కోమటిరెడ్డి బ్రదర్స్‌ దారెటు?

ABN , First Publish Date - 2022-03-17T07:31:50+05:30 IST

సీఎం కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లడం ఖాయమన్న వాదనలు రోజురోజుకూ బలపడుతుండటంతో ఫైర్‌ బ్రాండ్స్‌ కోమటిరెడ్డి బ్రదర్స్‌ తమదైన రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇద్దరు బ్రదర్స్‌ బీజేపీకి అనుకూలంగా వారం రోజులుగా వ్యాఖ్యలు చేస్తుండటం చర్చనీయాంశమైంది.

కోమటిరెడ్డి బ్రదర్స్‌ దారెటు?

బీజేపీకి అనుకూలంగా వారి వ్యాఖ్యలు

పార్టీ మార్పుపై త్వరలో రాజగోపాల్‌ స్పష్టత

సీఎం కేసీఆర్‌ అవినీతిపై పీఎం మోదీకి వెంకట్‌రెడ్డి ఫిర్యాదు


నల్లగొండ: సీఎం కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లడం ఖాయమన్న వాదనలు రోజురోజుకూ బలపడుతుండటంతో ఫైర్‌ బ్రాండ్స్‌ కోమటిరెడ్డి బ్రదర్స్‌ తమదైన రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇద్దరు బ్రదర్స్‌ బీజేపీకి అనుకూలంగా వారం రోజులుగా వ్యాఖ్యలు చేస్తుండటం చర్చనీయాంశమైంది. ఓ వైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని, మరో వైపు సీఎం కేసీఆర్‌ను అడపాదడపా టార్గెట్‌ చేస్తూ వచ్చిన బ్రదర్స్‌ తాజాగా, పార్టీ మారుతున్నాం అంటూ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నేతలే లక్ష్యంగా మాటల తూటాలు పేల్చారు. అయితే ఎటు వెళ్లేది స్పష్టత ఇవ్వకపోవడంతో అనుచరులు గందరగోళంలో పడ్డారు. తాజా వ్యాఖ్యలు ఎప్పటిలానే ఉంటాయా? లేక వాటికి అనుగుణంగా ముందుకు వెళ్తారా? అనే మీమాంసలో అనుచరులు ఉన్నారు.


గౌరవం ఇవ్వని చోట ఉండలేను.. ఎవరి కింద పడితే వారి కింద పనిచేయను.. తగిన వేదిక ద్వారా సీఎం కేసీఆర్‌పై పోరాడుతా.. పార్టీ మార్పు పై త్వరలో స్పష్టత ఇస్తా.. నన్ను నమ్మిన వారు నావెంట రావొచ్చు.. అంటూ బుధవారం జిల్లా పర్యటనలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి బహిరంగ వ్యాఖ్యలు చేశారు. గౌరవం ఇవ్వని చోట అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై ఫైర్‌ అయ్యారు. అసెంబ్లీలో మంత్రి తలసాని, తన మధ్య జరిగిన మాటల యుద్ధంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తనకు మద్దతుగా గట్టిగా నిలబడి ఉండాల్సిందిపోయి ఇద్దరూ మా ట్లాడింది తప్పు అన్నారని, తన మాటలు అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించి, తలసానివి అలాగే ఉంచారన్నారు. తమ సభ్యులు నిలబడి ఉంటే ఎం తో బలం ఉండేదన్నారు. భట్టి విషయంలో ప్రతీ అంశంలో అండగా ఉన్నామని, ఆయన మాత్రం తమను వదిలేశారని హైదరాబాదాలో మీడియా ఎదుట ఆయన అసహనం వ్యక్తం చేయడం పలు ఊహాగానాలకు తెరలేపింది.


వీటికి బలం చేకూరుస్తూనే అవినీతి పాలకుడు, నియంత కేసీఆర్‌ను గద్దెదింపడమే తన లక్ష్యమని ప్రకటించారు. అంతేగాక మునుగోడు నుంచి పోటీ చేస్తానని మంత్రి జగదీ్‌షరెడ్డి కామెంట్‌ చేస్తున్నార ని, తాను మునుగోడు నుంచైనా పోటీకి సిద్ధమని, అవసరమైతే సూర్యాపేట నుంచైనా పోటీచేస్తానని టీఆర్‌ఎ్‌సను టార్గెట్‌ చేశారు. పార్టీ మా ర్పుపై త్వరలో స్పష్టత ఇస్తానని ప్రకటించడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. నల్లగొండ జిల్లా మర్రిగూడ, మునుగోడు, యాదాద్రి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం, చౌటుప్పల్‌లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.


