మహిళా పోలీసులు ఎక్కడ..?

ABN , First Publish Date - 2022-08-20T06:14:43+05:30 IST

నేరాల తీరునుబట్టి పోలీసు చర్యలు ఉండాలి. అప్పుడే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయి.

మహిళా పోలీసులు ఎక్కడ..?

ఏడాదిగా ఎస్‌ఐ పోస్టు ఖాళీ

అరకొరగా కానిస్టేబుళ్లు..

వారూ సెలవులో.. పెరుగుతున్న 

మహిళా సంబంధ  నేరాలు


 నేరాల తీరునుబట్టి పోలీసు చర్యలు ఉండాలి. అప్పుడే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయి. కానీ తాడిపత్రి పట్టణ, రూరల్‌ సర్కిల్‌ పరిధిలో కొన్ని రకాల నేరాల కట్టడికి తగిన సిబ్బంది, అధికారులు లేరన్న విమర్శలు వస్తున్నాయి. ప్రత్యేకించి మహిళా పోలీసు అధికారుల, సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. దీంతో మహిళలకు సంబంధించిన నేరాల పరిశోధన, కౌన్సెలింగ్‌ తదితరాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటీవల పలు రకాల విద్యాసంస్థల సంఖ్య పెరగడంతో ఆ మేరకు ప్రేమ, ఈవ్‌ టీజింగ్‌ సమస్యలూ తలెత్తుతున్నాయి. ఇలాంటి నేరాల నియంత్రణకు మహిళా ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుళ్లు అవసరమని స్థానికులు అంటున్నారు. కానీ అధికారులు అవసరం మేరకు సిబ్బందిని కేటాయించడం లేదు.

- తాడిపత్రి


మహిళా పోలీసుల కొరత

తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషనలో మహిళా ఎస్‌ఐ నియామకంపై పోలీసు శాఖ ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్‌ఐ లక్ష్మిని వివిధ కారణాలతో ఏడాది క్రితం బదిలీ చేశారు. ఆ తరువాత ఎవరినీ నియమించలేదు. తాడిపత్రి సర్కిల్‌ పరిధిలో మహిళలకు సంబంధించిన నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎస్‌ఐ స్థాయి అధికారి లేకపోవడంతో దర్యాప్తులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. మహిళా కానిస్టేబుళ్లు మహిళా నిందితులను అంటిపెట్టుకొని ఉండడానికే పరిమితమవుతున్నారు. జనాభాకు అనుగుణంగా ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుళ్ల సంఖ్యను పెంచాల్సి ఉంది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయాల్సి ఉంది. అయినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. మహిళలకు సంబంధించి నేరాలు జరిగినప్పుడు, మహిళా సిబ్బంది కొరత కారణంగా పురుషులే వెళ్లాల్సి వస్తోంది. మహిళా కానిస్టేబుళ్లకు బదులు పురుషులే విచారిస్తున్నారు. పట్టణంలో లక్షకుపైగా జనాభా ఉంది. కడప, కర్నూలు జిల్లాల సరిహద్దులో తాడిపత్రి ఉంటోంది. వ్యాపార, పారిశ్రామిక కేంద్రం కావడంతో రోజూ వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతటి కీలకమైన పట్టణంలో ఒక మహిళా కానిస్టేబుల్‌, ఒక మహిళా హోంగార్డు మాత్రమే ఉన్నారు. రూరల్‌లో ఉన్న ఒకే ఒక్క మహిళా కానిస్టేబుల్‌ మెటర్నటీ సెలవులో ఉన్నారు. యల్లనూరు హెడ్‌కానిస్టేబుల్‌ డెప్యుటేషనపై మరో స్టేషనకు వెళ్లారు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు లాంగ్‌లీవ్‌లో ఉన్నారు. దీంతో ఆ స్టేషనలో మహిళా కానిస్టేబుళ్లు ఖాళీ అయ్యారు. పుట్లూరు పోలీస్‌స్టేషనలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉండగా, ఒకరు లీవ్‌లో ఉన్నారు. పెద్దవడుగూరుస్టేషనలో ఒక మహిళా కానిస్టేబుల్‌ ఉన్నారు. యాడికి స్టేషనలో మహిళా హోంగార్డు మాత్రమే ఉన్నారు.


