అద్దె ఎప్పుడిస్తారన్నా..?

ABN , First Publish Date - 2022-09-28T04:09:15+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలకు పది నెలలుగా అద్దె చెల్లించడం లేదు. దీంతో రైతు భరోసా కేంద్రాలకు తమ భవనాలను ఇచ్చిన వాళ్లు.. అద్దె ఎప్పుడిస్తావు.. అన్నా.. అంటూ లబోదిబోమంటున్నారు.

అద్దె ఎప్పుడిస్తారన్నా..?
చిన్నమండెం మండలం కేశాపురంలో అద్దె భవనంలో నడుస్తున్న రైతు భరోసా కేంద్రం

పది నెలలుగా రైతు భరోసా కేంద్రాలకు అద్దె బకాయి

జిల్లాలో 181 కేంద్రాలు అద్దె భవనాల్లోనే...


(రాయచోటి - ఆంధ్రజ్యోతి): 

సాధారణంగా మనం అద్దె ఇంట్లో ఉన్నాం అనుకుందాం.. ఒక నెల బాడుగ ఇవ్వకపోతే.. వెంటనే ఇంటి యజమాని వచ్చి అడుగుతాడు. అదే రెండు మూడు నెలలైతే ఓ మోస్తారు గొడవే చేస్తాడు. అదే పది నెలల పాటు అయితే.. రచ్చ చేసి ఇంట్లోని సామాన్లన్నీ బజారులో వేస్తాడు.. అవసరం అయితే.. ఇల్లు ఖాళీ చేయమని పోలీసుస్టేషన్‌కు వెళ్తాడు. అయితే పది నెలల పాటు బాడుగ ఇవ్వకపోయినా గట్టిగా అడిగే సాహసం చేయలేకపోతున్నారంటే.. వాళ్లు కచ్చితంగా ప్రభుత్వానికి అద్దెకు ఇచ్చి ఉంటారని మనం అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలకు పది నెలలుగా అద్దె చెల్లించడం లేదు.  దీంతో రైతు భరోసా కేంద్రాలకు తమ భవనాలను ఇచ్చిన వాళ్లు.. అద్దె ఎప్పుడిస్తావు.. అన్నా.. అంటూ లబోదిబోమంటున్నారు. మధ్యలో అధికారులు అటు ప్రభుత్వాన్ని గట్టిగా అడగలేక.. ఇటు రైతు భరోసా కేంద్రాన్ని అద్దెకు ఇచ్చిన వారికి సమాధానం చెప్పుకోలేక నలిగిపోతున్నారు. ఈ పరిస్థితి కేవలం ఒక జిల్లాకే కాకుండా రాష్ట్రమంతా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో రైల్వేకోడూరు, రాజంపేట, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, పీలేరు, వాల్మీకిపురం, మదనపల్లె వ్యవసాయ డివిజన్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 400 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ భవనాల్లో 187 కేంద్రాలు నడుస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం కొత్తగా రైతు భరోసా కేంద్రాల కోసం 32 భవనాలు నిర్మించింది. మిగిలిన 181 కేంద్రాలు ప్రైవేటు వ్యక్తులకు చెందిన భవనాల్లో నడుస్తున్నాయి. ఈ భవనాలకు పది నెలలుగా అద్దె చెల్లించలేదు. దీంతో రైతు భరోసా కేంద్రాలకు తమ భవనాలను అద్దెకు ఇచ్చిన వారు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. బడ్జెట్‌ రాలేదని రాగానే.. ఇస్తామని అధికారులు సమాధానం చెప్పి పంపుతున్నారు. తొలుత ప్రభుత్వ పాఠశాలల్లో సైతం రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే హైకోర్టు దీనిపై తీవ్రంగా స్పందించింది. వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో వాటిని ఖాళీ చేసి ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకున్నారు. 


పది నెలలుగా బకాయిలు

జిల్లాలో ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుని రైతు భరోసా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి భవనం స్థాయిని బట్టి రూ.2500 మొదలు రూ.5500 వరకు అద్దెకు నిర్ణయించారు. ఈ లెక్కన ఒక్కో రైతు భరోసా కేంద్రానికి రూ.25 వేల నుంచి రూ.55 వేల వరకు ప్రభుత్వం బకాయి ఉంది. తమ భవనాలను అద్దెకు ఇచ్చిన వారు అద్దె కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అఽధికారులు చేసేదేమీ లేక బడ్జెట్‌ రాలేదు, ప్రభుత్వానికి పంపించాము.. రాగానే.. మీకు ఇచ్చేస్తాం.. అని సమాధానం చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు. తమ పాలనలో ఆదాయం పెరిగిందని సాక్షాత్తు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించిన నేపధ్యంలో తమ బాడుగ ఎంత ? వెంటనే ఇచ్చేయచ్చు కదా..! అని ఇంటి యజమానులు వాపోతున్నారు. తమకు ప్రభుత్వం అద్దె ఇవ్వడం లేదని ‘ఆంధ్రజ్యోతి’ దృష్టికి తెచ్చిన కొందరు తమ అభిప్రాయాన్ని చెప్పమంటే పేపర్లలో మా పేరు వస్తే... ఇంకేమైనా ఉందా..? లేనిపోని సమస్యలు వస్తాయని భయపడుతున్నారు. 


పది నెలలుగా అద్దె ఇవ్వాలి

- సువర్ణలత, ఏడీ, రాయచోటి

పది నెలలుగా ప్రైవేటు భవనాల్లో నడుస్తున్న రైతు భరోసా కేంద్రాలకు అద్దె చెల్లించాలి. ఇంకా బడ్జెట్‌ రాలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.. బడ్జెట్‌ రాగానే.. వారందరికీ బాడుగలు చెల్లిస్తాం. 

Updated Date - 2022-09-28T04:09:15+05:30 IST