చెల్లించేదెప్పుడో?

ABN , First Publish Date - 2022-08-05T04:02:53+05:30 IST

జిల్లాలో వాటర్‌ షెడ్‌ పథకంలో పనులు చేసిన వారికి నేటికీ బిల్లులు చెల్లించడం లేదు. మూడేళ్లుగా చెల్లింపులు నిలిచిపోయినా పట్టించుకునే వారే కరువయ్యారు. సంబంధిత కాంట్రాక్టర్లు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా మోక్షం లభించడం లేదు. దీంతో వారు లబోదిబోమంటున్నారు. అప్పులు చేసి మరీ పనులు చేపట్టామని, ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకపో

చెల్లించేదెప్పుడో?
సహజ వనరుల అభివృద్ధిలో చేపట్టిన వాటర్‌ ట్యాంకు (ఫైల్‌)

 వాటర్‌ షెడ్‌ పథకంలో చేపట్టిన పనులకు నిలిచిన చెల్లింపులు

 మూడేళ్లుగా బిల్లులకు లభించని మోక్షం

 సర్కారు తీరుపై విమర్శల వెల్లువ

(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో వాటర్‌ షెడ్‌ పథకంలో పనులు చేసిన వారికి నేటికీ బిల్లులు చెల్లించడం లేదు. మూడేళ్లుగా చెల్లింపులు నిలిచిపోయినా పట్టించుకునే వారే కరువయ్యారు. సంబంధిత కాంట్రాక్టర్లు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా మోక్షం లభించడం లేదు. దీంతో వారు లబోదిబోమంటున్నారు. అప్పులు చేసి మరీ పనులు చేపట్టామని, ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకపోతే తామెలా బతకాలని వారు ఆవేదన చెందుతున్నారు. దీనిపై సర్కారు స్పందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వాస్తవంగా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని సబ్‌ప్లాన్‌ మండలాల్లో 2012లో వాటర్‌ షెడ్‌ పథకం కింద పనులు చేపట్టారు. ప్రకృతి జల వనరులు సద్వినియోగం చేసుకోవడమే ఈ పథకం లక్ష్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించే ఈ పథకం కింద అప్పట్లో రూ. 65 కోట్లు మంజూరయ్యాయి. ఏడేళ్ల కాల వ్యవధిలో ఈ నిధులతో పనులు పూర్తి చేయాలన్న నిబంధన విధించారు. ఈ మేరకు వాగుల్లో నీటిని వ్యవసాయం కోసం వినియోగించుకోవడం, భూగర్భ జలాలను పెంపొందించడం, నీటి నిల్వ చేసుకునేలా చెరువులు, చెక్‌ డ్యాములు నిర్మించడం, మట్టి కోత నివారణకు రాతి గట్లు వేయడం, రాతి కట్టు పనులు చేయించడం తదితర అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే పథకం ముగిసినా నాడు చేపట్టిన పనులకు బిల్లులకు చెల్లింపులు జరగకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పనులు ఇలా.. 

గత ఎన్నికలకు ముందు గిరిజన ప్రాంతాల్లోని 60 పంచాయతీల్లో వాటర్‌ షెడ్‌ పథకం కింద పనులు చేపట్టారు. వాటికి సంబంధించి అప్పటి టీడీపీ ప్రభుత్వం చెల్లింపులు చేసింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లుల చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. మంజూరైన రూ. 65.5 కోట్ల నిధుల్లో అగ్రభాగం 56 శాతం అంటే సుమారు రూ.36 కోట్లతో సహజ వనరుల అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. మిగిలిన సొమ్ము ఉద్యోగుల జీతభత్యాలు, కార్యాలయాల నిర్వహణ, ఇలా వివిధ రకాలుగా నిబంధనల ప్రకారం ఖర్చు చేయాల్సి ఉంది. కాగా రూ. 36 కోట్లలో రూ. 20 కోట్లతో సహజ వనరులు అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో సుమారు రూ. 7.5 కోట్లను పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వం బిల్లుల చెల్లింపులను పూర్తిగా నిలిపివేసింది. అసలు వాటర్‌ షెడ్‌ పథకం కింద మంజూరైన రూ. 65.5 కోట్లలో 60 శాతం కేంద్ర ప్రభుత్వం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంలో చెల్లింపులు జరగాలి. అయితే జిల్లాలో ఆ పరిస్థితి లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించిన సహజ వనరుల అభివృద్ధి పనులకు చెల్లింపులు జరగడం లేదు. కేంద్రం తన వాటాను చెల్లించ లేదా లేక కేంద్రం చెల్లించినా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించలేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై అధికారులు కూడా నోరు విప్పడం లేదు. మొత్తంగా సర్కారు తీరుతో కాంట్రాక్టర్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఏళ్లు గడుస్తున్నా బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇటీవల మార్కొండపుట్టి, నంద, పనసభద్ర గ్రామాలకు చెందిన వారు జాయింట్‌ కలెక్టర్‌కు తెలియజేశారు. తక్షణమే స్పందించి తమ సమస్య పరిష్కరించాలని వారు వినతిపత్రం అందించారు.

బిల్లులు చెల్లిస్తాం..

సుమారు రూ. 7 కోట్లకు పైబడి చెల్లింపులు జరగాల్సి ఉంది. త్వరలోనే చెల్లింపులు చేస్తాం. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులకు బిల్లులు అప్‌లోడ్‌ చేశాం.

- శాంతేశ్వరరావు, ఇన్‌చార్జి వాటర్‌ షెడ్‌ పీడీ


Updated Date - 2022-08-05T04:02:53+05:30 IST