లెక్కలున్నాయి మొక్కలెక్కడ...?

ABN , First Publish Date - 2022-04-28T04:56:00+05:30 IST

ఉపాధి హామీ పథకం కింద దాదాపు 8 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను ఆర్‌అండ్‌బీ వారు తొలగించడంతో దాదాపు 8 లక్షల రూపాయల మేరకు ప్రజాధనం వృథా అయింది.

లెక్కలున్నాయి మొక్కలెక్కడ...?
జాతీయ రహదారిలో కనిపించని మొక్కలు

8 కిలోమీటర్ల మేర 2400 మొక్కలు

‘ఉపాధి’ ప్రాణం పోస్తే.. ఆర్‌అండ్‌బీ ప్రాణం తీసింది...

ఆర్‌అండ్‌బీ, ఉపాధి శాఖల సమన్వయ లోపంతో ప్రజాధనం వృథా


చిన్నమండెం, ఏప్రిల్‌ 27: ఉపాధి హామీ పథకం కింద దాదాపు 8 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను ఆర్‌అండ్‌బీ వారు తొలగించడంతో దాదాపు 8 లక్షల రూపాయల మేరకు ప్రజాధనం వృథా అయింది. పచ్చదనం పెంపొందించడానికి జగనన్న పచ్చతోరణం కింద ఉపాధి హామీ పథకంలోని అవెన్యూ ప్లాంటేషన్‌ పేరుతో రోడ్లకు ఇరువైపులా చెట్లను పెంచే కార్యక్రమాన్ని చేపట్టారు. మండలంలోని కడప, బెంగుళూరు జాతీయ రహదారి 5 గ్రామ పంచాయతీల గుండా వెళుతుంది. అయితే అవెన్యూ ప్లాంటేషన్‌ కింద ఉపాధి వారు ఈ జాతీయ రహదారిని ఎంచుకుని గత సంవత్సరం ఆగస్టు నెలలో మొక్కలు నాటారు. జాతీయ రహదారి విస్తరణ పనులు ఇంకా పూర్తికాకముందే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఆ మొక్కలను దాదాపు 90 శాతం తొలగించారు. ఉపాధి, ఆర్‌అండ్‌బీ అధికారుల సమన్వయలోపంతో లక్షల రూపాయల ప్రజాధనం రోడ్డు పాలైంది.


ఆర్‌అండ్‌బీ వారి అనుమతి తీసుకున్నాం

- హరిప్రసాద్‌, ఏపీవో 

జాతీయ రహదారి మండలంలో దాదాపు 8 కిలోమీటర్ల మేర ఉంది. ఒక్కో కిలోమీటర్‌కు 400 మొక్కలు చొప్పున నాటాము. మొక్కలు నాటేదానికి ఒక్కో గుంతకు రూ.49.80 నాటిన కూలి రూ.9, వాటరింగ్‌, కంచె వంటివి కలిపి దేవగుడిపల్లె గ్రామ పంచాయతీ కింద 400 మొక్కలకు గాను రూ.1.25 లక్షలు, కొత్తపల్లెలో 500 మొక్కలకు రూ.1.25 లక్షలు వండాడి 1500 మొక్కలకు రూ.2.8 లక్షలు, చిన్నమండెంలో 400 మొక్కలకు రూ.1,80 లక్షలు కేశాపురంలో 800 మొక్కలకు రూ.1.53 లక్షల చొప్పున బిల్లులు పెట్టాం. అక్కడ నుంచి ఆర్‌అండ్‌బీ వారు చెట్లను కొన్ని కొన్ని చోట్ల తొలగించడంతో బిల్లులను పూర్తి స్థాయిలో నిలబెట్టి వేశాము. 


మా నుంచి అనుమతి తీసుకోలేదు

- గిరీశ్వర్‌రావు, ఏఈఈ, ఆర్‌అండ్‌బీ

ఉపాధి వారు మా నుంచి ఎలాంటి పర్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకోలేదు. కనీసం మాకు మొక్కలు నాటుతున్నట్లు సమాచారం కూడా ఇవ్వలేదు. మాకు సమాచారం అందించినట్లయితే తాము రహదారికి సైడ్‌ కాలువ పక్కన సూచించేవారం. అలాకాకుండా రోడ్డుకు ఒక మీటర్‌ ఆనుకుని మొక్కలు నాటడంతో వాటిని రోడ్డు వెడల్పులో భాగంగా తొలగించాల్సి వచ్చింది.



Updated Date - 2022-04-28T04:56:00+05:30 IST