‘డబుల్‌’ ఇల్లు పూర్తయ్యేదెన్నడు...?

ABN , First Publish Date - 2022-05-08T04:43:25+05:30 IST

గూడు లేని పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామన్న ప్రభుత్వ హామీ ఏడేళ్లు గడుస్తున్నా నెరవేరడం లేదు. డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించడం పేదల ఆత్మగౌరవ ప్రతీక అని చెబుతున్న తెలంగాణ సర్కారు వాటి నిర్మాణం పూర్తిచేసి, లబ్ధిదారులకు అందించడంలో తీవ్రమైన జాప్యం చేస్తోంది

‘డబుల్‌’ ఇల్లు పూర్తయ్యేదెన్నడు...?
మంచిర్యాలలో చివరిదశ నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్రూం ఇళ్లు

- నత్తనడకన సాగుతున్న నిర్మాణ పనులు
- నిర్మాణం పూర్తయిన చోట పంపిణీకి నోచుకోని వైనం
- మితిమీరిన రాజకీయ జోక్యమే కారణం
- మరోవైపు రూ. 3 లక్షల పథకంపై ప్రభుత్వం కసరత్తు

మంచిర్యాల, మే 7 (ఆంధ్రజ్యోతి): గూడు లేని పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామన్న ప్రభుత్వ హామీ ఏడేళ్లు గడుస్తున్నా నెరవేరడం లేదు. డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించడం పేదల ఆత్మగౌరవ ప్రతీక అని చెబుతున్న తెలంగాణ సర్కారు వాటి నిర్మాణం పూర్తిచేసి, లబ్ధిదారులకు అందించడంలో తీవ్రమైన జాప్యం చేస్తోంది. జిల్లాకు 2,416 డబుల్‌ ఇళ్లు మంజూరు కాగా ఒక్కొక్కటి రూ. 5.30 లక్షల అంచనాతో నిర్మించ తలపెట్టారు. మరో 418 ఇళ్ల నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తి కాలేదంటే డబుల్‌ ఇళ్ల నిర్మాణంలో అధికారులు తీసుకుంటున్న చర్యలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. జిల్లాలో ఒక్క మంచిర్యాల మినహా మరెక్కడా లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. కొన్ని చోట్ల నిర్మాణం పూర్తయినా లబ్ధిదారుల ఎంపికలో జాప్యం కారణంగా పంపిణీకి నోచుకోవడం లేదు. లబ్ధిదారుల ఎంపికలో తీవ్రమైన రాజకీయ జోక్యం కారణంగా ఆ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. మున్సిపాలిటీల పరిధిలో లబ్ధిదారులను ఎంపిక చేయడంలో కొందరు కౌన్సిలర్లు పక్షపాత ధోరణి అవలంభిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

- నత్తనడక నిర్మాణ పనులు
మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజక వర్గాల పరిధిలో మొత్తం 2416 డబుల్‌ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో మంచిర్యాల నియోజకవర్గానికి 685 ఇండ్లు మంజూరు కాగా 650 ఇళ్లకు టెండర్లు పూర్తయ్యాయి. వీటిలో 430 నిర్మాణాలు ప్రారంభంకాగా 220 నిర్మాణాలు ప్రారంభించ వలసి ఉంది. మంచిర్యాలకు సంబంధించి రాజీవ్‌నగర్‌లో డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టగా ఇప్పటి వరకు 358 నిర్మాణాలు పూర్తయ్యాయి. 42 ఇళ్ల నిర్మాణాలు చివరి దశలో ఉండగా 250 ఇళ్లకు సంబంధించి 50 శాతం మేర పనులు పూర్తయ్యాయి.
చెన్నూరు నియోజకవర్గానికి 1146 మంజూరు కాగా వీటిలో మందమర్రిలో 560, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీకి 286, చెన్నూరుకు 300 ఇండ్లు కేటాయించారు. వీటిలో 194 ఇళ్ల నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. మిగతా వాటిలో మందమర్రిలో 160 ఇళ్లు 50 శాతం మేర పూర్తికాగా, 400 ఇళ్లు చివరి దశలో ఉన్నాయి. బెల్లంపల్లి నియోజక వర్గానికి 585 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 170 ఇళ్ల నిర్మాణం కొనసాగుతుండగా మరో 415 ఇళ్లకు సంబంధించి స్థలం వివాదం కొనసాగుతోంది. నిర్మాణం చేపట్టిన వాటిలో 30 శాతం మేర మాత్రమే పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

