ప్రజావాణి.. వినేవారేరీ.. ఇలా మూగబోయిందేం..!?

ABN , First Publish Date - 2022-05-03T18:16:05+05:30 IST

ప్రజావాణి.. వినేవారేరీ.. ఇలా మూగబోయిందేం..!?

ప్రజావాణి.. వినేవారేరీ.. ఇలా మూగబోయిందేం..!?

  • మూగబోయిన ‘గ్రీవెన్స్‌ సెల్‌’
  • కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్న బాధితులు


ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు అఫ్జల్‌బేగం. ఈమెది యాకుత్‌పురా. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఇప్పించాలని రెండేళ్లుగా హైదరాబాద్‌ కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతోంది. నిరుపేద కుటుంబానికి చెందిన తనకు ఇల్లు ఇప్పించి ఆదుకోవాలని కోరుతున్నా పట్టించుకునేనాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రజావాణి లేకపోవడంతో నిరుపేదల సమస్యలు అపరిష్కృతంగా మిగులుతున్నాయని చెప్పేందుకు అఫ్జల్‌బేగం ఓ ఉదాహరణగా నిలుస్తోంది.


హైదరాబాద్‌ సిటీ : ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహించే ప్రజావాణి (గ్రీవెన్స్‌ సెల్‌) మూగబోయింది. కరోనా కారణంగా హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో మార్చి 17,  2020 నుంచి ప్రజావాణి కార్యక్రమం నిలిచిపోయింది. కొన్ని మండలాల్లో కొవిడ్‌కు ముందు అందజేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ దరఖాస్తులను అధికారులు ఇప్పటికీ పరిశీలించలేదని తెలిసింది. రెండేళ్లుగా ఆసరా పింఛన్ల మంజూరు కోసం వృద్ధులు పడిగాపులు కాస్తున్నారు. వీటితోపాటు వికలాంగుల ట్రై సైకిళ్లు, డబుల్‌ బెడ్‌రూమ్‌ దరఖాస్తులు వందల సంఖ్యలో పేరుకుపోయినట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.


మొక్కుబడిగా ఈ-ఆఫీస్‌..

గ్రీవెన్స్‌సెల్‌ను నిలిపివేసిన తరుణంలో 2020 ఆగస్టు 15 నుంచి ఈ-ఆఫీస్‌ ద్వారా కాగిత రహిత పాలనను చేపట్టారు. ఈ మేరకు వివిధ సమస్యలపై వస్తున్న ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించకుండా ఆన్‌లైన్‌ ద్వారానే వినతులు అందజేయాలని ఉన్నతాధికారులు సూచించారు. అయితే, ఈ-ఆఫీ్‌సపై అవగాహన లేని నిరుపేదలు కలెక్టరేట్‌కు తరచూ వచ్చి వెళ్తున్నారు. ఇదిలా ఉండగా, కలెక్టరేట్‌లోని ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేక బాక్స్‌ ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. బాక్స్‌ల్లో వేసిన దరఖాస్తుల్లో కనీసం 10 శాతం కూడా పరిష్కారానికి నోచుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి సోమవారం గ్రీవెన్స్‌సెల్‌ నిర్వహించాలని కోరుతున్నారు.

Read more