ఎక్కడ మన ప్రత్యామ్నాయ రంగస్థలం?

ABN , First Publish Date - 2021-03-26T06:26:00+05:30 IST

రంగస్థలం మరణించిందా? 1960వ దశకంలో పాశ్చాత్య ప్రపంచంలో తలెత్తిన ఈ ప్రశ్నను ఇవాళ తెలుగు సాంస్కృతిక రంగం ఎదుర్కొంటోందా?...

ఎక్కడ మన ప్రత్యామ్నాయ రంగస్థలం?

రంగస్థలం మరణించిందా? 1960వ దశకంలో పాశ్చాత్య ప్రపంచంలో తలెత్తిన ఈ ప్రశ్నను ఇవాళ తెలుగు సాంస్కృతిక రంగం ఎదుర్కొంటోందా? నిదానంగా మొదలైన తెలుగు సారస్వత వికాసం ఒక దశలో ఉవ్వెత్తున ఎగిసిపడి లక్షలాది మంది ప్రజల్ని చైతన్యపర్చడం ఒక గత చరిత్ర గానే మిగలనుందా? ఒకవేళ అదే నిజమైతే అందుకు కారణాలేమిటి? సుమారు 2500 సంవత్సరాల చరిత్ర కల ఒక కళా ప్రక్రియ అంత సులువుగా అంతమయ్యే అవకాశాలు లేవు. ఐతే, ప్రస్తుతం ఉన్న సాంస్కృతిక స్తబ్దతకి కారణాల్ని అన్వేషించడం ఒక తప్పనిసరి బాధ్యతాయుత కర్తవ్యం కావాలని మాత్రం సాంస్కృతిక శక్తులు గుర్తించాలి.


ప్రజా రంగస్థలం విభిన్నమైన ప్రజాతంత్ర ప్రయోగాల వేదిక. విస్తారమైన వ్యక్తీకరణలకి ఒక విశాలమైన మాధ్యమం. అనేక ప్రగతిశీల దృక్పథాల ప్రదర్శన నిలయం. నూతన భావాల్ని భావోద్వేగాలతో మిళితం చేసే ఆలవాలం. ఐతే, ఇదంతా చరిత్ర. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ ప్రత్యామ్నాయ రంగస్థలం ఒక దగ్గరకొచ్చి ఆగిందనచ్చు. సగటు మనిషి జీవితంతో అవిభాజ్యంగా భాగం కావలసిన సాంస్కృతిక రంగం ‘పరాయీకరణ’కి గురయ్యి ఎటూ తేలని ఒక ‘గందరగోళం’ గా మిగలడం బాధాకరం. మార్పుకు మాధ్యమం కావాల్సిన రంగస్థలం, అన్నీ మూసుక్కూర్చోవడం దేనికి సంకేతం?


‘మౌలిక సాహిత్యానికి ఉండవలసిన ప్రధాన గుణం సమకాలీనత. సమకాలీనత లేని రచన ఎంత గొప్పదైనా అది సాహిత్యం అనిపించుకోదని బోయి భీమన్న అన్నారు. ‘సంగీత, సాహిత్య, నృత్య, చిత్ర, శిల్పకళల సమగ్ర రూపమే నాటకం’ అంటూ, ‘సత్య హరిశ్చంద్ర నాటకం చూసి ఎందరు సత్య వ్రతులయ్యారో తెలియదు కానీ, పాలేరు నాటకం చూచి వేల మంది పాలేళ్ళు, పాలేరు తనాలు వదిలేసి పాఠశాలల్లో చేరడం మాత్రం వాస్తవంగా జరిగిందని భీమన్న అన్నారు. వాసిరెడ్డి, సుంకరల ‘ముందడుగు’, ‘మా భూమి‍’ వంటి నాటకాలు ఒక తరం ప్రజా ఉద్యమ వాతావరణాన్ని నిర్దేశించడంలో గొప్పపాత్ర పోషించాయి. ముఖ్యంగా, నాటి యువతకి దిశానిర్దేశం కావించి రాజకీయ, సామాజిక అవగాహనను పెంపొందించడంలో అవిస్మరణీయమైన అనుసంధాన మార్గంగా ఉన్నాయి.


