పరిహారం ఎప్పుడిస్తారు?

ABN , First Publish Date - 2022-10-03T05:30:00+05:30 IST

ప్రభుత్వం మీద నమ్మకంతో రూ.లక్షలు అప్పు చేసి ఇళ్లు కట్టుకున్న నిర్వాసితులకు నిరాశే మిగిలింది.

పరిహారం ఎప్పుడిస్తారు?
సిమెంటు రోడ్డు, కరెంటు వైర్లు లేని పునరావాస కాలనీ ప్రధాన రోడ్డు

అప్పులు చేసి ఇళ్ల నిర్మాణం

కాలనీలో కనీస సౌకర్యాల కరువు

ఎనిమిదేళ్లుగా అధికారుల హామీల దరువు

శ్రీనివాసపురం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పునరావాస కాలనీ వాసుల ఆవేదన


వారి త్యాగం అసామాన్యం.. సరిహద్దులో సైనికుల మాదిరి తమ ప్రాణాలను త్యాగం చేసి ఉండకపోవచ్చు.. అయితే ఊరి కోసం.. పది మంది జనం కోసం.. తమకు తిండి పెట్టే భూములను ప్రభుత్వం అడిగిన వెంటనే ఇచ్చేసిన త్యాగమూర్తులు.. రాత్రికి రాత్రే పెద్ద వర్షానికి ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తే.. ప్రాణాలరచేత పెట్టుకుని.. పిల్లాజల్లాతో కలిసి ఇళ్లన్నీ ఖాళీ చేసి బయటకు వచ్చేశారు. ప్రభుత్వం సాయం చేస్తుందన్న నమ్మకంతో ఇచ్చిన స్థలంలో అప్పు చేసి ఇళ్లు కట్టుకుని అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. ఎనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వ సాయం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇదిగో.. అదిగో మీకు నష్టపరిహారం ఇస్తాం.. మీ కాలనీలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.. అని గత ఎనిమిదేళ్లుగా అధికారులు చెబుతున్నారే కానీ పైసా కూడా వారికి ఇవ్వలేదు. చిన్నమండెం మండలంలో నిర్మించిన శ్రీనివాసపురం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (జలాశయం) నిర్వాసితుల దీనగాథ ఇది.


(రాయచోటి- ఆంధ్రజ్యోతి): చిన్నమండెం మండల పరిధిలో హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ఫేజ్‌-2లో భాగంగా 2011లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 0.980 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను ప్రారంభించింది. ఈ రిజర్వాయర్‌లో సుమారు 2 వేల ఎకరాల వరకు భూములు ముంపునకు గురయ్యాయి. అందులో 1500 ఎకరాల వరకు ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూములే ఉన్నాయి. ఈ రిజర్వాయర్‌ వల్ల బండకాడకురవపల్లె, కొత్తవట్టంవాండ్లపల్లె, జల్లావాండ్లపల్లె, దేవగుడిపల్లె కురవపల్లెలకు చెందిన రైతుల భూములు ఇందులో పోయాయి. అయితే రిజర్వాయర్‌ మునకలో బండకాడకురవపల్లె పూర్తిగా మునిగిపోయింది. ఈ పల్లెలో 174 ఇళ్లు ఉండేవి. 2014లో ఎక్కువగా వర్షాలు పడడంతో జలాశయంలోకి ఒక్కసారిగా నీళ్లు వచ్చేశాయి. దీంతో బండకాడకురవపల్లె వాసులు అందరూ ప్రాణాలరచేత పట్టుకుని రిజర్వాయర్‌కు సమీపంలో పునరావాస కాలనీకి ఇచ్చిన 12 ఎకరాల స్థలంలోకి వచ్చేశారు. అప్పటికి మునకలో వెళుతున్న భూములకు ప్రభుత్వం నష్టపరిహారం అయితే ఇచ్చిందే కానీ.. పునరావాస కాలనీకి సంబంధించి పైసా సాయం చేయలేదు.  ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోరుకున్న 154 మంది బండకాడ కుర్వపల్లెకు నిర్వాసితులకు రెండు నెలల్లో మీకు సాయం చేస్తామని అప్పట్లో అధికారులు హామీ ఇచ్చారు. దీంతో అధికారులపై నమ్మకంతో నిర్వాసితులు అప్పు చేసి ప్రభుత్వం ఇచ్చిన ఐదు సెంట్ల స్థలంలో ఇళ్లు నిర్మించుకున్నారు.