- స్థలాలు కోల్పోయినా ఇళ్ల పంపిణీకి నో...
జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో 2007-08లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు లేని నిరుపేదలకు సర్వే నెంబర్‌ 345లో నివేశన స్థలాలు పంపిణీ చేసింది.  ఎంపిక చేసిన లబ్ధిదారులకు రెవెన్యూ అధికారులు పట్టాలు జారీ చేయడంతోపాటు 75 గజాల చొప్పున స్థలం అప్పగించారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని అప్పటి 32 వార్డుల్లో 22 వార్డులకు చెందిన సుమారు మూడు వేల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. వాటిలో దాదాపు 80 శాతం మంది లబ్ధిదారులు రూ.50వేల నుంచి లక్ష వరకు ఖర్చుచేసి బేస్మెంట్లు, పిల్లర్లు నిర్మించుకొగా మరికొందరు స్థలాలను ఖాళీగా వదిలివేశారు. ఆర్థికస్థోమత ఉన్న వారు ఆ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత డబుల్‌ బెడ్రూం ఇళ్ల విషయం తెరమీదకు వచ్చింది. దీంతో 2019-20లో అధికారులు సర్వే నెంబర్‌ 345లో వెలసిన నిర్మాణాలను కూల్చివేశారు. లబ్ధిదారులు తమ వద్ద ఉన్న ఆధారాలతో అధికారులకు విన్నవించడంతో డబుల్‌ బెడ్రూం ఇళ్లకు ఎంపిక చేస్తామని, ప్రస్తుతం ఉన్న కట్టడాలను తొలగించి అదే ప్రాంతంలో డబుల్‌ ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రెండు సంవత్సరాలు గడిచినా డబుల్‌ బెడ్రూం ఇళ్ల ప్రస్తావన రాకపోవడంతో ఇటీవల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఇంటి వద్ద ఆందోళన సైతం చేపట్టారు.

- మొక్కుబడిగా లబ్ధిదారుల ఎంపిక...
డబుల్‌ బెడ్రూం ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికను అధికారులు మొక్కుబడిగా చేపడుతున్నారు. జిల్లాలో పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడంలో అధికారులు తాత్సారం చేస్తున్నారు. మంచిర్యాల నియోజక వర్గానికి సంబంధించి గత సంవత్సరం ఏప్రిల్‌ 7న రాజీవ్‌నగర్‌లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, కలెక్టర్‌ భారతి హోళి చేతుల మీదుగా కేవలం 30 మంది లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేశారు. ఇక్కడ 358 ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నా లబ్ధిదారులను ఎంపిక చేయనందున పంపిణీకి నోచుకోవడం లేదు. రాజకీయ జోక్యం కారణంగా అధికారులు ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
\

- రూ. 3 లక్షల పథకంపై ప్రభుత్వం కసరత్తు
సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునే వారికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించే పథకంపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి విధివిధానాల రూపకల్పనపై రాష్ట్ర గృహ నిర్మాణశాఖ అధికారుల నుంచి ప్రతిపాదనలు అందాయి. రూ.3 లక్షల మొత్తాన్ని నాలుగు విడతల్లో ఇవ్వాలని నిర్ణయించారు. సొంత ఇంటి స్థలం గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 75 గజాలు, పట్టణ ప్రాంతాల్లో కనీసం 50 గజాలు ఉండాలని ప్రతిపాదించినట్లు సమాచారం. బేస్‌మెంట్‌, గోడలు, శ్లాబ్‌ ఫినిషింగ్‌ నాలుగు దశల్లో రూ.75 వేల చొప్పున ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. 2022-23లో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మందికి సాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే గతంలో డబుల్‌ బెడ్రూం ఇళ్లు పొందిన వారు ఈ పథకానికి అనర్హులుగా నిర్ణయించారు. దీంతో డబుల్‌ బెడ్రూం ఇళ్లకు దరఖాస్తులు చేసుకున్న వారు ఆందోళనకు గురవుతున్నారు.

Read more