అటువంటి మహోన్నత మాధ్యమం ఈ రోజు మార్పనే మాటకి భయపడుతూ కేవలం ‘ప్రైజ్ మనీ ప్రదర్శనల’కే పరిమితం అయ్యే కాలక్షేప కార్యకలాపంగా మారడ మంత సాంస్కృతిక విషాదం మరోటి లేదు. ఏం ప్రదర్శిస్తున్నామనేది కాదు; ఎవరి కోసం, ఎవరు ప్రదర్శిస్తున్నారనేది ప్రధానం అంటాడు మావో. అణగారిన ప్రజల కోసం, సామాజిక కార్యకర్తల కోసం అనేక నాటకాలు రాసిన జర్మన్ మేధావి, నాటకకర్త, బెట్రోల్ట్ బ్రెహ్ట్ కూడా ఇదే మాటంటాడు. 


ప్రసిద్ధి చెందిన ప్రజా విద్యావేత్త, ప్రత్యామ్నాయ విద్యా తాత్వికుడు పాలో ఫెర్రీ ‘పీడితుల విద్యాశాస్త్రం’ అభివృద్ధి చేసిన బ్రెజిల్ లోనే, ‘పీడితుల కోసం రంగస్థలం’ (Theatre of the Oppressed) అనే భావనను విస్తృతం చేసిన ఆలోచనాశీలి ఆగస్తో బోల్, ఆ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రవేశపెట్టి వృద్ది చేసాడు. బోల్ ప్రభావంతో అనేకచోట్ల ఈ ప్రయోగాత్మక నాటక ప్రక్రియ పాదుకొంది. మైఖెల్ రోడ్ వంటి రంగస్థల కార్యకర్తలు బోల్ విధానాన్ని మరింత ముందుకు తీసుకుపోతూ, ‘Theatre for Community, Conflict & Dialogue’ వంటి రచనలు కూడా చేసారు.


ఆధునిక నాటకానికి ఆయువుపట్టు ‘అభివ్యక్తి’. స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలతో కూడిన ఒక సమాలోచనను సహేతుకంగా నిర్మించడం ఈ ప్రయోగాత్మక రంగస్థల లక్ష్యం. నటనకి సంబంధించినంత వరకు ప్రత్యేక నైపుణ్యాలేవీ దీనికి అవసరం లేదు. జరుగుతున్న నాటకంలో ప్రేక్షకులు ప్రవేశించి అర్థవంతమైన మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఈ ‘పీడితుల రంగస్థల’ ప్రత్యేకత. ప్రజా ఉద్యమాలతో పోలిస్తే ప్రజా నాటకం వెనకబడిన నేపథ్యంలో, ప్రత్యామ్నాయం అభివ్యక్తి ప్రధాన సాధనమైన ‘సంభాషణ’ (Dialogue)ని ఒక ప్రజాతంత్ర ప్రచార పనిముట్టుగా మల్చుకోవడం ఈరోజు అన్ని ప్రగతిశీల శక్తుల బాధ్యత.


ఈ క్రమంలో దేశవ్యాప్తంగా గతించిపోతున్న వివిధ నాటక కళా ప్రక్రియల అస్తిత్వానికి సంబంధించి, ఆయా కళారూపాలకి మద్దతుగా వాటిని బహుళ ప్రచారంలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు కూడా ఇతర రాష్ట్రాలలో ఆశాజనకంగా జరుగుతున్నాయి. ప్రత్యామ్నాయ సినిమా లాగానే ప్రత్యామ్నాయ నాటక కళా రంగాల్లో జరిగిన కృషిని నమోదు చేయాలనే ఒక స్పృహ ఈరోజు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ దిశగా డాక్యుమెంటరీలు తీయడం, సాహిత్యం ప్రచురించడం మొదలైనవి ఆ మేరకు సాంస్కృతిక ఆరోగ్యానికి చిహ్నాలే.


