అవన్నీ ఏమాయే..?

ABN , First Publish Date - 2020-07-10T17:30:29+05:30 IST

వారంతా కరోనాతో యుద్ధం చేస్తున్నారు.. వైరస్ నియంత్రణకు కొందరు.. వైరస్ సోకిన బాధితులకు వైద్య సేవలందిస్తూ ఇంకొందరు.. మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తూ మరికొందరు.. ప్రజోపయోగ కార్యక్రమాల్లో కొందరు.. అందరూ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులే..

అవన్నీ ఏమాయే..?

రక్షణ పరికరాలకు నోచుకోని కొవిడ్‌ సిబ్బంది

దాతలిచ్చిన రక్షణ కిట్లు ఎక్కడ..?

మాస్కులను సొంతంగా తయారుచేసుకోవాల్సిందేనా..?

జిల్లా యంత్రాంగంపై తీవ్ర ఆరోపణలు.. దాతల్లోనూ సందేహాలు

దాతల నుంచి పెద్ద ఎత్తున మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు

కుప్పలు తెప్పలుగా నిత్యావసర కిట్లు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): వారంతా కరోనాతో యుద్ధం చేస్తున్నారు.. వైరస్ నియంత్రణకు కొందరు.. వైరస్ సోకిన బాధితులకు వైద్య సేవలందిస్తూ ఇంకొందరు.. మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తూ మరికొందరు.. ప్రజోపయోగ కార్యక్రమాల్లో కొందరు.. అందరూ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులే.. పనిచేసే ప్రాంతాలు వేరు కావచ్చు కానీ.. చేసే పని మాత్రం ప్రాణాంతక పరిస్థితుల్లోనే చేస్తున్నారు. ఇలాంటి వారిలో కూడా అత్యధికులు తమకు కనీస రక్షణ ఉండటం లేదని మాస్కులు, శానిటైజర్లు కూడా అందడం లేదని వాపోతున్నారు. మరో పక్క క్షేత్ర స్థాయిలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న సిబ్బంది కోసం తాము అందిస్తున్న రక్షణ కిట్లు ఎటుపోతున్నాయనే సందేహం దాతలను వెంటాడుతోంది.. 


విజయవాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఒక్క రోజే 11 కరోనా కేసులు వెలుగు చూశాయి. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో పనిచేస్తున్న పలు శాఖల ఉద్యోగులకు, ఇతర సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు కూడా యంత్రాంగం అందించలేదు. తాము పనిచేస్తున్న ప్రాంతాల్లో రెగ్యులర్‌గా శానిటైజ్‌ చేయించడం లేదని, తమకు మాస్క్‌లు కూడా ఇవ్వటం లేదని ఉద్యోగులు వాపోతున్నారు.


కంటైన్‌మెంట్‌ సెక్టార్లలో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు లేవు. కేసులు నమోదైన ప్రాంతాల నుంచి బాధితులను ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించే బాధ్యతలు వీరి మీద ఉన్నాయి. ప్రాణాంతక పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న తమకు మాస్కులు, పీపీఈ కిట్లు ఇవ్వటం లేదని రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 


క్వారంటైన్‌ కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న సచివాలయ ఏఎన్‌ఎంలకు సైతం రెగ్యులర్‌గా మాస్క్‌లు అందించడంలేదు. దీంతో తాము మాస్కులు తయారు చేసుకుని, ఏరోజుకారోజు ఉతుక్కుని ఉపయోగించుకుంటున్నామని వారు వాపోతున్నారు.


ఇంటింటికీ తిరిగి ప్రజారోగ్యాన్ని పర్యవేక్షించే ఏఎన్‌ఎంలు, సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లకు రక్షణ లేదు. మాస్కులు, శానిటైజర్లు ఇవ్వకుండా కేసులున్న ఇళ్లకు వెళ్లలేమని ప్రాధేయపడినా ప్రయోజనం ఉండడం లేదని వీరంతా వాపోతున్నారు.


బస్‌స్టేషన్‌, రైల్వేస్టేషన్‌, విమానాశ్రయాల్లో ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించి, వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించే ఉద్యోగులు సైతం మాస్కులు, శానిటైజర్లకు నోచుకోవటం లేదు.

ఈ ఆవేదనలను వెన్నంటి కొన్ని సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కరోనా కట్టడికి క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది రక్షణ కోసం ఎందరో దాతలు మాస్కులు, పీపీఈ కిట్లు, శానిటైజర్లు, గ్లౌజ్‌లు అందిస్తున్నారు. మరి అవన్నీ ఏమైపోతున్నాయన్న సందేహం సహజంగానే వ్యక్తమవుతోంది. 


దాతల దగ్గర తీసుకుంటున్న రక్షణ పరికరాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్న జిల్లా యంత్రాంగం.. వాటిని ఎవరికి ఇస్తున్నారో వెల్లడించడం లేదు. ఒకవైపు ఉద్యోగుల ఆరోపణలు, మరోవైపు దాతల అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో వీటికి సంబంధించి జిల్లా యంత్రాంగం స్పష్టతనిస్తే సముచితంగా ఉంటుందన్న భావన అందరిలోనూ ఉంది. 


మాస్క్‌లు, శానిటైజర్లు వంటివి లేకపోవడంతో తామే సొంతంగా కొనుగోలు చేసుకుంటున్నామని చెబుతున్న ఉద్యోగులు, దాతలిచ్చినవి ఎవరికి అందుతున్నాయనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. 


కలెక్టర్‌కు దాతలు అందజేసే కిట్‌లను జడ్పీ సీఈవో పర్యవేక్షిస్తారని సమాచారం. వాటిలో కొన్నింటిని కొవిడ్‌ ఆసుపత్రికి పంపుతున్నట్టు సమాచారం ఉంది. కొవిడ్‌ ఆసుపత్రికి ఆర్డినరీ కిట్లు పనికిరావు. పైగా ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ నుంచి వారికి తగిన కిట్లు వస్తున్నాయి. దాతల నుంచి వచ్చినవన్నీ జీజీహెచ్‌లో ఉపయోగం లేకుండా మూలుగుతున్నాయని ఉద్యోగులు కొందరు ఆరోపిస్తున్నారు.  


ఇక ఇవిగాక దాతల నుంచి పెద్ద ఎత్తున నిత్యావసర కిట్‌లు జిల్లా యంత్రాంగానికి అందుతున్నాయి. వీటిలో బియ్యం, ఆయిల్‌, పంచదార, సబ్బులు, పప్పులు ఉన్నాయి. అలాగే స్నాక్స్‌గా పంపిణీ చేయటానికి అనేక కిట్‌లను కూడా పలువురు దాతలు అందించారు. నిత్యావసరాలను పక్కన పెడితే, కొవిడ్‌ విధుల్లో రాత్రింబవళ్లూ పనిచేసే వారికి దాతలు ఇచ్చిన స్నాక్స్‌ కూడా అందడం లేదని ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. మరి వీటిని ఎక్కడ, ఎలా వినియోగిస్తున్నారో స్పష్టం చేయాల్సిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపైనే ఉంది. 

Updated Date - 2020-07-10T17:30:29+05:30 IST