలేజీల్లో ప్రొఫెసర్లు తగ్గిపోతున్నారు. ఇది అక్కడ వైద్యవిద్యా బోధనపై ప్రభావం చూపుతోంది. అధ్యాపకులు దొరక్కపోవడంతో పొరుగు రాష్ట్రాల నుంచి ప్రొఫెసర్లను తీసుకొని రావాల్సివస్తోందని ఓ ప్రైవేటు కాలేజీ యాజమాన్యం తెలిపింది. అలాగే సర్కారీలో పెద్దసంఖ్యలో మెడికల్‌  కాలేజీలు రావడం వల్ల ప్రైవేటులోని సీ-కేటగిరి సీట్లకు డిమాండ్‌ భారీగా తగ్గుతుందని వైద్యవిద్య నిపుణులు చెబుతున్నారు. ప్రైవేటులో సీ-కేటగిరి సీటుకు సర్కారీ జీవో మేరకు ఏడాదికి రూ.23 లక్షలు చెల్లించాలి. ఐదేళ్లకు రూ.కోటికిపైనే అవుతోంది.


ప్రస్తుతం ప్రైవేటు కళాశాలల్లో 1000 వరకు సీ-కేటగిరి సీట్లున్నాయి. వాటిలో ఇప్పుడు 200 వరకు భర్తీకావడం లేదని హెల్త్‌ యూనివర్సిటీ(Health University) వర్గాలు తెలిపాయి. ఆ సీట్లు ఖాళీగా ఉంటే యాజమాన్యాలకు భారీగా నష్టం వాటిల్లుతుంది. అందుకే కొన్ని కాలేజీలు  బీ-కేటగిరి ఫీజు( రూ.11.25 లక్షలు) చెల్లిస్తే చాలు సీ-కేటగిరి సీట్లను ఇచ్చేస్తున్నాయి. మున్ముందు ఆ డిమాండ్‌ ఇంకా తగ్గుతుందని వైద్య విద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు బ్రేక్‌ ఈవెన్‌(ఆర్థికంగా నిలదొక్కుకొనే స్థితి)కు రావడం కూడా కష్టమని అంటున్నారు.. ఒక కాలేజీకి బ్రేక్‌ ఈవెన్‌ రావాలంటే కనీసం పదేళ్ల సమయం పడుతుందని అంటున్నారు. చాలా కాలేజీలకు అటువంటి పరిస్థితి లేదంటున్నారు. హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల పేరొందిన కాలేజీలకు మాత్రం ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. ఇప్పటికే పీజీ సీట్లు వచ్చిన ప్రైవేటు కాలేజీలకు కూడా ఆర్థిక సమస్యలుండవు అని,  పీజీ సీట్లు రాని వాటికి పరిస్థితి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉండదని అంటున్నారు.  మరోవైపు మన రాష్ట్రం నుంచి ఏటా 400 మంది విద్యార్ధులు విదేశాలకు వైద్యవిద్య కోసం వెళ్తున్నారు. ఆ సంఖ్య కూడా తగ్గుతుందని, ఉక్రెయిన్‌, రష్యాతో పాటు ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని వైద్యవిద్యకు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.


ఆ కోర్సులకు యమ డిమాండ్‌ 

ప్రస్తుతం నాన్‌ క్లినికల్‌ విభాగంలో ప్రొఫెసర్స్‌కు భారీ డిమాండ్‌ ఉంది. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అధ్యాపకులు  చాలా తక్కువగా ఉన్నారు. వైద్యవిద్య కళాశాలలకు వీరు తప్పనిసరి అవసరం. ప్రస్తుతం ఎంబీబీఎస్‌ తర్వాత అంతా కిన్లికల్‌ పీజీల వైపే మొగ్గుచూపుతున్నారు. నాన్‌ క్లినికల్‌ సబ్జెక్టు( రోగులతో సంబంధం లేనివి)లు చేసే వారే లేకుండా పోయారు. దాంతో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అధ్యాపకులకు తీవ్ర కొరత ఏర్పడింది. సర్కారీ కాలేజీల్లో ఈ అధ్యాపకులకు రెగ్యులర్‌ వేతనానికి అదనంగా ప్రతీ నెల మరో రూ.50 వేలను చెల్లిస్తున్నారు. అంటే వీటికి ఎంత డిమాండ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ కోర్సులకు భారీగా డిమాండ్‌ ఉంటుందని వైద్యవిద్యకు చెందిన మరో ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. 