ప్రేమ.. ఈవ్‌ టీజింగ్‌

తాడిపత్రి పట్టణంతో పాటు రూరల్‌ ప్రాంతా ల్లో ప్రేమ కేసులు పెరుగుతున్నాయి. ఎక్కువశాతం మైనర్ల ప్రేమ గొడవలు స్టేషనకు వస్తున్నాయి. పట్టణ పోలీ్‌సస్టేషనకి తరచూ పోలీసుల రక్షణకోసం ప్రేమజంటలు వస్తున్నాయి. వీరికి కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు మహిళా ఎస్‌ఐ లేరు. కానిస్టేబుళ్లు ఉన్నా, కౌన్సెలింగ్‌ ఇచ్చేంత అనుభవం ఉండదు. ఈ కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాడిపత్రి పట్టణంతోపాటు సర్కిల్‌ పరిధిలోని మండలకేంద్రాల్లో ఈవ్‌ టీజింగ్‌ పెరుగుతోంది. పట్టణంలో వివిధ కోర్సులకు సంబంధించి కళాశాలలు అధికమయ్యాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది. పట్టణంలోని పుట్లూరు రోడ్డు, క్రిష్ణాపురం జీరో రోడ్డు, యల్లనూరు రోడ్డులో కాజేజీలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాలకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రోమియోల తాకిడి అధికంగా ఉంటోంది. ఇటీవల కొందరు రోడ్‌సైడ్‌ రోమియోలను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా ఫలితం లేదు. కాలేజీల వద్ద మోటార్‌సైకిళ్లతో విన్యాసాలు చేస్తూ, పాదచారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కాలేజీలు వదిలే సమయంలో వీరి ప్రవర్తన మరీ ఘోరంగా ఉంటోంది. చుట్టుపక్కల టీ బంకులు, దుకాణాలను అడ్డాగా మార్చుకొని రోమియోలు రెచ్చిపోతున్నారు. గతంలో కాలేజీల వద్ద పోలీసు నిఘా పెడతామని ఆ శాఖ అధికారులు ప్రకటించారు. కొన్నాళ్లపాటు నిఘా పెట్టడంతో ఈవ్‌ టీజింగ్‌ తగ్గింది. కానీ ఇటీవల పోలీసు నిఘా లేకపోవడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. మండల కేంద్రాల్లో కూడా ఈవ్‌ టీజింగ్‌ పెరుగుతోంది. 


మహిళా ఎస్‌ఐని నియమించాలి..

పోలీస్‌ స్టేషనకు వివిధ సమస్యలతో మహిళలు వస్తుంటారు. పురుష అధికారులు, సిబ్బందితో తమ సమస్యలను కొన్నిసార్లు చెప్పుకోలేరు. అందుకే మహిళా కానిస్టేబుళ్లు, మహిళా ఎస్‌ఐ తప్పనిసరిగా ఉండాలి. గృహ హింస, కుటుంబ సమస్యలు, ఈవ్‌ టీజింగ్‌ ఎదుర్కొంటున్న మహిళలు, విద్యార్థినులు నిర్భయంగా స్టేషనకు రావాలంటే మహిళా పోలీసులు తప్పనిసరిగా ఉండాలి. మహిళలు, విద్యార్థినులకు వివిధ అంశాలపై కౌన్సెలింగ్‌ ఇచ్చి పరివర్తన తెచ్చేందుకు మహిళా పోలీసులు అవసరం. పోలీసు శాఖ అధికారులు స్పందించి, మహిళా ఎస్‌ఐని, అవసరానికి సరపడా కానిస్టేబుళ్లను నియమించాలి.

- ఆర్‌సీ రజనీకాంత రెడ్డి, సీనియర్‌ న్యాయవాది 


భర్తీ చేయాలి..

తాడిపత్రి సబ్‌ డివిజన పరిధిలో ఖాళీగా ఉన్న మహిళా ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీచేయాలి. తెలిసీ తెలియని వయస్సులో మైనర్లు ప్రేమ పేరుతో ఇల్లు విడిచి వెళ్లిపోతున్నారు. వివాహాలు చేసుకుని భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు. ఈ కారణంగా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. యుక్తవయసు రాకనే పెళ్లి చేసుకుంటే తలెత్తే ఆరోగ్యపరమైన, చట్టపరమైన సమస్యలను తెలియజేసేందుకు మహిళా పోలీసులు అవసరం. తాడిపత్రి ప్రాంతంలో ఇటీవల ఈవ్‌టీజింగ్‌ పెరిగింది. దీంతో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. వారికి రక్షణ కల్పించేందుకు మహిళా పోలీసులు అవసరం.

- చిరంజీవి, సీపీఐ పట్టణ కార్యదర్శి 


Updated Date - 2022-08-20T06:14:43+05:30 IST