ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులెక్కడ?

ABN , First Publish Date - 2022-05-21T08:12:08+05:30 IST

క్షేత్రస్థాయిలో అధికారులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా గృహ నిర్మాణానికి లబ్ధిదారులు ముందుకు రావడం లేదు.

ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులెక్కడ?
శ్రీకావేరిరాజపురం లేఅవుట్‌

ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో సతమతం 

కొందరికి జీతాలూ నిలిపేసిన వైనం 

నలిగిపోతున్న హౌసింగ్‌ అధికారులు


తప్పు ఎవరిది? 

ఇళ్ల స్థలాల కోసం కొండలు, గుట్టలు గుర్తించిన ఉన్నతాధికారులదా? అనువుగాని చోట పట్టాలిచ్చిన పాలకులదా? నిర్మాణ సామగ్రి రేట్లు రెట్టింపైనా యూనిట్‌ కాస్ట్‌ పెంచకపోవడం అటుంచి.. గతంకన్నా తగ్గించిన ప్రభుత్వానిదా? అప్పులపాలై పోతామని ఇళ్లు కట్టుకోని లబ్ధిదారులదా? 


శిక్ష ఎవరికి? 

ఇళ్లు కట్టుకోమంటే లబ్ధిదారులు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేని క్షేత్రస్థాయి ఉద్యోగులకు. 


మీరిచ్చిన స్థలమేమోగానీ.. ఇల్లు కడితే మేము అప్పులపాలు కావాల్సి వస్తోంది.  

- జగనన్న లే అవుట్లపై క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ప్రతిస్పందన ఇది. 


మీరేం చేస్తారో తెలియదు. పునాదిరాయి పడని జగనన్న ఇళ్లను  ప్రారంభించేలా చర్యలు చేపట్టాలి. 

- ఇదీ ఉన్నతాధికారుల నిత్య ఆదేశాలు. 


చిత్తూరు, ఆంధ్రజ్యోతి: ఊరికి దూరంగా, కొండల్లో, గుట్టల్లో ఇచ్చిన పట్టాలు... ఇంటి నిర్మాణానికి ఏ మాత్రం సరిపోని సెంటు, సెంటున్నర స్థలం.. ప్రస్తుత ధరలకు ఏమాత్రం సంబంధం లేని యూనిట్‌ కాస్ట్‌.. వంటి అనేక కారణాలతో గృహ నిర్మాణానికి లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. క్షేత్రస్థాయిలో అధికారులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. పట్టాలు రద్దు చేస్తామని బెదిరిస్తుంటే, కొంతమంది పునాదుల్ని పూర్తి చేసి వదిలేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే.. కలెక్టర్‌ హరినారాయణన్‌ రోజూ టెలికాన్ఫరెన్సు, వారానికి రెండుసార్లు వీడియో కాన్ఫరెన్సు, సమావేశాలు నిర్వహించి ఇళ్ల నిర్మాణంలో పురోగతి చూపాలని ఒత్తిడి చేస్తున్నారని హౌసింగ్‌ అధికారులు అంటున్నారు. 


యూనిట్‌ కాస్ట్‌.. గత ప్రభుత్వం కన్నా తక్కువ 

టీడీపీ హయాంలో ఇక్కో ఇంటికి రూ.2.50 లక్షల యూనిట్‌ కాస్ట్‌ ఉండేది. ఇందులో కేంద్ర వాటా రూ.1.50 లక్షలు. రాష్ట్ర వాటా రూ.లక్షగా ఉండేది. అప్పట్లో ధరలు కూడా సాధారణ స్థితిలో ఉండేవి. ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు అదనంగా రూ.50 వేల నుంచి ఓ రూ.లక్ష వరకు ఖర్చు చేసుకుంటే సెంటున్నర స్థలంలో గృహ నిర్మాణం పూర్తయ్యేది. కరోనా తర్వాత నిర్మాణ సామగ్రి ధరలు రెట్టింపయ్యాయి. ఈ క్రమంలో యూనిట్‌ కాస్ట్‌ కూడా రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలు అవుతుందని లబ్ధిదారులు ఆశ పెట్టుకున్నారు. కానీ, వైసీపీ ప్రభుత్వం.. గత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా రూ.70 వేలు తగ్గించి, రూ.1.80 లక్షలుగా చేసేసింది. ఇందులో రూ.1.50 లక్షలు కేంద్ర వాటా కాగా, రూ.30 వేలను ఉపాధిహామి పథకం వాటా (ఇది కూడా కేంద్రమే). ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం వాటా శూన్యం. 


లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదెందుకంటే..? 

ప్రభుత్వం గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు స్థలం ఇచ్చింది. కనీసం 340 చదరపు అడుగుల నుంచి 750 చ.అడుగుల వరకు ఇంటిని నిర్మించుకునేందుకు అనుమతిచ్చింది. ఇప్పటివరకు నిర్మించుకున్న ఇళ్లను పరిశీలిస్తే, చాలామంది 550 చదరపు అడుగుల్లో నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇప్పుడున్న ధరల ప్రకారం.. ఈ విస్తీర్ణంలో ఇంటిని నిర్మించాలంటే, కనీసం రూ.6.10 లక్షలు ఖర్చవుతుంది. ప్రభుత్వం మాత్రం నాలుగు దశల్లో రూ.1.50 లక్షలు ఇస్తోంది. పునాది పూర్తయితే రూ.70 వేలు, గోడల తర్వాత రూ.37,600, స్లాబ్‌ వేశాక రూ.21,200, నిర్మాణం పూర్తయ్యాక రూ.21,200 చొప్పున మొత్తం రూ.1.50 లక్షలు అందిస్తోంది. దీనికి అదనంగా ఉపాధిహామీ పథకం కింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు, కూలీలకు రూ.18 వేలు ఇస్తున్నారు. లబ్ధిదారులు ముందుకు రాకపోవడానికి గల కారణాల్లో యూనిట్‌ కాస్ట్‌ సరిపోకపోవడం ప్రధానమైంది.


లబ్ధిదారులకు పక్కా గృహాలను నిర్మించే ఓ మేస్త్రీ చెప్పిన లెక్కల ప్రకారం.. ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఖర్చు

పునాది గుంతలో వేసే రాళ్లు: 6 లోడ్లు. ఒక్కోటి రూ.1500. మొత్తం రూ.9 వేలు

పునాది నిర్మాణానికి రాళ్లు: 5 లోడ్లు. ఒక్కో లోడు రూ.3800. మొత్తం రూ.19 వేలు

గోడల నిర్మాణానికి ఇటుకలు: 5 లోడ్లు. ఒక్కోటి రూ.10,500. మొత్తం రూ.52,500

సిమెంటు: 250 బస్తాలు. రూ.390 చొప్పున మొత్తం రూ.97,500

ఇసుక: 15 లోడ్లు. కనీసం రూ.3 వేలు చొప్పున రూ.45 వేలు

కంకర: 3 లోడ్లు. ఒక్కోటి రూ.3200 చొప్పున రూ.9600, ఉడ్‌ వర్క్‌: రూ.25 వేలు, 

స్లాబు సెంట్రింగ్‌: రూ.18 వేలు, కరెంటు వైరింగ్‌: 15 వేలు, కూలీలకు: రూ.1.80 లక్షలు. ఇవి కాకుండా, రంగులు వేయించడం, బండలు పర్చడం.. వంటి అనేక పనులున్నాయి. 


ఒక్కరూ నిర్మాణం మొదలు పెట్టలేదు 

ఇది పాలసముద్రం మండలంలోని శ్రీకావేరిరాజపురం లేఅవుట్‌. ఇక్కడ 25 మందికి పట్టాలిచ్చారు. ఊరికి దూరంగా ఉండడంతో ఒక్కరూ నిర్మాణం మొదలు పెట్టలేదు. ఎస్‌ఆర్‌ఆర్‌ కండ్రిగ, కన్నికాపురం, మణిపురం గ్రామాల్లోనూ గుట్టల్లో పట్టాలిచ్చారు. అక్కడా నిర్మాణాలు ప్రారంభం కాలేదు. అసలు ఈ ప్రాంతంలో సెంటున్నర అంటే లబ్ధిదారులు బాగా తక్కువగా భావిస్తున్నారు. అధికారులు ఎంతలా ప్రోత్సహించినా నిర్మాణాలు ప్రారంభించడం లేదు. నిర్మాణాల్లో పురోగతి లేదని ఇక్కడి ఏఈ సత్యనారాయణ జీతాన్ని కలెక్టర్‌ ఆపేశారు. నగరి మండలంలో కొత్తగా 161 పక్కా గృహాలు మంజూరయ్యాయి. వాటిలో 64 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. దీంతో తహసీల్దార్‌, ఎంపీడీవో, హౌసింగ్‌ ఏఈలకు జీతాలు ఆపేశారు.  ఎస్‌ఆర్‌పురం మండలంలో 2150 గృహాల నిర్మాణం పూర్తవగా, 225 ఇళ్లను లబ్ధిదారులు ప్రారంభించ లేదు. అంటే సుమారు పది శాతం. దాని కోసం ఆ మండలంలో అధికారుల జీతాలు ఆపేయాలంటూ కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు.