దేశంలో సఫ్దార్ హష్మి మొదలుకొని గోరఖ్ పాండే దాకా, తెలుగులో గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం దగ్గర నుండి షేక్ నాజర్, గరికపాటి రాజారావుల వరకూ ఎంతోమంది అభ్యుదయ రంగస్థల కార్యకర్తలను పేర్కొనవచ్చు కానీ వర్తమానంలో ఆ చింతనాత్మక వారసత్వాన్ని కొనసాగించడంలో మనమెక్కడున్నామనేదే అసలు ప్రశ్న. దేశంలోని కొన్ని రాష్ట్రాలలో కనీసం ప్రయోగాత్మక ప్రయత్నాలైనా జరుగుతుండగా, తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. గడిచిన దశాబ్దాలలో సొంతంగా ప్రజాదరణ పొందిన ఒక్క ప్రత్యామ్నాయ నాటకం కూడా రాలేదంటే రంగస్థల రచయితల్లో పేరుకుపోయిన మూస ధోరణులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ‘నేర్చుకోవడం మానేసినవాళ్ళు బోధించడం ప్రారంభించడం ఈ శతాబ్దపు దౌర్భాగ్యం ‘అని ప్రఖ్యాత నాటకవేత్త బెర్నార్డ్ షా అన్నాడు. 


ఉన్న కొద్దిమంది కళాకారులు, రచయితలు కూడా అవార్డుల కోసమే రాసే మూసకూ, వేరే భాషల్లో జరుగుతున్న ప్రయత్నాల్ని పనిగట్టుకుని ప్రచారం చేస్తూ సుఖాలకి అలవాటు పడిన భాషకూ మాత్రమే పరిమితం అయ్యారు.కులతత్వం, మతోన్మాదం, పురుషాధిక్యత తాండవిస్తోన్న యాంత్రిక సమాజంలో మానవీయ తాత్విక స్పృహను ప్రవేశపెట్టగల సత్తా సాంస్కృతిక రంగానికే ఉంది. అందుకోసం, అణగారిన వర్గాల నుండి దళిత బహుజన ఆదివాసీ మైనారిటీ, స్త్రీల నుండి ఈ ‘సారస్వత స్పృహ’ అభివృద్ధి కావలసిన అవసరం ఎంతైనా ఉంది. వామపక్ష, ప్రగతిశీల, ప్రజాతంత్ర శక్తులు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నూతన కళా తాత్విక ధోరణులను పనికట్టుకుని ప్రత్యేకంగా అధ్యయనం చేయడం తక్షణావసరం. అనేక అవాంఛనీయ సంక్షోభాల నడుమ కొట్టుమిట్టాడుతున్న సగటు మనిషికి సాంస్కృతిక రంగం అండగా నిలవాలి. రైతులు, విద్యార్థులు, దళిత బహుజనులు, మహిళలు, ఇతర పీడిత సమూహాలంతా కార్పొరేట్ సినిమాల ప్రచారం, అమానవీయ ద్వేషపూరిత, కుతంత్ర టీవీ సీరియళ్ళ మాయలోంచి బయటపడి ఐక్యంగా ప్రత్యామ్నాయ కళా ప్రక్రియలని అభివృద్ధి చేసుకోవాలి. స్పష్టమైన నిర్మాణాత్మకత కలిగిన ప్రత్యామ్నాయ రంగస్థల వేదికల దిశగా అది జరిగినపుడే ఒక విశాలమైన ప్రత్యామ్నాయ కళా రూపకంగా నాటకరంగం బలోపేతం అయ్యే అవకాశం ఉంది.

గౌరవ్

సాంస్కృతిక కార్యకర్త

(మార్చి 27: ప్రపంచ రంగస్థల దినోత్సవం)

Updated Date - 2021-03-26T06:26:00+05:30 IST