దారుణం.. ఎక్కడ చూసినా.. కల్తీ..కల్తీ..

ABN , First Publish Date - 2020-04-03T15:46:35+05:30 IST

అగ్గిపుల్ల... సబ్బుబిళ్ల... కల్లు చుక్క... నూనె ప్యాకెట్‌... సిగరెట్‌ పెట్టె... ఇలా ఏదిచూసినా..

దారుణం.. ఎక్కడ చూసినా.. కల్తీ..కల్తీ..

నకిలీలొస్తున్నాయ్‌.. జరభద్రం

లాక్‌ డౌన్‌తో జిల్లాలో నకిలీరాయుళ్ల హవా

సిగరెట్‌, నూనెలు, సబ్బులు.. ఇంకా అనేకం

రేట్లూ భారీగా పెరుగుదల


తెనాలి, ఏప్రిల్‌2, (ఆంధ్రజ్యోతి): అగ్గిపుల్ల... సబ్బుబిళ్ల... కల్లు చుక్క... నూనె ప్యాకెట్‌... సిగరెట్‌ పెట్టె... ఇలా ఏదిచూసినా కల్తీ... కల్తీ.. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ప్రకటించిన లాక్‌డౌన్‌ నకిలీ రాయుళ్లకు కలిసొచ్చినట్టుంది. ఇప్పటికే సరకుల రవాణా అంతంతమాత్రంగా ఉండటంతో ఆ వస్తువులకు డిమాండ్‌ పెరిగిపోయింది. దానిని ఆసరాచేసుకుని నకిలీలను గుట్టుచప్పుడు కాకుండా మార్కెట్‌లోకి దింపేస్తున్నారు. దీనికితోడు రేట్లుకూడా ఎమ్మార్పీని మించి వసూలు చేస్తుండటం మరింత దారుణ పరిస్థితి. 


లాక్‌డౌన్‌ నేపథ్యంలో నకిలీ తయారీదారులు రెచ్చిపోతున్నారు. నాలుగు రోజుల క్రితం తెనాలిలో సిగరెట్‌లు అమ్ముతున్న డీలర్‌లపై దాడులు జరిపిన పోలీసులు సుమారు రూ.కోటికిపైగా విలువైన సిగరెట్‌లను సీజ్‌ చేశారు. గుంటూరు, నరసరావుపేట, మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనటంతో సిగరెట్‌లు ఇప్పటివరకు దుకాణాల్లో ఉన్నవి మినహా కొత్తగా వచ్చేవి లేకపోవటం, ధూమపాన ప్రియులు వీటినే అడుగుతుండటంతో వ్యాపారులు కొందరు దొరికిన చోట దొరికినట్టు సిగరెట్లు తెచ్చి అమ్మేస్తున్నారు. అయితే వారికికూడా చాలావరకు అవి నకిలీలని తెలియని పరిస్థితులు కూడా ఉన్నాయి. 


నరసరావుపేట, గుంటూరు ఆటోనగర్‌ ప్రాంతం నుంచి నకిలీ సిగరెట్‌లు వచ్చేస్తున్నాయనేది సమాచారం. దీనికితోడు ప్రముఖ కంపెనీ సిగరెట్‌ ఫిల్టర్‌ రకం రూ.100 ఎమ్మార్పీ ఉంటే, హోల్‌సేల్‌ దుకాణాల్లో రూ.95కు విక్రయించేవారు. ప్రస్తుతం దుకాణదారులే ఒక్కోటి రూ.110 నుంచి రూ.120కి కొనితెచ్చి రూ.130 వరకు అమ్ముతున్నారని కొనుగోలుదారులే చెబుతున్నారు. మందు అమ్మకాలు బంద్‌ కావటంతో కల్లు ప్రత్యామ్నాయం అయింది. గ్రామీణ ప్రాంతాల్లో కల్లుగీత కార్మికులు నాణ్యమైన కల్లునే అందిస్తున్నా, కొందరు దానిని పెద్దమొత్తంలో కొనితెచ్చి కల్తీచేసి పట్టణాల వెలుపల అమ్మకాలు చేస్తున్నారని చెబుతున్నారు. దీనికితోడు రసాయనాలతో కృత్రిమ కల్లును తయారుచేసి అమ్మేస్తున్న పరిస్థితులూ ఉండటం, ఎక్సైజ్‌శాఖ దీనిపై పెద్దగా దృష్టిపెట్టకపోవటంతో వారి ఆగడాలు సాగిపోతున్నాయి. 


ఆయిల్‌... సబ్బులు కూడా

ప్రస్తుతం తెరుస్తున్న దుకాణాల్లో సబ్బులు నిండుకుంటున్నాయి. నూనె ప్యాకెట్‌లు కూడా తగ్గిపోతుండటం, గ్రామీణ ప్రాంతాలకు పెద్దగా రవాణా లేకపోవటంతో ఇవికూడా నాశిరకం వచ్చేస్తున్నాయి. నిత్యంవాడే పెద్ద బ్రాండ్‌ల ఆయిల్‌ ప్యాకెట్‌లకు బదులు కొత్త కంపెనీల పేర్లతో ప్యాకెట్‌లు దర్వనమిస్తున్నాయి. అయితే ఇవికూడా నాణ్యమైన నూనెల ధరలకే అమ్మటం విశేషం. లీటర్‌ ఆయిల్‌ ప్యాకెట్‌ రూ.95 నుంచి రూ.105కు అమ్మితే, ప్రస్తుం రూ.115కి కొంటున్నామని, అందవల్ల రూ.118 నుంచి రూ.120కి అమ్మాల్సి వస్తోందని వ్యాపారులు కొనుగోలుదార్లకు చెబుతుండటం దీనికి నిదర్శనం. సబ్బులయితే స్థానిక బ్రాండ్‌లతో వచ్చేస్తున్నాయి.


సర్ఫ్‌ వంటి ప్యాకెట్‌లు అందుతున్నా, వస్త్రాలు శుభ్రపరిచే సబ్బులకు కొరత ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. వీటి స్థానంలో నాశిరకం సబ్బులు మార్కెట్‌లోకి వచ్చిపడుతున్నాయి.  స్థానికంగా మరాడించిన కల్తీ కలిపిన గోధుమ పిండిని కిలో రూ.50 నుంచి రూ. 65 వరకు అమ్ముతున్న పరిస్థితి ఉంది.  వీటిపై సంబంధిత శాఖల అధికారులు దాడులు జరిపాల్సిన పరిస్థితి ఉంది. లేకుంటే కల్తీలు, నకిలీలతో ప్రజల ఆరోగ్యానికి, కొన్నిదశల్లో ప్రాణాలకే ముప్పు ఏర్పడే పరిస్థితి ఉంది.

Updated Date - 2020-04-03T15:46:35+05:30 IST