మనమే ఫస్టు 

పూర్తయిన ఇళ్లు.. పునాదుల కంటే పైస్థాయికి చేరిన వి.. పెట్టిన ఖర్చు.. ఇలా ఏ రకంగా చూసుకున్నా రాష్ట్రంలో మన జిల్లానే ప్రథమ స్థానంలో ఉందని అధికారులు అంటున్నారు. మిగతా జిల్లాలేవీ దరిదాపుల్లో లేవు. ఇటీవల జరిగిన ఓ వీసీలో కలెక్టర్‌ హరినారాయణన్‌ రాష్ట్ర ఉన్నతాధికారులు అభినందించారు. 


అయినా.. ఒత్తిళ్లు  

అనువుగాని చోట ప్లాట్లు ఇవ్వడం.. యూనిట్‌ కాస్ట్‌ తక్కువగా ఉండటం వల్ల ఇళ్లు కట్టుకోవడానికి లబ్ధిదారులు ముందుకు రాలేదు. క్షేత్రస్థాయిలో పలువురిని ఒప్పంచి కాస్తోకూస్తో పనులు చేయించడంతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచినా.. ఇంకా టార్గెట్ల పేరిట ఉన్నతాధికారులు వేధిస్తున్నారని పలువురు హౌసింగ్‌ అధికారులు వాపోతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. 


ఆగిన జీతాలు!  

ఆయా మండలాల్లో నిర్మాణాల పురోగతి సరిగా లేదని ఆరుగురు హౌసింగ్‌ ఏఈలతో పాటు ఓ డీఈ జీతాన్ని నిలిపేశారు. పూతలపట్టు, చిత్తూరు, బైరెడ్డిపల్లె, పాలసముద్రం, పులిచెర్ల, నగరి హౌసింగ్‌ ఏఈలు శ్రీనివాసన్‌, రామభద్రనాయుడు, స్వామిదాస్‌, సత్యనారాయణ, త్యాగరాజు, రాఘవయ్యతో పాటు పుంగనూరు డీఈ మధుసూదన్‌రెడ్డి జీతం ఆపేయాలంటూ కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు. వీరితోపాటు ఆయా మండలాల తహసీల్దార్‌, ఎంపీడీవోల జీతాలూ ఆపేయాలని కలెక్టర్‌ ఆదేశించగా, నివేదిక సిద్ధమవుతున్నట్లు తెలిసింది. 


ఇదీ లెక్క 

జిల్లాకు మంజూరైన ఇళ్లు: 73,675 

పూర్తయినవి: 4,040 

పునాది దశ దాటినవి: 34,749 

పునాది స్థాయి కిందట: 24,163

ప్రారంభం కానివి: 10723 

ఇప్పటి వరకైన ఖర్చు: రూ.345.67 కోట్లు 


ఇళ్లకు డ్వాక్రా రుణాలివ్వండి 

చిత్తూరు రూరల్‌: చిత్తూరు మండలంలోని తుమ్మింద, పెద్దిశెట్టిపల్లి పంచాయతీల్లోని హౌసింగ్‌ లేఅవుట్లను శుక్రవారం కలెక్టర్‌ హరినారాయణన్‌ పరిశీలించారు. తుమ్మిందలో 22 ఇళ్లు మంజూరుకాగా.. 13కు మాత్రమే పునాదులు పడ్డాయి. మిగిలిన లబ్ధిదారులను కలెక్టర్‌ విచారించగా.. ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని, సాయం అందించాలని వారు కోరారు. డ్వాక్రా సంఘాల ద్వారా అర్హులకు రుణాలు మంజూరు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. లేఔట్‌లో నీటి సౌకర్యం కల్పించాలన్నారు.  

Updated Date - 2022-05-21T08:12:08+05:30 IST