కళ్లు కాయలు కాసేలా...

ప్రభుత్వం మీద నమ్మకంతో రూ.లక్షలు అప్పు చేసి ఇళ్లు కట్టుకున్న నిర్వాసితులకు నిరాశే మిగిలింది. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ఒక్కో ఇంటికి రూ.6.75 లక్షలు ఇస్తారని ఎదురు చూస్తూనే ఉన్నారు. మరోవైపు ఇంటి కోసం చేసిన డబ్బుకు వడ్డీలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఎనిమిది సంవత్సరాలుగా తహసీల్దార్‌, ఆర్డీవో, జాయింట్‌ కలెక్టర్‌, కలెక్టర్‌ స్థాయి అధికారులు పలుమార్లు ఈ కాలనీని సందర్శించారు. ప్రభుత్వానికి నివేదికలు పంపించాము. తప్పకుండా త్వరలోనే సాయం అందుతుందని హామీలు ఇస్తూనే ఉన్నారు. ఏళ్లు గడుస్తున్నాయే కానీ అధికారుల హామీలు మాత్రం నెరవేరలేదు. ఇక ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకుల హామీలు చెప్పనవసరమే లేదు. ఇటీవల కలెక్టర్‌ గిరీషా, జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ఆర్డీవో, ఇతర అధికారులతో కలిసి పునరావాస కాలనీని సందర్శించారు. సాధ్యమైనంత త్వరలో మీకు సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కలెక్టర్‌ హామీపై నిర్వాసితులు గంపెడాశలు పెట్టుకుని ఉన్నారు.


కనీస సౌకర్యాలు కరువు

పునరాస కాలనీలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సరైన రోడ్డు సౌకర్యం లేదు. కాలనీలో కనీసం ఒకటి కూడా సిమెంటు రోడ్డు లేదు. అన్నీ మట్టి రోడ్లే ఉన్నాయి. దీంతో వర్షం వస్తే నడవడానికి జనం ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌ స్తంభాలు ఉన్నాయే కానీ.. చాలా వాటికి విద్యుత్‌ వైర్లు లేవు. డ్రైనేజిలు లేవు. వీధుల్లో మోటార్ల వద్ద ఏర్పాటు చేసిన కుళాయిల వద్ద నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. కాలనీకి నీళ్లు అందించేందుకు నిర్మిస్తున్న ఓవర్‌హెడ్‌ ట్యాంకు ఏళ్ల తరబడి పూర్తి కాలేదు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి పునరావాస కాలనీలో అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకున్న వారికి సత్వరమే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ మొత్తాన్ని ఇవ్వాలని, పునరావాస కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు.


ప్రభుత్వం వెంటనే సాయం చేయాలి

- పెద్ద రెడ్డెప్ప, పునరావాసకాలనీ

ప్రభుత్వం డబ్బు ఇస్తుందనే నమ్మకంతో మా భూములు ఇచ్చేశాం. ఇళ్లు ఖాళీ చేసి బయటకు వచ్చేశాం. అప్పు చేసి ఇళ్లు కట్టుకున్నాం. ఎనిమిదేళ్లు అవుతోంది. ఇంకా  ప్రభుత్వం డబ్బు ఇవ్వలేదు. ఇకనైనా మాకు ప్రభుత్వం ఇస్తామన్న డబ్బు ఇవ్వాలి. 


రోడ్లు సరిగా లేవు

- గుడి పెద్ద రమణయ్య, పునరావాస కాలనీ

కాలనీలో సరిగా రోడ్లు లేవు. ఒకటి కూడా సిమంటు రోడ్డు లేదు. వానొస్తే..  నడవానికి కష్టంగా ఉంటోంది. మురికినీటి కాలువలు కూడా లేవు. ప్రభుత్వం వెంటనే సిమెంటు రోడ్లు వేసి.. మురికినీటి కాలువలు ఏర్పాటు చేయాలి.



Updated Date - 2022-10-03T05:30:00+05:30 IST