ఐదేళ్ల తర్వాత ఏటా 7 వేల మంది వైద్యులు 

తెలంగాణలో ఐదేళ్ల తర్వాత ఏటా 7 వేలకు పైగా ఎంబీబీఎస్‌ డాకర్లు బయటకు వస్తారు. మరో ఐదేళ్లలో 35 వేల మంది ఎంబీబీఎస్‌ డాక్టర్లు(MBBS doctors) ఉంటారు. ఇక ఎంబీబీఎస్‌ చేసిన ప్రతి ఒక్కరూ పీజీ చేయడం అసాధ్యం. ఎందుకంటే యూజీతో పొల్చితే పీజీ సీట్లు సంఖ్య తక్కువ. ఉన్న సీట్లలో కూడా కిన్లికల్‌కే అంతా మొగ్గు చూపుతున్నారు. నాన్‌ క్లినికల్‌కు ప్రాధాన్యం నివ్వడం లేదు. దీంతో ఏటా ఎంబీబీఎస్‌ డాక్టర్ల సంఖ్య పెరిగిపోతుంటుంది. ఇప్పటికే భారత్‌లో ప్రతి 840 మందికి ఒక ఎంబీబీఎస్‌ వైద్యుడు ఉన్నారు. మన రాష్ట్రంలో ఐదేళ్ల తర్వాత ప్రతి 500 మందికి ఒక ఎంబీబీఎస్‌ డాక్టర్‌ ఉంటారని నిపుణులు చెబుతున్నారు. దాంతో ఎంబీబీఎస్‌ విద్య కూడా ఇంజనీరింగ్‌ తరహాలో మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్క తెలంగాణలోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా భారీగా మెడికల్‌ కాలేజీలు వస్తున్నాయి. కేంద్రం కూడా  ఇప్పటికే 175 మెడికల్‌ కాలేజీలకు అనుమతులిచ్చింది. ప్రైవేటులో కూడా పెరుగుతున్నాయి. వెరిసి దేశవ్యాప్తంగా యూజీ సీట్లు భారీగా పెరుగుతాయి. దాంతో వైద్యవిద్యపై ఉన్న మోజు తగ్గిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు. 


క్లినికల్‌ సీట్లు రాలేదన్న నిరాశ వద్దు

మెడికల్‌ కాలేజీల సంఖ్య పెరుగుతుండటంతో టీచింగ్‌ సైడ్‌ ప్రాధాన్యం పెరుగుతుంది. ముఖ్యంగా నాన్‌ క్లినికల్‌ సబ్జెక్టులకు భారీగా డిమాండ్‌ ఏర్పడే అవకాశాలున్నాయి. విద్యార్ధులు(Students) కూడా క్లినికల్‌ సీట్లు రాలేదని నిరాశ చెందవద్దు. నాన్‌ క్లినికల్‌లో చేరితే  కోర్సు పూర్తి అయ్యాక ఉద్యోగ భద్రత ఉంటుంది. నాన్‌ క్లినికల్‌ వారికి ఇప్పుడు బయట పెద్దమొత్తంలో వేతనాలిస్తున్నారు. మున్ముందు వారికే ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది.

-డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, వైస్‌ఛాన్స్‌లర్‌, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ 

Updated Date - 2022-08-17T20:52:29+05:30 IST