జీతం చెల్లించేదెప్పుడో?

ABN , First Publish Date - 2022-07-10T04:15:12+05:30 IST

నందిగాం మండలం పెద్దలవునిపల్లి మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో షేక్‌ ఖరీం మునీషా లాంగ్వేజ్‌ హిందీ పండిట్‌గా పని చేస్తోంది. ఆమె విధుల్లో చేరి మూడేళ్లవుతున్నా ఇంతవరకు ఒక్కపైసా జీతం కూడా అందలేదు. అప్పు చేసి కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి. ఇలా జీతభత్యాలకు నోచుకోని హిందీ పండిట్లు జిల్లాలో 37 మంది ఉన్నారు. వీరంతా వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు.

జీతం చెల్లించేదెప్పుడో?

వేతనానికి నోచుకోని హిందీ పండిట్లు
మూడేళ్లుగా ఎదురుచూపు
కోర్టును ఆశ్రయించిన 37 మంది
 (టెక్కలి)

నందిగాం మండలం పెద్దలవునిపల్లి మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో షేక్‌ ఖరీం మునీషా లాంగ్వేజ్‌ హిందీ పండిట్‌గా పని చేస్తోంది. ఆమె విధుల్లో చేరి మూడేళ్లవుతున్నా ఇంతవరకు ఒక్కపైసా జీతం కూడా అందలేదు. అప్పు చేసి కుటుంబాన్ని పోషించుకోవాల్సిన  పరిస్థితి. ఇలా జీతభత్యాలకు నోచుకోని హిందీ పండిట్లు జిల్లాలో 37 మంది ఉన్నారు. వీరంతా వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 2002 డీఎస్సీలో 338 మంది అర్హత సాధించారు. వీరు ఒడిశాతో పాటు ఇతర రాష్ట్రాల్లో హిందీ పండిట్లగా శిక్షణ పొందడంతో ఆ సర్టిఫికెట్లు చెల్లవంటూ వీరికి పోస్టింగ్‌ ఇవ్వలేదు. దీంతో కొందరు హిందీ పండిట్లు కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో 2008, 2012, 2019లలో ఆయా పాఠశాలల్లో విడతల వారీగా లాంగ్వేజ్‌ హిందీ పండిట్ల నియామకాలు చేపట్టారు. ఇందులో భాగంగా 2019 జూలైలో 39 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ బ్యాచ్‌కు చెందిన ఇద్దరు చనిపోయారు. మిగిలిన 37మంది విధుల్లో చేరారు. అయితే, మూడేళ్లుగా వీరు జీతభత్యాలకు నోచుకోవడం లేదు. జిల్లాలో వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న వీరికి బదిలీలు కూడా జరిగాయి. జీతభత్యాల కోసం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, విద్యాశాఖ కమిషనర్‌, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం ద్వారా వినతులు ఇస్తున్నా ఫలితం శూన్యం.  దీంతో వీరంతా మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు జీతాలు చెల్లించాలని కోరుతున్నారు.  

 

Updated Date - 2022-07-10T04:15:12+05:30 IST