ఇళ్లు ఎప్పుడిస్తారు?

ABN , First Publish Date - 2022-01-18T05:13:58+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పథకం పునాదులు దాటడం లేదు. అక్కడక్కడ నిర్మాణ పనులు సాగుతున్నా, కొన్ని చోట్ల పూర్తయినా, పేదలకు మాత్రం ఇళ్లు దక్కడం లేదు. ఏళ్లు గడుస్తున్నా సొంత ఇంటి కల ఎప్పుడు నెరవేరుతుందో తెలియక పేదలు కళ్లలో వత్తులు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు.

ఇళ్లు ఎప్పుడిస్తారు?

 - నెరవేరని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కల

- మంజూరు ఘనం... ఇచ్చింది శూన్యం 

- నత్తనడకన నిర్మాణ పనులు 

- లబ్ధిదారుల ఎంపికలోనూ జాప్యం 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పథకం పునాదులు దాటడం లేదు. అక్కడక్కడ నిర్మాణ పనులు సాగుతున్నా, కొన్ని చోట్ల పూర్తయినా, పేదలకు మాత్రం ఇళ్లు దక్కడం లేదు. ఏళ్లు గడుస్తున్నా సొంత ఇంటి కల ఎప్పుడు నెరవేరుతుందో తెలియక పేదలు కళ్లలో వత్తులు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉన్నది. ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండగా లబ్ధిదారుల ఎంపిక జరగడం లేదు. కరీంనగర్‌, మానకొండూర్‌ నియోజకవర్గాల్లో హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని చిగురుమామిడిలో కొందరికి మాత్రమే నామమాత్రంగా ఇళ్ల పంపిణీ జరిగింది. మిగతా ప్రాంతాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉండడంతో వచ్చే ఎన్నికల నాటికైనా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి పంపిణీ చేస్తారా అని పేదలు ప్రశ్నిస్తున్నారు. 


6,494 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు మంజూరు


కరీంనగర్‌ జిల్లాలో 6,494 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు మంజూరయ్యాయి. టెండర్లు పిలిచినవి 6,231, అగ్రిమెంట్లు అయినవి 4,803, వీటిలో 789 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 332 ఇళ్లు పంపిణీ చేశారు. 2,736 ఇళ్ల నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. 1947 ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 


ముఖ్యమంత్రి దత్తత గ్రామంలో లబ్ధిదారులకు అందజేత


సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్‌లో 247 ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందించారు. కరీంనగర్‌ నియోజకవర్గంలో 55, మానకొండూర్‌ నియోజకవర్గంలో 20 ఇళ్లను మాత్రమే లబ్ధిదారులకు ఇటీవల పంపిణీ చేశారు. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో 243, హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 264, మానకొండూర్‌ నియోజకవర్గంలో 75, కరీంనగర్‌ నియోజకవర్గంలో 207 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటిలో 332 ఇళ్లను లబ్ధిదారులకు అందించగా 457 ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ప్లాస్టరింగ్‌ దశలో మరో 1360 ఇళ్లు ఉండడంతో వాటిని త్వరలోనే పూర్తిచేసి పంపిణీ చేస్తామని చెబుతున్నారు. కరీంనగర్‌, హుజురాబాద్‌, జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలో ఇళ్ల నిర్మాణాలు చివరి దశకు చేరుకోగా మిగతా చోట్ల పనులు పునాదులకే పరిమితమయ్యాయి. పల్లెల్లో మాత్రం ఇళ్ల నిర్మాణాలు ఛాయకే కనిపించడం లేదు. ప్రతి గ్రామంలో 5 నుంచి 25 వరకు ఇళ్లను లబ్దిదారులకు కేటాయించారు. చాలాచోట్ల ఈ సంఖ్య తక్కువగా ఉండడంతో లబ్ధిదారుల ఎంపిక కష్టమనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు ఇళ్ల నిర్మాణాలను పట్టించుకోవడం లేదని తెలిసింది.


 గ్రామాల్లో ప్రారంభం కాని నిర్మాణాలు


 కొన్నిచోట్ల రెండు, మూడు గ్రామాలకు మధ్య డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు స్థలం చూపించినా అది ఆచరణలో సాధ్యం కాలేదు. హుస్నాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని చిగురుమామిడి, సైదాపూర్‌ మండలాల్లో ఇప్పటికీ ఇబ్బందులెదురవుతూనే ఉన్నాయి. చొప్పదండి నియోజకవర్గంలో 707 ఇళ్లను మంజూరు చేయగా ఇప్పటికీ 244 ఇళ్ల పనులు ప్రారంభానికే నోచుకోలేదు. చిగురుమామిడి, సైదాపూర్‌ మండలాల్లో 495 ఇళ్లకుగాను 243 పూర్తికాగా మిగతా 264 వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మూడు వేల ఇళ్లను మంజూరు చేయగా, 1300 ఇళ్లు నిర్మాణంలో ఉండగా 1700 ఇళ్లకు మోక్షమే లేకుండా పోయింది. కరీంనగర్‌ నియోజకవర్గంలో 1400 ఇళ్లకుగాను వెయ్యి ఇళ్ల నిర్మాణాలు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. మానకొండూర్‌ నియోజకవర్గంలో 890 ఇళ్లకుగాను 242 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఆరు సంవత్సరాలుగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలపై మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహించి వేగంగా నిర్మాణ పనులను పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలని ఆదేశించినప్పటికి ఆచరణలో అది సాధ్యం కావడం లేదు. ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడం, నిర్మాణ వ్యయం, ఖర్చులు పెరిగిపోవడం కారణంగా కాంట్రాక్టర్లు కూడా పనులను పూర్తిచేసేందుకు ముందుకు రావడం లేదు.  పేద ప్రజల సొంతింటి కల నెరవేరుతుందో, లేదో వేచి చూడాలి. 


Updated Date - 2022-01-18T05:13:58+05:30 IST