అదేవిధంగా గత ఏడాది జనవరి 1న తిరుమలలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీ ఎదుగుతోందని, రానున్న రోజుల్లో తాను చేరే అవకాశం కూడా ఉందని వ్యాఖ్యానించారు. దీంతో రాజగోపాల్‌కు తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అంచనాలకు మించి విజయాలు సాధించడంతో రాష్ట్రంలోని కీలక కాంగ్రెస్‌ నేతలు, టీఆర్‌ఎ్‌సలో అసంతృప్త నేతలు కమలం నాయకులతో టచ్‌లోకి వెళ్లారు. ఈ నెల చివర జనగామ జిల్లా కేంద్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అతిథిగా భారీ సభ నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ సభలో పాలు పార్టీల్లోని కీలక నేతలు బీజేపీలో చేరతారన్న ప్రచారం ఉంది. ఈనెల 18న వరంగల్‌లో జోనల్‌ సమావేశం ఉండగా, నడ్డా పర్యటన వివరాలు అఽధికారికంగా వెలువడే అవకాశం ఉంది. తనతో అమిత్‌షా టచ్‌లో ఉన్నారంటూ రాజగోపాల్‌రెడ్డి అనుచరుల వద్ద పలుమార్లు వ్యాఖ్యానించారు.


కేసీఆర్‌పై ప్రధానికి ఎంపీ వెంకట్‌రెడ్డి ఫిర్యాదు

సింగరేణి బొగ్గు గనుల కేటాయింపులో సీఎం కేసీఆర్‌ వేల కోట్ల  రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రధాని మోదీకి రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. విచారణ సంస్థలతో సీఎం అవినీతిని వెలికితీయాలని కోరారు. దీనికి 24గంటల వ్యవధిలోనే రాజగోపాల్‌రెడ్డి బహిరంగ వ్యాఖ్యలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయనే చర్చ కొనసాగుతోంది.


కలిసే సాగాలని నిర్ణయం?

ఏ నిర్ణయం తీసుకున్నా ఉమ్మడిగా ఉండాలని, ఉంటేనే తమకు విలువ అనే నిర్ణయానికి కోమటిరెడ్డి బ్రదర్స్‌ వచ్చినట్టు సమాచారం. ఏడాదికిపైగా రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి అనుకూలంగా కామెంట్స్‌ చేస్తుండగా, ఎంపీ వెంకట్‌రెడ్డి అడపాదడపా సీఎం కేసీఆర్‌కు అనుకూలంగా, రేవంత్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తూ మాట్లాడేవారు. యాదాద్రి, జనగామ జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల ప్రారంభ సమయంలో సీఎంతో సన్నిహితంగా మెలిగారు. ఆ నిర్మాణాలకు కితాబు ఇస్తూ ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌, ఎంపీ వెంకట్‌రెడ్డి నాడు ఆలింగనం చేసుకోవడం కూడా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌ బలహీన పడుతున్న నేపథ్యంలో వెంకట్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ వైపు వెళతారా? రాజగోపాల్‌ బీజేపీ వైపు ఉంటారా? బ్రదర్స్‌ మధ్య సఖ్యత లేదా? అనే ప్రచారం చాలా కాలంగా సాగింది. తన కుమారుడి వివాహం తదుపరి రాజకీయాల్లో వేగంపెంచుతానని రాజగోపాల్‌రెడ్డి చెప్పిన విధంగానే తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. ఇక వెంకట్‌రెడ్డి సైతం సీఎం అక్రమాలపై విచారించాలని ప్రధానికి ఫిర్యాదు చేశారు. ఇద్దరూ బీజేపీతో సఖ్యతగా ఉండటంతో, చివరకు కలిసే సాగుతారన్న తాజా సంకేతాలను బలపరుస్తున్నాయి.


స్వార్థ ప్రయోజనాలకోసం పార్టీ మారను : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

చౌటుప్పల్‌: సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం తప్ప స్వార్థ ప్రయోజనాలకోసం పార్టీ మారే ప్రసక్తిలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టంచేశారు. సంస్థాన్‌నారాయణపురంలో ఆయుర్వేద ఆస్పత్రిని బుధవారం తనిఖీచేశారు. అనంతరం ఆయన్ను ఫీల్డ్‌ అసిస్టెంట్లు సన్మానించారు. చౌటుప్పల్‌లో రాజగోపాల్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, రెండేళ్లుగా తాను పార్టీ మారే విషయమై ఎన్నో కథనాలు వస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం తప్పుడు నిర్ణయాలతో పార్టీకి నష్టం వాటిల్లుతోందని గతం నుంచి తాను చెబుతున్నానన్నారు. పార్టీ మార్పుపై త్వరలో స్పష్టత ఇస్తానని వెల్లడించారు.


కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని చూస్తుంటే, పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో ఒకరినొకరు కిందకు లాక్కునే ప్ర యత్నం చేస్తున్నారన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ను కాంగ్రెస్‌ నుంచి దూరం చేసేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడినందుకు ప్రభుత్వం గొంతు నొక్కేందుకు ప్రయత్నించిందని, అయినా దీటుగా సమాధానం ఇచ్చానన్నారు. ఆయన వెంట నాయకులు కరంటోత్‌ శ్రీనునాయక్‌, భిక్షపతినాయక్‌, బాలకృష్ణ, లింగస్వామి ఉన్నారు.

Updated Date - 2022-03-17T07:31:50+05:30 IST